రుతుపవనాలకు ముందే హైవే పనులు

0
6 వీక్షకులు

న్యూఢిల్లీ, మే 27 (న్యూస్‌టైమ్): జాతీయ రహదారులపై గుంతలు లేకుండా, ట్రాఫిక్‌ సజావుగా సాగేలా జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు తీసుకుంటోంది. కొన్ని రోజుల్లో రాబోతున్న రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులను సిద్ధం చేయాలని, మరమ్మతు, నిర్వహణ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ప్రాంతీయ అధికారులు (ఆర్‌వోలు), ప్రాజెక్టు డైరెక్టర్లను (పీడీలు) ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశించింది.

రుతుపవనాలు భారతదేశాన్ని తాకేలోగా, రద్దీకి అనుకూలంగా జాతీయ రహదారులను పటిష్ట పరచాలన్నది లక్ష్యం. ఆర్‌వోలు, పీడీల ప్రణాళికలకు సాయం చేసేలా, ప్రాధాన్యత పెంచేలా కొత్త మార్గదర్శకాలను ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసింది. దీనివల్ల హైవేల నిర్వహణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగుతుంది. హైవే పనుల ప్రణాళికలు నిర్ధిష్ట గడువులోగా అమలు జరిగేలా చూడటం ఈ మార్గదర్శకాల లక్ష్యం. హైవేల నిర్వహణ కార్యక్రమాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రాంతీయ అధికారులకు ఆర్థిక అధికారాలను ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించింది. గుంతలు, తారు లేచిపోవడం, పగుళ్లు వంటివాటిని గుర్తించేందుకు హైవేల పరిస్థితిని మదింపు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించింది.

ఇందుకు కార్‌ మౌంటెడ్‌ కెమెరాలు, డ్రోన్లు, నెట్‌వర్క్‌ సర్వే వెహికల్స్‌ (ఎన్‌ఎస్‌వీ)ను ఉపయోగించాలని ఆదేశించింది. నిర్వహణ పనులు సాగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు తరచూ నివేదిస్తుండాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. రోడ్ల మరమ్మతులకు సంబంధించిన సమాచారంతోపాటు; మరమ్మతులకు ముందు, తర్వాత అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను ‘ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌-డేటా లేక్’ ద్వారా విశ్లేషిస్తూ పనుల ప్రగతిని ఎన్‌హెచ్‌ఏఐ నిశితంగా గమనిస్తూ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here