న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్‌టైమ్): భార‌తీయ వాయు సేన (ఐఏఎఫ్‌) మూడు రోజుల ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (ఏఎఫ్‌సీసీ) ముగిసింది. దేశ భద్రతా రంగంలో ఎదుర‌వుతున్న తాజా స‌వాళ్ల‌ను ఎదుర్కోవటానికి కార్యాచరణ సంసిద్ధతలు, వ్యూహాలపై వరుస చర్చలు సమీక్షల తరువాత ఈ స‌మావేశం ముగిసింది. ప్రస్తుత పరిస్థితులపైన‌ చర్చించారు. తరువాత వచ్చే దశాబ్ద‌కాలానికి ఐఏఎఫ్‌ పరివర్తన రోడ్‌మ్యాప్‌ను సమగ్రంగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), జనరల్ బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (సీఎన్ఎస్) అడ్మిరల్ కరంబీర్ సింగ్, చీఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఎం.ఎం. నారావణే ఈ సమావేశంలో ప్రసంగించారు. వైమానిక ద‌ళం ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌లువురు కమాండర్లతో పాటు ప్రిన్సిపాల్ స్టాఫ్ ఆఫీస‌ర్‌ల‌తో సంభాషించారు. ఉమ్మడి, ఇంటిగ్రేటెడ్ వార్ ఫైటింగ్ విషయాలపై వారితో చ‌ర్చించారు.

వైమానిక ద‌ళంలోని అన్ని క‌మాండ్‌లు, విభాగాల స్థితిగ‌తులు, సమస్యలను చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్) సమీక్షించారు. సీఏఎస్ త‌న ముగింపు ప్రసంగం చేస్తూ విజ‌న్ 2030ని వ్య‌క్తీక‌రించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఐఏఎఫ్‌ పరివర్తనకు మైలురాళ్ల‌ను ఇందులో వెల్ల‌డించారు. వేగంగా మారుతున్న ప్ర‌స్తుత‌ ప్రపంచంలో ఎదుర‌వుతున్న భ‌ద్ర‌తా స‌వాళ్ల స్వభావాన్ని గుర్తించడం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. వీటికి త‌గ్గ‌ట్టు వేగంగా సామర్థ్యాల్ని పెంపొందించుకోవ‌డం, అన్ని ఆస్తుల సేవా సామర్థ్యం పెంచుకోవ‌డం, తక్కువ కాల వ్యవధిలో కొత్త టెక్నాలజీలను సమర్థవంతంగా ఏకీకృతం చేసే దిశగా అంకితభావంతో పనిచేయడాన్ని ఆయన ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. స్థిరమైన సామర్ధ్యం కోసం ఐఏఎఫ్ దీర్ఘకాలిక లక్ష్యాలు సముచిత సాంకేతిక పరిజ్ఞానాల సముపార్జన, ఉపాధిని మరియు దేశీయ వేదికలు, ఆయుధాల అభివృద్ధి తప్పనిసరి అని ఆయన పునరుద్ఘాటించారు. మానవ వనరులు ఐఏఎఫ్‌ అత్యంత విలువైన ఆస్తి కాబట్టి, నియామకం, శిక్షణ, ప్రేరణ వ్యూహాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి అని చీఫ్ పేర్కొన్నారు.