అసలు అలా ఎలా జరుగుతోంది?

143
ఆదిత్యుని మూల విరాట్టను సూర్యకిరణాలు తాకిన వేళ...
  • ఆదిత్యుడి పాదాలపై కిరణార్చన

(* సీనియర్ జర్నలిస్ట్ శృంగారం ప్రసాద్‌తో కలిసి కూన ప్రభాకర్‌ రావు)

దేశంలో నిత్యారాధన జరుగుతున్న ఏకైక సూర్య దేవాలయంగా అరసవల్లి ప్రసిద్ధి చెందింది. సూర్య జయంతి అయిన రథసప్తమి రోజున ప్రతి సంవత్సరం ఈ ఆలయంలోని ఆదిత్యుని విగ్రహం పాదాల మీద సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. ఇక్కడ సూర్యుడు సప్తాశ్వారూఢుడై దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని స్వయంగా దేవేంద్రుడు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆలయం పక్కన ఉన్న సూర్యగుండాన్ని పదకొండవ శతాబ్దంలో తవ్వారన్న కథనాలు ఉన్నాయి. అయితే, ఏటా స్వామివారి పాదాలకు జరిగే కిరణార్చనపై చాలా కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ నిర్మాణ సమయంలో తీసుకున్న ప్రత్యేకతల వల్లే ఇలా సూర్యుని కిరణాలు స్వామివారి పదాలపై పడుతున్నాయని చెప్పేవాళ్లూ అనేకులు.

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి నెలవు అరసవల్లిగా చరిత్రచెబుతోంది. ప్రసిద్ధమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం శ్రీకాకుళం పట్టణానికి కూతవేటు (కిలోమీటరు) దూరంలోనే ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందిన అరసవల్లి గ్రామాన్ని ఒకప్పుడు ‘హర్షవల్లి’ అనేవారని చరిత్రకారులు చెపుతారు.

దేవాలయ చరిత్ర…

ఇక్కడి సూర్యదేవాలయంలోని స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ లభించిన శాసనాలు క్రీస్తు శకం 7వ శతాబ్థానికి చెందినవి అందువల్ల ప్రాచీన దేవాలయంగా అరసవల్లిని పేర్కొనవచ్చు. భారతదేశంలోని ఉన్న కొన్ని సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు. అరసవల్లి ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం 17వ శతాబ్దంలో నిజామ్ నవాబు పాలనలోకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమితులైన షేర్ మహమ్మద్ ఖాన్ హయాంలో ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా స్వయంగా ప్రకటించుకున్నాడు. అలా నాశనం అయిన దేవాలయాలలో అరసవల్లి కూడా వుంది.

సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురించి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమితుడైన పండితుడు సీతారామ శాస్త్రి అరసవల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం యలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి, అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

ఆలయ విశేషాలు…

అరసవల్లి సూర్యదేవాలయం… రాత్రి సమయంలో ఇలా…

ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించడటం. దేవాలయ వాస్తులో ఇదో ప్రత్యేకతగా చెబుతారు పరిశోధకులు. కంచిలోని కామేశ్వరాలయంలో కూడా ఇలాంటి ఏర్పాటు వుంది. సంవత్సరంలో మాత్రం ప్రభాత భాస్కరుని కిరణాలు నేరుగా ఆలయం ముఖ ద్వారం నుండి ప్రవేశించి స్వామి వారైన ఉషా, చాయా, పద్మినీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ ఘట్టం ఉదయం 6.00 నుండి 6.15 మధ్య కేవలం ఒక అయిదు నిముషాలు మాత్రమే వుంటుంది. తదుపరి సూర్య కిరణాలు గర్భ గుడి నుండి నిష్క్రమిస్తాయి.

ఈ అద్భుతాన్ని చూడడానికి ఎందరో స్థానిక భక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయానికి వేకువనే వచ్చి ఎదురు చూస్తారు. సుమారు ఏడవ శతాబ్దంలో ఈ కోవెలను సూర్యుని గమనాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏటా మార్చి, అక్టోబరులో వచ్చే ఈ శుభ దినాలు ఉత్తరాయనాన్ని, దక్షిణాయనాన్ని సూచిస్తాయి. ఈ దినం ప్రసరించే సూర్య కిరణాలలో శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచే మహిమ వుందని అందరి భక్తుల నమ్మకం. ఆ విధంగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో అద్భుతాలు చేస్తూ ప్రాణికోటి కంతటికీ జీవనాధారమౌతున్నాడు.

‘రథమారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్
శ్వేత పద్మధరమ్ దేవమ్ తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్’

ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని, కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించినట్టు తెలుస్తోంది.

ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది.

క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు. అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు.

ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని, అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది. వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు.

క్రీస్తు శకం 1599లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్‌ను ఒక బావిలో పడేశారట. క్రీ.శ.1778లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్‌ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో ఇప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని (గోపురం) పడ గొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.

స్థల పురాణం…

కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలు దేరుతాడు. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసిస్తాడు. కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థించగా అతను తన ఆయుధమైన హలము (నాగలి)ని భూమిపై నాటి జలధార వచ్చేటట్లు చేస్తాడు. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించింది కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని ప్రాచుర్యంలో ఉంది. ఈ నాగావళి నది తీరంలో బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు. అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్లారట. అదే విధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించేందుకు వచ్చినప్పుడు అప్పటికే కాలాతీతమైందట. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించడానికి ఇది తగు సమయం కాదని ఇంద్రునితో వారించారట.

ఈ క్రమంలో ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగినట్లు, అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహంతో వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరితే ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడినట్లు చరిత్ర చెబుతోంది. ఇంద్రుడు పడిన ఆ స్థలాన్నే ఇంద్ర పుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై ‘‘నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వు’’ అని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అక్కడ సూర్యభగవానుని విగ్రహం దొరికిందని, దానితోపాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయన్నది చరిత్రలో భాగం. అక్కడ ఇంద్రుడు దేవాలయాన్ని కట్టి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు, అదే ఈ నాటి అరసవల్లి క్షేత్రంగా ప్రసిద్ధిలో ఉంది. అనంతరం ఇంద్రుడు ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే అరసవల్లి స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉండడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

(* కేపీ రావుగా ప్రసిద్ధిచెందిన వ్యాసకర్త వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ సాంకేతిక నిపుణుడు (టెక్నీషియన్); 9000859859)