తిరుమలలో భారీ వర్షం… భక్తులకు తప్పని కష్టం!

174

తిరుమల, జులై 14 (న్యూస్‌టైమ్): తిరుమలలో నాలుగు రోజుల తరువాత మరోసారి భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి మొదలైన వర్షం ఆదివారం తెల్లవారుజాము వరకూ కుండపోతగా కురుస్తూనే ఉంది. గత బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకదాటిగా అర్ధగంట కొనసాగింది.

అదే తరహాలో శనివారం రాత్రి మొదలైన వర్షం ఉరుములు, మెరుపులతో కుండపోతగా కురిసింది. ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో ఆలయం ముందు, పురవీధుల్లో, వాణిజ్య సముదాయం, బస్టాండ్ల వద్ద భక్తులు చెల్లాచెదురయ్యారు. స్వామిని దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులతో పాటు తిరుమలేశున్ని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలబడిన భక్తులు సైతం తడిసిముద్దయ్యారు.

పరుగులు తీసి షెడ్లకింద తలదాచుకున్నారు. జోరువానకు మిట్టప్రాంతాల నుంచి వర్షపునీరు వాగులా ప్రవహించింది. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. పైకప్పులేని దుకాణాలను పట్టలతో కప్పివేశారు. దీంతో రాత్రిపూట వ్యాపారానికి అంతరాయం కలిగింది. వర్షం ఆగినా చల్లటి వాతావరణం ఏర్పడడంతో చలికూడా పెరగింది. దీంతో రాత్రివేళలో భక్తులు గదులకే పరిమితమయ్యారు.

తీవ్ర ఎండలతో ఎండిపోతున్న ఉద్యానవనాలకు ఈ వర్షం ఊపిరిపోయనుంది. వర్షానికి ఘాట్‌లో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద భద్రతా సిబ్బంది మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలని ద్విచక్రవాహనదారులకు హెచ్చరించి పంపారు.

మరోవైపు, అటు తిరుపతిలోనూ రాత్రి 7 గంటలకు భారీ వర్షం కురిసింది. మురికి కాలువలు పొంగిపొరలడంతో వీధులన్నీ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్భరంగా తయారయ్యాయి. మూడు రోజులుగా 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న నగర జనం ఈ వర్షంతో వాతావరణం చల్లబడి కాస్త ఊపిరి పీల్చుకున్నారు.