(* శ్రీథర్ ఎస్.టి.జి.)

రిత్ర చెక్కుచెదరదు. చరిత్రను మార్చటం, తిరిగి రాయటం అసాధ్యం. చరిత్ర అన్న పదానికి ఉన్న విలువ వెలకట్టలేనిది. రామాయణ, మహాభారతాలు పురాణకాలం నాటి చరిత్రకి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆధునికయుగంలో జరుగుతున్న, జరిగిన వివిధ సంఘటనలను చరిత్రకారులు, రచయితలు భావితరాల కోసం లిఖిత రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. గతాన్ని అద్దంలో వర్తమాన కాలానికి చూపిస్తూ భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకం చేయడంలో చరిత్ర కీలక పాత్ర పోషిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న చారిత్రక సంఘటనలను అనేకమంది వివిధ రూపాలలో పదిల పరుస్తున్నారు. స్వతంత్ర పోరాటం, దేశ విభజన, మహాత్మా గాంధీ దారుణ హత్య, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరణం, లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మృతి, ప్రధానిగా ఇందిరగాంధీ ఎన్నిక, కాంగ్రెస్‌లో చీలిక, ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలవరపరచిన హిందీ ఉద్యమం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల దారుణ హత్యలు, దేశాన్ని అతలాకుతలం చేసిన తీవ్రవాదం వంటి సంఘటనలపై వెలువడిన చారిత్రక రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గత ఏడు దశాబ్దాలలో చోటుచేసుకున్న అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ రాసిన వివిధ వార్తల సమాహారాన్ని ‘కథనాల వెనుక కథలు’ అన్న శీర్షికతో తెలుగులో ప్రచురితమైన పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవవలసిన అవసరం ఉన్నది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ అధ్యాపకులుగా పని చేసిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎంతో శ్రమించి కుల్దీప్ నయ్యర్ వ్యాసాలను పుస్తకరూపంలో తీసుకువచ్చారు. అనువాద ప్రక్రియలో సిద్ధహస్తుడైన యార్లగడ్డ అతి సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి వివిధ అంశాలు అర్థమయ్యేరీతిలో అనువదించారు. తెలుగులోని ముఖ్య గ్రంథాలు ఇతర భాషలలోకి, అన్యభాషలలోని ముఖ్యమైన రచనలు తెలుగులోకి అనువదించినప్పుడే సాహిత్యం సుసంపన్నం కావడంతోపాటు దేశ సమగ్రత బలపడుతుందని యార్లగడ్డ గట్టిగా వాదిస్తారు. ఆయన సుమారు 20 పుస్తకాలను హిందీలో నుంచి తెలుగులోకి అనువదించారు. ఆ కోవలోకి చెందినదే కుల్దీప్ నయ్యర్ రచించిన వ్యాసాలతో వెలువడిన ‘కథనాల వెనుక కథలు’. జర్నలిస్టులుగా ఉన్నవారు, జర్నలిజంలో ప్రవేశించాలని అనుకుంటున్నవారే కాకుండా దేశంలో జరుగుతున్న, జరిగిన సంఘటనలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి. నిష్పక్షపాతంగా వార్తలు రాసిన విలేకరిగా, సంపాదకులుగా గుర్తింపు పొందిన కుల్దీప్ నయ్యర్ రాసిన ప్రతి ఒక్క వ్యాసం స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వారికి మంచి అవగాహన కల్పిస్తుంది. ఇక్కడ కుల్దీప్ నయ్యర్ గురించి ఈ తరం వారికి కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నది. ఆయన దేశవిభజన ముందు పాకిస్తాన్‌లో ఉన్నారు. ఆయన పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో జన్మించారు. ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చిన ఆయన తొలుత ఒక ఉర్దూ పత్రికలో పని చేసి ఆ తర్వాత ఇంగ్లీష్ జర్నలిజంలోకి మారి అనేక పత్రికలకు సంపాదకులుగా పని చేశారు. అత్యవసరపరిస్థితిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జైలుకు వెళ్లారు. జైలు నుంచే అత్యవసరపరిస్థితి రద్దయిపోయి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి అని వార్త పంపించి సంచలనం సృష్టించారు. అనేక పదవులు నిర్వహించిన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభలో ఆయన ప్రస్తావించి మాట్లాడిన తీరు తనకు స్ఫూర్తిగా నిలిచినందునే ఈ వ్యాసావళిని రూపొందించినట్లు యార్లగడ్డ చెప్పుకొచ్చారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి ప్రధాని వాజ్‌పేయ్ పాకిస్తాన్‌తో శాంతి కుదుర్చుకునేందుకు జరిపిన లాహోర్ బస్సు యాత్ర వరకు చోటు చేసుకున్న పరిణామాలను 34 ఘట్టాలుగా ఈ పుస్తకంలో లిఖించారు. మహాత్మాగాంధీ దారుణ హత్య తనను తీవ్రంగా కలవరపరిచిందని కుల్దీప్ నయ్యర్ తెలియజేశారు. ఆ వార్తను ఆ ప్రదేశానికి వెళ్లి చూసిన తర్వాత రాయటం తనవల్ల కాలేక పోయిందని విపరీతమైన ఉద్వేగానికి లోనైనా తన విధి నిర్వహించానని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. నెహ్రూ తర్వాత ఎవరు? అన్న వివాదం తలెత్తింది. నెహ్రూ తన వారసునిగా లాల్ బహదూర్ శాస్త్రిని ఎంపిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నెహ్రూ చనిపోయారు. గుల్జారీలాల్ నందా ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులయ్యారు. వారసుని ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం అయ్యింది. శాస్త్రి రంగంల్లో ఉన్నారని తెలిసినప్పటికీ మురార్జీ దేశాయ్ పదవి కోసం పట్టుబట్టారు. పోటీకి సిద్ధమయ్యారు. ఆ తరుణంలో కుల్దీప్ నయ్యర్ కాంగ్రెస్‌లోని అన్ని శిబిరాలతో సన్నిహితంగా ఉంటూ సమాచారాన్ని సేకరించారు. మురార్జీ కుమారుడు కాంతిభాయ్ దేశాయ్ విజయం తన తండ్రి దేనని కుల్దీప్ నయ్యర్‌తో సవాల్ చేశారు. ప్రధాని పదవికి పోటీ తప్పదన్న వార్తను ఆయన రాశారు. కామరాజు నాడార్ శాస్త్రి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన గెలుపుకు బాటలు వేసారు. ఒక దశలో ఇందిరా గాంధీ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు కామరాజు ఆమెను పక్కన పెట్టేశారు. శాస్త్రి ప్రధాని అయిన తర్వాత సమర్థవంతమైన పరిపాలన అందించారు. 1965లో పాకిస్తాన్ మనపై యుద్ధం ప్రకటించినప్పుడు శాస్త్రి వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు సైనిక దళాలతో ఆయన మమేకమై పోయిన తీరు వారిపై ఉన్న నమ్మకం ఘన విజయాన్ని సాధించిపెట్టాయి.

పొట్టివాడు గట్టివాడు అంటారు. అయిదు అడుగుల మాత్రమే ఎత్తున్న శాస్త్రి ప్రపంచం దృష్టిలో అత్యంత సమర్ధుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండు దేశాల మధ్య శాంతిని కుదర్చడానికి రష్యా ప్రధాని కోసిగిన్ తీసుకున్న చొరవ తాష్కెంట్ ఒప్పందానికి దారి తీసింది. తాష్కెంట్ వెళ్లవద్దని అనేకమంది శాస్త్రిని సూచించారు. అయితే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ చాలా మంచి వ్యక్తి అని ఏమీ జరగదని చెప్పి శాస్త్రి బయలుదేరారు. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని శాస్త్రిని భారతీయ విలేకరులు ఇబ్బంది పెట్టే రకంగా ప్రశ్నించారు. హాదీవీర్, తత్వాల్ ప్రాంతాలను పాకిస్థాన్ కు విడిచి పెట్టడంపై విలేకరులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. శాస్త్రి విలేఖరుల ధాటికి క్రుంగి పోయారు. ఈ ఒప్పందం గురించి మన దేశ ప్రజలకు సానుకూలమైన సమాచారాన్ని అందజేయండి అని అభ్యర్థించాడు. భారతీయ విలేఖరులు అందరూ సానుకూలమైన సమాచారాన్ని పంపించారని కుల్దీప్ నయ్యర్ ఆ తర్వాత శాస్త్రికి వివరించారు. ఆరోజు రాత్రి శాస్త్రి తన కుటుంబ సభ్యులతో మూడు రోజుల విరామం తర్వాత మాట్లాడారు. తాష్కెంట్ ఒప్పందంపై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు. బాగుండలేదు అని ఆమె సమాధానం చెప్పారు.

