కరోనాపై పోరుకు వైమానిక దళం మద్దతు

64

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునే ప్రయత్నాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన మద్దతును కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా, అమోఘంగా అడ్డుకునేందుకు అవసరమైన మందులు తదితర సాధనాలను భారత వైమానిక దళం రవాణా చేస్తోంది. గత రెండు రోజుల్లో ఈశాన్య ప్రాంతంలోని గువాహతి, డీబ్రూగర్, మోహన్ బారి నుంచి; మధ్య భారత ప్రాంతంలోని ప్రయాగ్ రాజ్, గోరఖ్ పూర్, బరేలి, ఆగ్రా నుంచి; కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కాశ్మీర్, లద్దాఖ్ నుంచి అత్యవసర మందులను, సరుకులను ఐఏఎఫ్ విమానంలో తరలించారు. అంతేకాకుండా రెండవ తేదీ గురువారం ఆపరేషన్ సంజీవని పేరిట ఐఏఎఫ్ విమానంలో అత్యవసర మందులను మాల్దీవులలోని మాలేకు తీసుకెళ్ళారు.

లాక్‌డౌన్ వల్ల మాల్దీవులలో మందుల సరఫరా నిలిచిపోయి మందుల కొరత ఏర్పడింది. వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇండియా ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేయగలిగింది. విశ్వ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి వైమానిక దళం నిరంతర తోడ్పాటును అందజేస్తోంది. దేశవ్యాప్తంగా వైమానిక దళం స్థావరాలలో క్వారెంటైన్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు.