మానవ ప్రయత్నం ఫలించక మానదు!

111
ఢిల్లీ లాక్‌డౌన్‌తో మూతపడిన ఇండియా గేట్

ఏ విషయంలోనైనా మనిషి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఫలితం రాకుండాపోదు. కాకపోతే, కొన్నింట్లో దానికి కొంత సమయం పట్టవచ్చేమో గానీ, చివరికైతే సత్ఫలితమే వస్తుంది. కరోనా వైరస్‌పై చైనా పట్టుదలకు నిదర్శనంగా నిలిచే లాక్‌డౌన్ ఫలితం నెల రోజులకు గానీ కనిపించలేదు. చైనా వాళ్ళు గత నెల రోజుల (జనవరి 23) నుంచి ఇంట్లో కూర్చుని లాక్‌డౌన్‌లో ఉంటే నిన్న మొదటి సారి కొత్త కేసులేవీ నమోదుకాకుండా చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ‘మాకు ఏమీ కాదులే’ అని అనుకుంటే పొరపాటే. ఒకసారి భారత్‌లో కరోనా వైరస్ పూర్తి స్థాయిలో వ్యాపించిందంటే కనీసం ప్రాణ నష్టం ఊహించలేం.

కరోనావైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలులో ఉండడంతో ముంబైలో కొనసాగుతున్న సుదీర్ఘ కర్ఫ్యూకు అద్దంపడుతోందీ చిత్రం. అరేబియా సముద్రంపై బాంద్రా-వర్లి మధ్య నిర్మించిన వంతెన నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యం

అది వందలా, వేలా, లక్షలా అన్నది పక్కనపెడితే ఏ దేశానికీ జరగనంత నష్టం మనకు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే సామాజిక దూరం పాటించడంలో భారతీయులుగా మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి. సామాజిక దూరానికి, వ్యక్తిగత పరిశుభ్రతకూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అమెరికా లాంటి దేశాలే ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోతున్నాయి. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.

అల్లం, వెల్లుల్లి, హోమియో, పసుపు వంటి సంప్రదాయ వస్తువులతో కరోనా వైరస్‌ను నివారించగలిగేదే అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని మహమ్మారితో ఎందుకు పోల్చుతుంది. డబ్ల్యూహెచ్‌వోలో ఉన్న నిపుణులకు అల్లం, వెల్లుల్లి పేస్టు, పసుపు చేసే మేలు గురించి తెలియదా? శుభానికి చిహ్నంలా వాడే పనుపులో యాంటీబయోటిక్స్ విరివిగా ఉన్నాయని తొలుత చెప్పింది డబ్ల్యూహెచ్‌వోనే కదా? అలాంటి వస్తువులకు కరోనా వైరస్‌ను చంపేసే గుణమే ఉంటే ప్రపంచం అంతా ఎప్పుడో వాటిని వాడి ఈ మహమ్మారిని నియంత్రించేది.

లాక్‌డౌన్ ప్రభావంతో మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ కూడలి వెలవెలబోతున్న దృశ్యం

దయచేసి ఇంట్లో ఉండండి. నిరక్షరాస్యులలో కరోనా వైరస్ ప్రమాదం పట్ల అవగాహన పెంపొందించండి. వాళ్ళకి దీని ప్రభావాన్ని గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి. అధికారిక లెక్కల ప్రకారం ఇటలీలో ప్రతి 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అక్కడ అంత మంది చచ్చిపోయారు. అదే మన భారత్‌లో ప్రతి 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇక్కడి ఆసుపత్రుల్లో. ‘మేము బాగున్నాం, మాకు ఎం కాదు’ అనుకోవడం మానేసి ప్రభుత్వానికి సహకరించండి. లాక్‌డౌన్ లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తించండి. ఈ వైరస్ గాలిలో నుంచి కూడా వస్తుంది అని తాజాగా డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేసిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకుని ముందడుగు వేయడం మంచిది.

ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసం చేస్తున్న మోసమని గ్రహించండి. దయచేసి డాక్టర్స్‌కి, నుర్సులకి, పారామెడికల్ సిబ్బందికీ పని పెంచే ప్రయత్నం చేయవద్దు. ఎక్కడికీ వెళ్లవద్దు. మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళని చూడకుండా ఉండండి. దయచేసి ఎవరో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో తిరగద్దు. భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ దానంతట అదే చస్తుంది వంటి చౌకబారు ఆలోచనలు, మాటల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ మధ్య మరో చమత్కారం హల్‌చల్ చేస్తోంది. ‘మందు తాగిన వారికి అసలు కరోనా అన్నదే రాదు’ అని కొంత మంది కరోనాను తక్కువ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇవన్నీ నిజాలు కావు. ఈ వైరస్ ఏ ఉష్ణోగ్రతలో అయిన వ్యాపిస్తుంది.

ఢిల్లీలోని ఓ ప్రధాన మార్కెట్‌లో మంగళవారం నాటి లాక్‌డౌన్ ప్రభావం

1918లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో దాదాపు కోటి మంది చచ్చిపోయారు. అపుడు విమానాలు లేవు, షిప్‌లు ఇంతగా లేవు. అయినా కూడా అంతలా వ్యాపించింది. కరోనా వ్యాప్తి, కేసుల సంఖ్యలో భారత్‌ ఇతర దేశాల కంటే దిగువ స్థానంలో ఉందని, కేవలం వందల మంది మాత్రమే బాధపడుతున్నారనీ తక్కువగా చూడకండి. ఈ మహమ్మారి వ్యాపించడానికి పెద్ద సమయం అవసరం ఉండదని భారత్‌లో గత వారం పది రోజుల్లో పెరిగిన కేసులను చూస్తే అర్ధమవుతుంది. ఒక వారంలోనే ఇటలీ, ఇరాన్‌లో 300 నుంచి 6000-7000 వరకు 2 వారాలలో 20,000కు బాధితులు పెరిగిపోయారు.

చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి. ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకావద్దు. ఇంట్లో ఉండండి. దగ్గు, జలుబు ఉంటే ఎవరిని తాకవద్దు. కనీస జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌కు సహకరిస్తూ స్వీయ నియంత్రణలో ఉంటే కనీసం వ్యాధి వ్యాప్తినైనా నియంత్రించవచ్చు. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఆసుపత్రుల పాలైన వారు త్వరగా కోలుకుని మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుందాం.