(డాక్ట‌ర్ టి.వి. వెంక‌టేశ్వ‌ర‌న్)

క‌రోనా వైర‌స్‌కు (SARS-CoV-2) సంబంధించి ఏడాదికి పైగా ప‌లు విష‌యాలను సోషల్ మీడియా, అంతర్జాల వేదికల ద్వారా మనం తెలుసుకుంటున్నదే అయినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా, వాట్స‌ప్‌ గ్రూప్‌లతో పాటు ఇంట‌ర్‌నెట్‌లో వేగంగా మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధార‌మైన‌వే. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ ఘోర‌మైన వైర‌స్‌కు సంబంధించిన కొన్ని వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. ‘విజ్ఞాన్‌ ప్ర‌సార్‌’లో సీనియ‌ర్ సైంటిస్టుగా ఉన్న డాక్ట‌ర్ టి.వి. వెంక‌టేశ్వ‌ర‌న్ క‌రోనా వైర‌స్‌కు సంబంధించి వివిధ ప‌రిశోధ‌నాంశాల‌ను విశ్లేషిస్తూ దీనిపై మ‌రిన్ని అంశాల‌ను అంతర్జాల పాఠకులతో ఇక్క‌డ పంచుకున్నారు.

క‌రోనా ఇన్ఫెక్ష‌న్ ఎలా ఉంటుంది?

క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా గొంతు, ఊపిరితిత్తుల‌లోని ఎపిథీలియ‌ల్ క‌ణాల‌కు సోకుతుంది. క‌రోనా వైర‌స్ మానవ కణాలపై ఉండే ACE2 గ్రాహకాలను బంధిస్తుంది. ఈ త‌ర‌హా క‌ణాలు ఎక్కువ‌గా గొంతు, ఊపిరితిత్తులలో ఉంటాయి. ఈ వైర‌స్ ప్ర‌ధానంగా మ‌న నోరు, ముక్కు, కండ్ల ద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా మ‌న చేతులు వాహ‌కంగా ముక్కు, నోరు, కండ్ల‌ను తాకడం ద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. కావున, సాధ్య‌మైనంత త‌రుచుగా కనీసం 20 సెక‌న్ల పాటు స‌బ్బు నీటితో చేతులు క‌డుక్కోవ‌డం వ‌ల్ల వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రుగ‌కుండా నివారించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

ఇన్‌ఫెక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటే ప్ర‌మాదం?

7,00,000 పీఎఫ్‌యూలు అంత‌కంటే ఎక్కువ మోతాదులో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డిన‌ట్ల‌యితే మ‌నిషి వివిధ క‌రోనా సంబంధిత వ్యాధుల భారిన ప‌డతార‌ని అధ్య‌యనాల ద్వారా తెలుస్తుంది. పీఎఫ్‌యూ (ఫలకం ఏర్పడే యూనిట్) అనేది ఏదైనా అంటువ్యాధి ఇన్‌ఫెక్ష‌న్ కొల‌త‌ యూనిట్. జన్యుపరంగా మార్పు చెందిన ఎలుకలపై జంతు అధ్యయనం ప్రకారం, ఇది కేవలం 240 పీఎఫ్‌యూతో ఇవి SARS బారిన పడవచ్చు. జంతువుల‌లో ఎటువంటి క్లినికల్ లక్షణాలు వెనువెంట‌నే క‌పించనప్పటికీ, ముక్కు, లాలాజలం నుండి వచ్చే బింధువులు వైర‌ల్ లోడ్‌ను కలిగి ఉంటాయ‌ని అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తుంది. దాదాపు 700000 పీఎఫ్‌యూ కంటే ఎక్కువ మోతాదు వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ ఉంటే కోతులు కూడా వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఉంది తెలుస్తోంది.

ఇన్‌పెక్ష‌న్ సంక్ర‌మ‌ణకు ఆస్కార‌మున్నసంద‌ర్భం?

