చితికి రాని ఆత్మీయత

మానవత్వం కనుమరుగు

ఖనన… దహన కాండలపై నరకయాతన

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

కరోనా మహమ్మారి వికృత దాడిలో మానవత్వం ‘చితి’కిపోతుంటే దానవత్వం చెలరేగిపోతోంది. అను బంధం, ఆత్మీయతల్ని కాటికి దరిచేరనీయటం లేదు. కడకు చితి మంటలార్పే కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. అనుబంధం ఆత్మీయతే కాదు కనీసం ఆత్మస్తుతీ నీరుగారిపోతోంది. కరోనా వైరస్ కాలిగజ్జలు మోగుతున్న వేళ ఊరి పొలిమేరల్లోనే ముళ్ల కంచెలు వెలిశాయి. మరో ఊరి జనం చుట్టుపక్కల కనిపించ రాదనే ఆంక్షలు పహారా కాశాయి.

ఆ తరువాత రోగగ్రస్తుల కాలం ఆరంభమైంది. ఇంటి పక్కనోళ్లకు కరోనా వస్తే భరించలేని కోపం తెరమీదకు వచ్చింది. ఊరి నుంచి వెలి వేత రంగ ప్రవేశం చేసింది. అప్పటివరకూ కరోనా రోగి పొరుగు వాడిగా భీష్మించిన కుటుంబాన్ని కరోనా కబళించింది. మృత్యువు కాటేసింది. అంతే ఆ శవం ఊళ్లోకే కాదు.. కనీసం ఇంటి ముంగిట వాలటానికి వీల్లేని దౌర్భాగ్య స్థితి తాండవం చేస్తోంది. కేవలం ఇంటి పేరిట బంధువులే కాదు, ఇంటిల్లిపాది కడసారి చూపునకు నోచు కోలేని స్థితి దాపురించింది. మరు భూములుగా పేరొందిన స్మశానాలు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. పరాయి ప్రాంతాల మృతదేహాలే కాదు సొంత ఊళ్లో సమాధికి స్థలం ఉన్నా ఖననం, దహనం నిషిద్ధమంటూ గొంతులు పిక్కటిల్లాయి.

ఇప్పటికే దేశంలో 31 వేలకు పైగా బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా ఆంధ్రప్రదేశ్‌లో 1000 మృతదేహాలు అంత్యక్రియలకు నానా తంటాలు పడ్డాయి. అనాథ శవాలను తీసుకు వెళ్లే మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది ముందుకు రావటానికి సుతారాము ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకూ నగరాల్లో స్వర్గధామం, కైలాసం, వైకుంఠం, స్వర్గపురి పేర్లతో అంతిమయాత్రలతో కిటకిటలాడిన స్మశానాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో అనేక ముఖ్య పట్ట ణాల్లో విద్యుత్తు దహన వేదికల్లో యంత్రాలు మూలన పడ్డాయి. ఇక పట్టణాల్లో కొవిడ్ మృతుల ఖనన ప్రక్రియ పెద్ద సవాలుగా మారింది.

గ్రామీణ ప్రాంతాల్లో అంత్యక్రియలకు అభ్యంతరాలు, నిరసనలు మార్మోగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా స్మశానంలో ప్రవేశానికి అవకాశం దొరక్క చివరకు అడవుల్లో గుంతలు తవ్వి శవాన్ని పూడ్చే పరిస్థితి ఏర్పడుతోంది. తిరుపతి సమీపంలో రంగంపేట వద్ద కరోనా మృతుల కోసం కల్యాణి డ్యాం సమీపంలోని 70 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రత్యేక ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారులు భూమి పరిశీలిస్తుంటే సమీప రంగం పేట గ్రామస్తులు వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాత్రి పూట నగరాల నుంచి కొవిడ్ మృతదేహాలను తీసుకువచ్చి ఎక్కడ అంత్యక్రియలు చేస్తారో అని పలుచోట్ల ప్రజలే కమిటీలుగా ఏర్పడి పహరా కాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత గ్రామస్తులే కరోనా దెబ్బతో చనిపోతే ఊళ్లో ఖననానికి సుముఖత చూపడం లేదు. ఇక గత ప్రభుత్వం రూ. 186 కోట్లతో స్మశానాలను అభివృద్ధి చేసుంటే ఈ సమస్య ఉండేది కాదని విశాఖపట్నం వాసులు వాపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 10, 107 స్మశానాలుంటాయని వీటిని దశలవారీగా అభివృద్ధి చేయాలని లక్ష్యాలను నిర్ణయించుకున్నప్పటికీ అమలులో నత్తనడకన ఉన్నాయి.

అనేక నగరాల్లో స్వచ్ఛంద సంస్థలుగా ఉండే రోటరీ, మహావీర్, విశాఖ డెయిరీ, మార్వాడీ సంఘాలు కొంతమంది సీఎమ్మార్, కొంత మంది దాతలతో మాత్రమే కొన్నిచోట్ల స్మశానాలలో మెరుగైన ఆధునిక వసతులున్నాయి. తిరుపతిలో నిర్వహిస్తున్న స్మశాన వాటికలో అత్యంత ఆధునిక వసతులు, ఎలక్ట్రికల్ ఖననం యంత్రం నిర్వహణ, రాష్ట్రంలో అన్ని స్వర్గధామాలకు ఆదర్శంగా నిలబడుతోంది. మృతుల అంతిమయాత్రలకు ఉపయోగించే వాహనాలు ప్రత్యేక వాహనాలు కూడా కోవిడ్ నేపథ్యంలో ముందుకు రావడం లేదు. కాటిలోనూ కష్టాలెన్నో స్మశానంలో కీలక భూమిక పోషించే కాటికాపరి, తలారీలు ఎంతో శ్రమకోర్చి అంత్యక్రియలు చేస్తుంటారు. వీరికి కనీసం రెవెన్యూ గానీ, స్థానిక సంస్థలు గాని జీతాలు చెల్లించవు. అంత్యక్రియలు నిర్వహించే బంధువులు ఇచ్చే తృణమో ఫలమో వీరికి ఆధారం. ఒక మృతదేహం ఖనానికి రూ. 2,500ల నుంచి రూ. 4,500ల వరకూ తీసుకుంటారు. మూడడుగుల లోతుతో రెండున్నర అడుగుల వెడల్పు, 5 నుంచి 6 అడుగుల మృతదేహాన్ని బట్టి గుంతలు తవ్వుతారు. స్మశానంలో స్థలం కొరతతో ఒక సంవత్సరం తరువాత పూడ్చిన మృతదేహం స్థలంలో తవ్వకాలు జరగ రాదు. కానీ స్థలం కొరత, మృతుల మృతదేహ ఖనన ఒత్తిడితో ఏడాది కాకముందే తవ్వకాలు జరుపుతారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అకాల మృత్యువు కోరల్లో చిక్కుకుని కడకు రక్త సంబంధీకులకు దూరమయ్యే పరిస్థితికి అసలు కారణం కరోనా వైరస్ ఉధృతి. ఈ రోగాన్ని కట్టడి చేసే శక్తి లేదని ప్రభుత్వాలు చేతులెత్తి వేయటంతో తమ ప్రాణాలు కాపాడే నాధులు కనపడక చివరికి రక్తసంబంధాల్ని జనం తెగతెంపులు చేసుకునే దయనీయ పరిస్థితి దాపురించిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్; +91 94919 99678, ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here