ఇంట్లో వాళ్లకే బాగుండనప్పుడు బయట వాళ్ళకి ఏం బాగుంటుందని శాస్త్రి పెదవి విరిచారు. అమ్మ కూడా ఈ ఒప్పందంపై చాలా కోపంగా ఉన్నదని కుమార్తె తండ్రికి తెలియజేశారు. ఒకసారి ఫోన్ అమ్మకివ్వు అని శాస్త్రి అడిగారు. భార్య లలిత ఫోన్లో మాట్లాడటానికి నిరాకరించారు. శాస్త్రి సరిపెట్టుకుని ఫోన్ పెట్టేశారు. ఆ రాత్రి శాస్త్రి 12 గంటల తర్వాత మరణించారు. ఆయన శరీరమంతా రంగు మారిపోయింది. ఆయనకు విషప్రయోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన భుజానికి, ఛాతీకి ఇంజక్షన్ చేసినా ఫలితం లేకపోయింది. శాస్త్రి మరణాన్ని కుట్రగా తాను భావించడం లేదని మురార్జీ దేశాయ్ తనకి చెప్పారని కుల్దీప్ నయ్యర్ ఒక వ్యాసంలో తెలియజేశారు. శాస్త్రి వారసురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికైన తీరుపై ఆయన రాసిన వ్యాసం అనేక అంశాలను బయట పెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఏర్పడిన చీలికలు సీనియర్ నాయకులను ఇందిరాగాంధీ, సిండికేట్‌గా ఏర్పడిన కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీని బహిష్కరించటం, రాష్ట్రపతి పదవికి నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచి చివరి క్షణాల్లో వి.వి.గిరిని బలపరిచి ఇందిరాగాంధీ ప్రదర్శించిన ఎత్తుగడపై కుల్దీప్ నయ్యర్ తన వ్యాసాలలో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణులను ఆయన ఎండగట్టారు.

న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక హక్కులను సైతం కబళించటానికి ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాలను కుల్దీప్ నయ్యర్ వివరించిన తీరు సర్వం సహా అధికారాలు ఒక వ్యక్తి చేతిలో ఉంటే ప్రజాస్వామ్య మనుగడకు ఎంత ప్రమాదం వాటిల్లుతుందో తెలియజేస్తుంది. పాకిస్థాన్ అణుబాంబు తయారు చేస్తోందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఘనత కుల్దీప్ నయ్యర్‌కే దక్కుతుంది. ఆ వార్తను ఒత్తిడికి లొంగి పాకిస్థాన్ అణు బాంబు తయారీ శాస్త్రవేత్త ఖండించినప్పటికీ ఫలితం లేకపోయింది. కుల్దీప్ నయ్యర్ విలేకరిగా సృష్టించిన అనేక సంచలనాలకు ఈ పుస్తకంలో పూర్తి వివరాలు ఉన్నాయి. విశాఖలో ఉక్కు కర్మాగారం నిర్మితమవుతోందని తెలియచేసిన మొట్టమొదటి విలేఖరి ఆయనే. అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో చోటుచేసుకున్న ప్రమాదకర పరిస్థితులపై ఆయన సుదీర్ఘ వ్యాసాలు రాశారు. చివరిగా ప్రధాని వాజ్‌పేయ్‌తో కలిసి ఆయన లాహోర్ వెళ్లారు. లాహోర్‌లో అడుగు పెట్టక ముందే కాశ్మీర్‌లో 25 మందిని తీవ్రవాదులు చంపేశారన్న వార్తను తనకు వాజ్‌పేయ్ తెలియజేశారని కుల్దీప్ నయ్యర్ ఒక వ్యాసంలో చెప్పారు. సిమ్లా ఒప్పందం, పాకిస్థాన్ ప్రధాని భుట్టో హత్య, బంగ్లాదేశ్ యుద్ధం తదితర సంఘటనలకు నిలువెత్తు సాక్షిగా నిలిచిన కుల్దీప్ నయ్యర్ మన మధ్యలో లేరు. ఆయన మృతితో నిర్భయంగా ప్రశ్నించే ఒక గళాన్ని మన దేశం కోల్పోయింది. అయితే, ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుణ్ణి ఇస్తుందన్న నానుడిని రుజువు చేసే కుల్దీప్ నయ్యర్ పుస్తకాలు మనకు విజ్ఞానాన్ని పంచడంతోపాటు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పటం అతిశయోక్తి కాదు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు; +91 98111 82079)