ఒక వ్య‌క్తి నుంచి ఇత‌రుకుల వైర‌స్ ఎంత స‌మ‌యంలో సంక్ర‌మిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా తెలియ‌రాలేదు. కానీ క‌నీసం 10-14 రోజుల్లో ఇది జ‌రిగి బ‌య‌ట‌కు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటువ్యాధిని కృత్రిమంగా తగ్గించడం మొత్తం వైర‌స్ వ్యాప్తిని తగ్గించ‌డంలో కీలక పద్ధతి. అనుమానితుల‌ను ఆసుప్ర‌తిలో చేర్చ‌డం, ఐసోలేష‌న్‌లో ఉంచ‌డంతో, క్వారంటైన్ చేయ‌డంతో పాటు లాక్డౌన్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం కూడా వైర‌స్‌ను క‌ట్డి చేయ‌డానికి కీల‌క ప‌ద్ద‌తులు.

క‌రోనా వైర‌స్ ఎవ‌రికి సోక‌వ‌చ్చు?

ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క ముందే వైర‌స్ ఎవ‌రికైనా సోకే అవ‌కాశం ఉంది. వైర‌స్ క‌లిగివున్న వారు చాలా మందికి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. ద‌గ్గిన‌ప్పుడు గానీ లేదా చీదిన‌ప్పుడు గానీ నోరు, ముక్కును క‌ప్పుకోవ‌డం ద్వారా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. వైర‌స్ సోకిన కాలంలో సంబంధిత వ్య‌క్తి లాలాజ‌లం, క‌ఫం, మ‌లాల‌లో ఈ వైర‌స్ అవ‌శేషాలు ఉంటాయి.

క‌రోనా వైర‌స్ ఎలా సోక‌వ‌చ్చంటే?

ఈ వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా నోటి తుంప‌ర్ల ద్వారా సంక్ర‌మించే అవ‌కాశం ఉంటుంది. ఆరు అడుగులు గానీ అంత‌కంటే త‌క్కువ దూరంలో సాన్నిహిత ప‌రిచ‌యం ఉన్న స‌మ‌యంలో నోటి తుంప‌ర్లు ప‌డితే వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి కూరగాయల మార్కెట్ లేదా సూపర్ మార్కెట్ వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన‌ప్పుడు వ్య‌క్తికి-వ్య‌క్తికి మ‌ధ్య క‌నీసం 1.5 మీటర్ల దూరం ఉండాలే చూసుకోవాల‌ని అధికారులు సిఫార‌సు చేస్తున్నారు. హాంకాంగ్‌లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం సామాజిక దూరం 44% వ్యాప్తిని తగ్గిస్తుంద‌ని తెలిపింది. వ్యాధి నిర్జీవ వెక్టర్, ప్రత్యేకించి ఫోన్లు, తలుపుల గొళ్లాలు, ఉపరితలాలు వైర‌స్ ప్రసారానికి సంభావ్య వనరుగా ఉంటున్నాయ‌ని అధ్య‌య‌నాల‌ ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారం అందుబాటులో లేదు. కాబ‌ట్టి బహిరంగ ప్రదేశాల్లో డోర్క్‌నోబ్‌లు, లిఫ్ట్ కాల్ బటన్లు, కౌంటర్లను తాకినప్పుడు వీలైనన్ని సార్లు చేతులను శుభ్ర పరచుకోవ‌డం సర్వత్రా సురక్షితం.

ఒక‌రి నుంచి ఎంత మందికి సంక్ర‌మించ‌వ‌చ్చు?

