పంజాబ్ (పాకిస్థాన్), జులై 27 (న్యూస్‌టైమ్): మనుషులు ఎక్కి కూర్చుకున్న రైలు బోగీ తరహాలోని బండిని రైలింజను లాగడంలో వింతేముంది! కానీ అదే బండిని గుర్రం లాగితే? సమ్‌థింగ్‌ స్పెషల్‌ కదూ! మరి ఆ దృశ్యం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? అది చూడాలంటే పొరుగు దేశం పాకిస్థాన్ వెళ్ళాల్సిందే. అమ్మబాబోయ్ పాకిస్తానే… అని నోళ్ళు వెల్లబెట్టకండి. మీకాశ్రమ లేకుండా ఎంచక్కా మేం పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆ గుర్రపు రైలును చూసి ఆనందించండి. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం సేథ్ గంగారామ్ ఏర్పాటు చేసిన ఈ గుర్రపు రైళ్ళు పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఆశ్చర్యకరంగా ఇప్పటికీ నడుస్తున్నాయి. నిజంగా పట్టాలపైనే పరుగులు పెట్టే ఆ గుర్రపు రైళ్లు ముఖాముఖి ఎదురొచ్చినప్పుడు ఎంత గమ్మత్తుగా మార్పు జరుగుతుందో మీరే స్వయంగా చూడండి.

ఇక, ఆస్ట్రేలియాలోని ఈ గుర్రపు బండీ తరహాలోనే నడిచే మరో బండి ప్రత్యేకత ఏంటంటే రైలు పట్టాలపైనే పరుగెడుతుంది. ఈ ట్రక్కులో 50 మంది వరకూ కూర్చోవచ్చు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ పట్టణానికి 80 కి.మీ దూరంలో విక్టర్‌ హార్బర్‌ అనే పట్టణం ఉంది. ఒకప్పుడు అక్కడ ఆదిమజాతి ప్రజలు నివసించారు. 1802లో యూరోపియన్లు ఈ ప్రాంతాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. విక్టర్‌ హార్బర్‌కు అరకిలోమీటరు దూరంలో గ్రానైట్‌ ఐలాండ్‌ అనే ప్రాంతం ఉంది. ఈ ఐలాండ్‌ వరకూ రైల్వే లైను ఉంది. ఈ లైనుపై గుర్రపు బండీ ప్రయాణం కోసం పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ గుర్రపు బండీ ప్రత్యేకత ఏంటంటే రైలు పట్టాలపై పరుగెడుతుంది.

ఈ బండిలో ఒకసారి 50 మంది వరకూ కూర్చొనే వీలుంది. రైలు పట్టాలు ఎవరు వేశారు? రైలు పట్టాలపై గుర్రపు బండి ఎందుకు పరుగెడుతోంది? అంటే? గతంలో పెనిన్సులా పట్టణం నుంచి చమురు సముద్రమార్గం గుండా ఎగుమతి అయ్యేది. అయితే తీరంలో పరిస్థితులు స్టీమర్లకు ప్రమాదకరంగా ఉండేవి. అప్పుడే రైల్వే లైను నిర్మించాలని ఆలోచన చేశారు. ఆ సమయంలోనే రైల్వే లైనును గ్రానైట్‌ ఐలాండ్‌ వరకు వేశారు. చాలా కాలం వరకు ప్రధాన భాగం నుంచి ఐలాండ్‌కు సరుకుల సరఫరా రైల్వేట్రక్కుల ద్వారానే జరిగేది. ఆవిరి యంత్రాల వల్ల ఖర్చు పెరిగిపోతుందనే ఉద్దేశంతో ట్రక్కులను లాగడానికి గుర్రాలనే ఉపయోగించేవారు.

మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంతకాలం ఆపేసినా 1986 నుంచి తిరిగి గుర్రాలను ఉపయోగించడం మొదలెట్టారు. ఇప్పుడు సరుకుల రవాణా జరగడం లేదు. పర్యాటకుల కోసమే వీటిని వినియోగిస్తున్నారు. ఈ ట్రక్కుల్లో ప్రయాణాన్ని పర్యాటకులు బాగా ఆస్వాదిస్తుంటారు.