1.80 లక్షల మాస్కుల కొనుగోలుకు రెడ్‌క్రాస్ సొసైటీ ఆర్డర్

న్యూఢిల్లీ, జులై 31 (న్యూస్‌టైమ్): భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సి.ఎస్) నుంచి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ (కె.వి.ఐ.సి.)కి ప్రతిష్టాత్మకమైన కొనుగోలు ఆర్డర్ లభించింది. లక్షా 80వేల ముఖ కవచాల (ఫేస్ మాస్కుల) సరఫరా చేయాలంటూ రెడ్ క్రాస్ సొసైటీ కోరింది. ఖాదీ పేస్ మాస్కుల నాణ్యత, అందుబాటులో ధర వంటి కారణాలవల్ల ఈ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ప్రకారం వందశాతం డబుల్ ట్విస్టెడ్ చేనేత నూలు వస్త్రంతో రెండు పొరలుగా ఈ మాస్కులు తయారు చేయాల్సి ఉంటుంది.

ఈ మాస్కులను గోధుమ వర్ణంతో పైపింగ్ ఏర్పాటుతో తయారు చేస్తారు. రెడ్ క్రాస్ సొసైటీ అందజేసిన నమూనా ప్రకారం ఈ మాస్కులను కె.వి.ఐ.సి. ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఈ మాస్కులకు ఎడమవైపున ఐ.ఆర్.సి.ఎస్. లోగోను, కుడివైపున ఖాదీ ఇండియా లోగోను ముద్రిస్తారు. వచ్చే నెలలో మాస్కుల సరఫరా మొదలవుతుంది. ఈ మాస్కుల తయారీ కోసం 20వేల మీటర్ల వస్త్రం కావాల్సి ఉంటుంది. ఖాదీ హస్తకళాకారులకు అదనంగా 9వేల పనిదినాలు అవసరమవుతాయి. రెడ్ క్రాస్ సొసైటీనుంచి మాస్కుల కొనుగోలు ఆర్డర్ లభించడంపట్ల కె.వి.ఐ.సి. చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా హర్షం వ్యక్తం చేశారు. ఖాదీ పేస్ మాస్కులకు భారీ స్థాయిలో గిరాకీ లభించడం ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యాల సాధనలో ఒక ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.

తమ ఖాదీ వృత్తి కళాకారులు మరింత ఎక్కువ నూలు, వస్త్రం ఉత్పత్తి చేయడానికి, ప్రస్తుత కష్టసమయంలో వారు మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి ఇది దోహదపడుతుందని సక్సేనా చెప్పారు. ఇప్పటివరకూ పది లక్షల ఫేస్ మాస్కులను కె.వి.ఐ.సి. విక్రయించింది. రెండు పొరల నూలు మాస్కులు, మూడు పొరల పట్టు మాస్కులు వీటిలో ఉన్నాయి. ఇప్పటివరకూ జమ్ము కాశ్మీర్ నుంచి అతి పెద్ద కొనుగోలు ఆర్డర్ లభించింది. 7లక్షల మాస్కుల తయారీకి జమ్ము కాశ్మీర్ ప్రభుత్వంనుంచి ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ప్రకారం సకాలంలో మాస్కులను కూడా అందజేశారు. ఇటీవలి కాలంవరకూ కోటి రుపాయలకు పైగా విలువైన లక్ష మీటర్ల నూలు వస్త్రాన్ని, దాదాపు 200మీటర్ల పట్టు వస్త్రాన్ని మాస్కుల తయారీకి వినియోగించారు. వివిధ రంగుల్లో ఈ మాస్కులు తయారు చేశారు. మాస్కుల తయారీకి రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ-పోర్టల్ ద్వారా కె.వి.ఐ.సి.కి పదే పదే ఆర్డర్లు లభిస్తున్నాయి.

భారతీయ రైల్వేలకు దాదాపు 20 వేల మాస్కులను కె.వి.ఐ.సి. సరఫరా చేసింది. మాస్కుల విక్రయంతో పాటుగా కె.వి.ఐ.సి. దాదాపు పది లక్షలమేర ఖాదీ మాస్కులను ఉచితంగా కూడా పంపిణీ చేసింది. దేశంలోని వివిధ జిల్లాల పరిపాలనా యంత్రాగాలకు, ఖాదీ సంస్థలకు ఈ మాస్కులను పంపిణీ చేశారు. ‘‘కరోనా వైరస్ తో పోరాటంలో ఫేస్ మాస్కులు కీలకపాత్ర వహిస్తున్నాయి. డబుల్ ట్విస్టెడ్ ఖాదీ వస్త్రంతో ఈ మాస్కులను తయారు చేస్తారు. నాణ్యతను పాటించడంతోపాటుగా, డిమాండ్‌కు అనుగుణంగా, ధరపరంగా అందుబాటులో ఉండేలా ఈ మాస్కులు తయారవుతున్నాయి. శ్వాస క్రియకు ఇబ్బంది కలగకుండా, ఉతుక్కొని మళ్లీ వినియోగించుకునేందుకు వీలుగా, వినియోగం అనంతరం ప్రకృతిలో కలిసిపోయేలా’’ ఈ మాస్కులు ఉంటాయని సక్సేనా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here