ఈ అంటు వైర‌స్ క‌లిగివున్న‌వ్య‌క్తి నుంచి స‌గ‌టున మాన‌వ ప్ర‌సార ప‌రిధి (ఆర్‌వో) 2.2 నుంచి 3.1 మధ్య ఉంటుందని అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తోంది. అంటే వైర‌స్ సంక్ర‌మించిన ఒక వ్య‌క్తి స‌గ‌టున 2.2 నుంచి 3.1 మందికి దీనిని సంక్ర‌మింప‌జేసే అవ‌కాశం ఉంది. వ్య‌క్తిగ‌త భౌతిక దూరం పాటించ‌డం ద్వారా వాస్త‌వ వైర‌స్ వ్యాప్తిని గ‌ణ‌నీయంగా తగ్గించవచ్చు, తద్వారా సంక్రమణ రేటు కూడా మందగిస్తుంది.

వైరస్ ఎక్కడ నుండి వచ్చింది?

తొల‌త SARS-CoV-2 వైరస్ గ‌బ్బిలం నుండి మానవులకు సోకింద‌ని బ‌ల‌మైన వాద‌న‌లు విన‌వ‌డ్డాయి. స‌ర్వ‌త్రా విన‌వ‌స్తున్న‌ట్టుగా ఈ వైర‌స్ గ‌బ్బిలాల సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రాలేదని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఏదైన ఆహార ప‌దార్థాల‌ను ఉడక‌బెట్టిన త‌రువాత వైర‌స్ న‌శిస్తుంది. ఇటీవలి జ‌రిపిన‌ జన్యువుల అధ్యయనం మేర‌కు ఈ వైర‌స్ గ‌బ్బిలాల నుంచి మాన‌వుల‌కు సంక్ర‌మించే ముందు మ‌రేదైన మ‌ధ్య‌వర్తికి సోకి అటునుంచి మ‌నుషుల‌కు వ‌చ్చి ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రో అధ్య‌య‌నం ప్ర‌కారం SARS-CoV-2 వైరస్ బ‌య‌టప‌డేందుకు ముందే దీని మూలాలు వివిధ ర‌కాల మానవులలో తిరుగాడిన‌ట్టుగా తెలుస్తోంది.

క‌రోనా వైర‌స్‌ ఎలా ఉద్భవించింది?

జూనోటిక్ ట్రాన్స్మిషన్ తరువాత మానవులలో సహజంగా వైరస్ స్ట్రెయిన్‌ను ఎంచుకోవడం ద్వారా SARS-CoV-2 ఉద్భవించింద‌ని ఒక వాద‌న ఉంది. మ‌రోవైపు క‌రోనా మాన‌వుల‌లోకి జునోటిక్ బ‌దిలీకి ముందు మాన‌వేత‌ర జంతు హోస్ట్‌ల‌లో స‌హ‌జంగా వైర‌ల్ స్ర్టెయిన్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఈ వైర‌స్ ఉద్భ‌వించి ఉంటుంద‌న్న‌ది మ‌రో వాద‌న‌. రెండింటిలో ఏది సరైనదో మరిన్ని అధ్యయనాల ద్వారానే భ‌విష్య‌త్తులో తెలియ‌రానుంది. మానవ సంక్రమణ, ప్రసారానికి అనుమతించిన SARS-CoV-2 లోని ఉత్పరివర్తనలు ఏమిట‌న్న‌ది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ వైర‌స్ ఎప్పుడు వెలుగులోకి వచ్చంది?

డిసెంబర్ 2019 కి ముందు వ‌ర‌కు SARS-CoV2కు సంబంధించి ఎలాంటి న‌మోదిత కేసులు లేవు. కానీ ప్రాథమిక జన్యు విశ్లేషణల ప్ర‌కారం మాన‌వుల‌లో మొద‌టి SARS-CoV-2 కేసు 2019 మ‌ధ్య అక్టోబర్ – మ‌ధ్య డిసెంబ‌రుల‌లో వెలుగులోకి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. దీనిని బ‌ట్టి చూస్తే ప్రాథ‌మిక జూనోటిక్న‌కు వెలుగులోకి వ‌చ్చిన మ‌ధ్య స‌మ‌యంలో గుర్తించినట్లు ప్రసార కాలంగా నిర్ధారించారు.

క‌రోనా ఇత‌ర జంతువులకు సోకుతుందా?

