హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న 80,000 మంది పోలీసు సిబ్బంది పరిపాలనా సంబంధిత నిర్వహణను మరింత మెరుగైన పౌర సేవలను సమర్థవంతంగా చేపట్టేందుకై ఆటోమేటెడ్ మానవ వనరుల నిర్వహణ విధానాన్ని(హెచ్.ఆర్.ఎం.ఎస్) అమలు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ఆటోమేటెడ్ హెచ్.ఆర్.ఎం.ఎస్ అమలుపై రాష్ట్రంలోని పోలీస్ శాఖకుచెందిన అన్ని విభాగాల అధికారులతో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, జితేందర్, గోవింద్ సింగ్, సందీప్ శాండిల్య తదితర పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖ మానవ వనరుల పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత సులభతర పరిపాలనా సౌలభ్యం కోసం పూర్తిగా ఆటోమేటెడ్ హెచ్ఆర్ఎంఎస్ వ్యవస్థను ప్రవేశ పెడుతున్నామని తెలియ చేసారు. ఈ ఆటోమేటెడ్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థను శాఖలోని క్రింది స్థాయి పోలీసు అధికారి నుండి డీ.జీ.పీ వరకు అమలు చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఇప్పటికే అమలవుతున్న హెచ్.ఆర్.ఎం.ఎస్‌ను సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరమే ఈ ఆధునిక విధానాన్ని పోలీస్ శాఖలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు విభాగంలో ఈ కింది మాడ్యూళ్లలో అమలు చేయాలని నిర్ణయించామని అన్నారు. నియామకాలు, ఉద్యోగుల పూర్తి వివరాల నిర్వహణ (సర్వీస్ రిజిస్టర్), సమయ పాలన, హాజరు నమోదు, సెలవుల నమోదు, గైహాజరు వివరాల నమోదు, ప్రతి ఒక్కరి పనితీరును సమీక్షించడం, ప్రోత్సాహకాలు అందచేత, నిరంతర ప్రావీణ్యం, శిక్షణతో కూడిన అభివృద్ధి, అధ్యయనం- అభివృద్ధి (శిక్షణ), పరిపాలన, వర్కు ఫోర్సు నిర్వహణ, ఉద్యోగుల పాలన సంబంధిత విజ్ఞాపనలు, యూజర్ అనలిటిక్సు, విశ్లేషణ అంశాల్లో ఈ హెచ్.ఆర్.ఎం.ఎస్‌ను అమలు చేస్తున్నామని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బంది పరిమాణం దృష్ట్యా ఈ సిబ్బందికి సంబంధించిన సమస్యల సంక్లిష్టతలను అధిగమించడం, మానవ వనరుల సమర్థ నిర్వహణతోపాటు పౌర కేంద్రీకృత పాలనకు ఏంతో సహాయకారిగా ఉంటుందని అన్నారు. శాఖలో అంతర్గత సామర్థ్యాన్నిపెంపొందించడం, పోలీస్ వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు అనుగుణంగా రూపొందించామని తెలియ చేశారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌ను 2018లోనే పోలీస్ శాఖలో ప్రారంభించినప్పటికే, దీనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు సంస్థ మొత్తం ఉద్యోగ వ్యవస్థ ఈ చట్రంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ హెచ్.ఆర్.ఎం.ఎస్ అమలుపై పోలీసు ఉన్నతాధికారులు, కమీషనర్లు, ఎస్.పీ లు, వివిధ విభాగాల అధిపతుల అభిప్రాయాలను డీ.జీ.పీ అడిగి తెలుసుకున్నారు.