SARS-CoV-2 వైర‌స్ మ‌నుషుల‌తో పాటు, గ‌బ్బిలాలు, కొన్ని ర‌కాల పిల్లి జాతులు, కోతుల‌లోని స్వైన్ కణాలను ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుందని మాలిక్యులర్ మోడలింగ్ సూచిస్తుంది. దీనిని బ‌ట్టి చూస్తే పెంపుడు జంతువులకు లేదా పశువులకు ఈ వైర‌స్ సోకదు. దీంతో గుడ్లు లేదా పౌల్ట్రీ ఉత్పత్తుల‌ను తీసుకోవడం వల్ల SARS-CoV-2 వైర‌స్ సంక్రమణ ఉండదు.

క‌రోనా ఒకరికి మ‌ళ్లీమ‌ళ్లీ సోకవచ్చా?

ఒకసారి ఈ వైర‌స్ సోకి (మ‌కాక్లు)త‌రువాత మనలో చాలామంది దానికి సంబంధించిన జీవితకాల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అదేవిధంగా, మానవులు కోలుకున్న తర్వాత SARS-CoV-2తో తిరిగి సంశ్లేషణ చేసినట్టు కూడా ఆధారాలు లేవు. అయితే, ఇందుకు సంబంధించిన రోగనిరోధక శక్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో ఇప్ప‌టికిప్పుడు తెలుప‌లేము.

క‌రోనా అనారోగ్యం ఎంత తీవ్రంగా ఉంటుంది?

COVID-19 (క‌రోనా) అంటే మ‌ర‌ణ శాస‌నం కాదు. COVID-19 కేసులలో ఎక్కువ భాగం (81%) తేలికపాటివే, సుమారు 15% మందికి ఆసుపత్రి చికిత్స అవసర‌మ‌వుతుంది. 5% మందికి క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరం. అంటే సోకిన వారిలో ఎక్కువ మందికి ఆసుపత్రి చికిత్స అవసరం ఉండ‌క‌పోవ‌చ్చు.

ఇది ఎవరికి ఎక్కువ‌గా ప్ర‌మాద‌కరం?

ఈ వైర‌స్‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌లు ఎక్కువగా ప్ర‌భావిత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇటలీలోని లోంబార్డిలో 20% మంది ఆరోగ్య కార్యకర్తలు రోగులకు వైద్య సంరక్షణను అందిస్తూ వ్యాధిబారిన పడుతున్నారు. సాధారణ ప్రజలలో, వృద్ధులు, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, ముందు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు క‌లిగి ఉన్న వారికి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంది.

వైర‌స్ మరణాల‌కు కారణం ఏమిటి?

ఈ వైర‌స్ సోకిన వాళ్ల‌లో చాలా వరకు మరణాలు గుండె దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ వైఫల్యం వల్ల సంభవిస్తాయి. ఉపిరితిత్తులలోకి జీవ ద్రవం లీకేజ్ కావ‌డం, ఇది శ్వాసక్రియను నిరోధిస్తుంది. అనారోగ్యానికి దారితీస్తుంది, ఇది ప్రాధమిక క్లినికల్ పరిస్థితి. ప్రస్తుతం, COVID-19 చికిత్స ప్రధానంగా సహాయక సంరక్షణ, అవసరమైతే వెంటిలేషన్తో సహా. అనేక చికిత్సా పరీక్షలు కొనసాగుతున్నాయి మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో ఎదురు చూడాల్సిందే.

పాల ప్యాకెట్లు లేదా వార్తాపత్రికల వైరస్ వ్యాపిస్తుందా: SARS-CoV-2 వైర‌స్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలపై 3 రోజుల వరకు మన్న‌గ‌లుగుతుంది. వైరల్ లోడ్ 10000 పీఎఫ్‌యూ ఉన్నప్పుడు, ఇది వార్తాపత్రిక, కాట‌న్‌ వస్త్రాలపై 5 నిమిషాలు మాత్రమే నిల‌వ‌గ‌లుగుతుంది. పాల సాచెట్లపై వైరస్ సంక్ర‌మ‌ణ‌న‌ను తొలగించడానికి వాటిని బాగా కడగితే సరిపోతుంది.

వేసవి లేదా వర్షాకాల ప్రారంభంలో…

వేసవి లేదా వర్షాకాల ప్రారంభంలో ఈ వైర‌స్ నుంచి కొంత ఊర‌ట ల‌భించ‌వచ్చా? అంటే, ఉష్ణోగ్రత లేదా గాలిలో తేమకు అనుగుణంగా వైర‌స్ వ్యాప్తిలేదా ప్ర‌సారం, సంక్ర‌మ‌ణ‌ త‌గ్గుతుంద‌న‌డానికి ఎలాంటి బ‌ల‌మైన ఆధారాలు లేవు.

వ్యాధి సోకినట్లు వెలుగుచూసే లక్షణాలు…

ఇక, కరోనావైరస్ వ్యాధి వ్యాపించినప్పుడు వెలుగులోకి వచ్చే లక్షణాలు భిన్నరకాలుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం, కాళ్ళు లాగడం, తల నొప్పి, కళ్ళు నొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి, మోషన్స్ అంటే విరేచనాలు, వామిటింగ్ అంటే వాతి, జలుబు, దగ్గునాలుక తడి సరిపోవడం, రుచి వాసన పోవడం వంటివన్నీ రెండో వేవ్‌లో సహజంగా కనిపించే కరోనా లక్షణాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ లక్షణాల్లో కనీసం మూడు లేదా అంత కన్నా ఎక్కువగా ఉంటే అది కరోనా అని నిర్దారించుకోవచ్చన్నది అనుభవజ్ఞులు చెబుతున్నది.

అయితే, ఎక్కువ మందిలో కనిపిస్తున్న లక్షణం మాత్రం జ్వరం. జ్వరం మూడు నుంచి నాలుగు రోజుల పాటు హెచ్చుతూ తగ్గుతూ రావడం జరుగుతోంది. డోలో లాంటి టాబ్లెట్ వేసుకొంటే జ్వరం తగ్గడం, మళ్ళీ పెరగడం ఇలా జరుగుతుంటే అది కరోనానే అని నిర్దారించుకోవచ్చట. జ్వరం తరువాత ఎక్కువగా కనిపిస్తున్న లక్షణం ఒళ్ళు నొప్పులు (కొంత మందికి కాళ్ళు లాగడం, నడుం నొప్పి). రెండు రోజులు జ్వరం తరువాత నీరసం ఎక్కువ మందిలో కనిపిస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

గొంతు నొప్పిఅటు పైన పొడి దగ్గు, అటు పైన గళ్ళతో కూడిన దగ్గు, జలుబు కూడా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఒకటో నెంబర్ కింద ఇచ్చిన లక్షణాల్లో కనీసం ఒక లక్షణం ఇంట్లో ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది వ్యక్తుల్లో ఉంటే అది కరోనానే అని రూఢిగా చెప్పొచ్చట. అలాగే మీరు కలుస్తున్న వ్యక్తుల్లో కనీసం ఒకరికి మీతో పాటే ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా అది కరోనా అని నిర్దారించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. రుచి, వాసన పోయిందంటే అది కచ్చితంగా కరోనానే అని అంటున్నారు. ఇంటిలో ఒకరికి కరోనా ఉందంటే అందరికీ సోకే అవకాశం వుంది. మీరు రోగ లక్షణాలను గమనించి ఇది కరోనా అని నిర్దారించుకొనే లోపే అందరికీ సోకి ఉంటుంది. కొత్త కరోనా చాలా వేగంగా సోకుతోంది. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇంట్లో పిల్లలు ఇంకా యువకులు రోగ లక్షణాలు కనపరచకుండా ఉండవచ్చు. అంటే అసిమ్పటోమాటిక్.

టెస్ట్‌ల సంగతి ఏంటి? అన్నదానిపైనా నిపుణులు స్పందించారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంటే చీకటిలోకి బాణం వదలడం లాంటిదట. దాని రిజల్ట్‌ను నమ్మలేమంటున్నారు. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లలో నెగటివ్ అంటే నెగటివ్ కాదని సుమారు ఇరవై శాతం ఫాల్స్ నెగటివ్‌లు వస్తున్నాయని అంటే పాజిటివ్ వున్నా నెగటివ్‌గా వస్తున్నాయని ప్రభుత్వ వైద్య అధికారులే చెబుతున్నారు. ఇక హెచ్ఆర్‌సీటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. దీని వల్ల కరోనా వచ్చిందని కచ్చితంగా చెప్పడం కష్టం. ఔను.. నిజాయతీగా విశ్లేషిస్తే లంగ్స్‌లో ఎంత మటుకు ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకోవచ్చు. కానీ, ఈ రోజు ఈ హెచ్ఆర్‌సీటీని దుర్వినియోగం చేస్తున్నారు. 70 శాతం బోగస్ రిపోర్ట్‌లు, బాగున్న వ్యక్తిని భయపెట్టి ఖాళీగా వున్నా నాన్ ఆక్సిజన్ బెడ్ నింపి మూడో ఐదో లక్షలు వసూలు చేసి అయిదు రోజుల పాటు తిండి, రోజూ నాలుగు విటమిన్ మాత్రలు ఇచ్చి పంపుతున్నారు.

డబ్బుకు డబ్బు, ఇంత మంది రోగులు కోలుకున్నారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాదూ కూడదూ అని ఎవరైనా మెడికల్ మాఫియా తరఫున రెచ్చ గొడితే వందలాది బోగస్ రిపోర్ట్‌లతో ముందుకు వచ్చి సాక్ష్యాధారాలతో బండారం బట్టబయలు చేస్తామంటున్నారు కొందరు పరిశోధకులు! కరోనా రోగ లక్షణాలు ఉంటే బి, సి, డి విటమిన్ మాత్రలు ఇంకా జింక్ మాత్ర వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆల్కలీ ఫుడ్స్ అయిన వెల్లుల్లి, పాలకూర, బాదం లాంటివి తీసుకోవాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. మోషన్స్ మొదలైన ఉదర సంబంధ సమస్యలు ఉంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. మసాలాలు, కారాలు తగ్గించుకోవాలి.

కరోనా తీవ్రం అవుతోంది అని తెలుసుకోవడం ఎలా?

రెండు నుంచి నాలుగు, ఒక్కో సారి అయిదు రోజుల పాటు జ్వరం రావడం ఎక్కువగా జరుగుతోంది. కానీ జ్వరం ఆరో రోజుకు కూడా కంట్రోల్ కాకుండా ఇంకా కొనసాగుతుంటే.. జ్వరం 104 డిగ్రీలు చేరుకొంటే (ఇలా జరిగితే డేంజర్. వెంటనే తడి బట్టతో రోగి శరీరాన్ని తుడవండి).. పై రెండింటిలో ఒకటి జరిగినా దాని అర్థం ఆ వ్యక్తి ఇమ్మ్యూనిటి వ్యవస్థ వైరస్‌ను ఓడించలేకపోతోంది. వైరస్‌ది పైచేయి అవుతోంది అని. ఇలాంటప్పుడు డాక్టర్‌ను వెంటనే సంప్రదించి వైరస్‌పై దాడి కోసం ఆంటీ వైరల్ టాబ్లెట్ లేదా ఇంజక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి డాక్టర్ సూచన మేరకే తీసుకోవాలి.

వీటికి అనేక సైడ్ రియాక్షన్స్ ఉంటాయి. అవసరం అయిన పక్షంలోనే తీసుకోవాలి. అనవసరంగా ముందుగానే తీసుకొంటే కిడ్నీ, లివర్‌పై దుష్ప్రభావం, బీపీ పెరగడం, ఎలర్జీలు రావడం, ఆకలి చచ్చి పోవడం, గ్యాస్, అసిడిటీ లాంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. అర్జునుడు ముందుగా బాణాలతో యుద్ధం చేశాడు. వుంది కదా అని అనవసరంగా పాశుపతస్రాన్ని వాడ లేదు. అవసరం అయినప్పుడే బయటకే తీశాడు. వృద్దులు హృద్రోగం ఇంకా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రోగ లక్షణాలు కనిపించినప్పుడే డాక్టర్‌లు పవర్ఫుల్ ఆంటీ వైరల్ మందులు ఇస్తున్నారు. ఇది సరైనదే. అదే సమయంలో కొంత మంది అనవసరంగా ముందుగానే ఇలాంటివి ఇచ్చి రోగికి లేని ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నారు అనేది కూడా వాస్తవం. పల్స్ ఆక్సీమీటర్లో రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. దానిలో రీడింగ్ 94 కంటే తగ్గితే అది డేంజర్‌ను సూచిస్తుంది. (వృద్దులు, పిలల్లు, ఆస్తమా తదితర శ్వాస కోసం సంబంధ సమస్యలు ఉన్న వారు.. ఇలాంటి వారిలో 92 దాకా పరవా లేదు. పడుకున్నప్పుడు రీడింగ్ చెక్ చేస్తే కూడా 92 దాక రావొచ్చు).

ముఖ్యంగా 92 కంటే తగ్గడం మొదలు పెడితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్లు డి దిమ్మెర్ టెస్ట్ చేసి రక్తంలో గడ్డలు ఉంటే బ్లడ్ తిన్నెర్ ఇస్తారు. లేదా సీఆర్పీ టెస్ట్ చేసి సైటోకిన్ స్ట్రామ్ ఉంటే స్టెరాయిడ్ ఇస్తారు. పల్స్ ఆక్సీమీటర్లో రీడింగ్ 94 కంటే తగ్గడం మొదలు పెట్టినా తనకు ఊపిరి తీసుకోవడంలో సమస్య లేదని ఇంట్లోనే ఉంటే ప్రాణం మీదకు వస్తుంది. ఊపిరి తీసుకోవడంలో సమస్యలు రీడింగ్ 65కు పడిపోయినప్పుడు వస్తాయి. అప్పుడు రోగిని ఆసుపత్రికి తీసుకొని వెళితే ప్రాణం దక్కడం కష్టం. కారణం రీడింగ్ 94 నుంచి 65కు పడిపోవడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అప్పటికే గుండె ఊపిరి తిత్తులు లాంటివి డామేజ్ అయిపోయి ఉంటాయి.

ఏదిఏమైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కరోనా వైరస్‌కు మనిషిని చంపే సామర్థ్యం లేదు. మరి ఇన్ని మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? రెండు కారణాలు.. ఒకటి భయం. భయం ఉంటే ఇమ్మ్యూనిటి సగం చచ్చిపోతుంది. అందుకే కరోనా సోకినా కూడా ధైర్యంగా వుండండి. రోజుకు రెండు సార్లు పల్స్ ఆక్సీమీటర్‌ను చెక్ చేసుకోండి. రీడింగ్ 94 తగ్గడం మొదలైన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకొని వెళితే ప్రాణాపాయం ఉండదు. ఇలా రీడింగ్ చెక్ చేసుకోకుండా అది 65కు పడిపోయి ఊపిరి తీసుకోవడంలో తీవ్ర సమస్య ఎదురయినప్పుడు ఆసుపత్రికి తీసుకొని పోవడం అక్కడ బెడ్‌లు లేకపోవడం లాంటివి మరణాలకు రెండో కారణం.

(* ఈ వ్యాసానికి వాసిరెడ్డి అమర్‌నాథ్ ముఖపుస్తకం నుంచి సేకరించిన కొంత భాగాన్ని జోడించడం జరిగింది)