ద్విచక్రవాహనదారులకు ‘మంచు’ కష్టాలు!

35391
  • జాతీయ రహదారిపై ప్రయాణానికి హెచ్చరికలు జారీ

గుంటూరు, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): ద్విచక్రవాహనదారులకు ‘మంచు’ కష్టాలు ఎక్కువయ్యాయి. సాధారణంగా ఈ సీజన్‌లో మంచు అధికంగా కురుస్తుంటుంది. రహదారులపై ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. ఫాగ్ లైట్లు వెలిగించి వాహనాన్ని నడిపినా ప్రమాదాలు తప్పని పరిస్థితి. మంచు వలన రోడ్డు సరిగా కనిపించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడంతో గత రెండు రోజుల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. జిల్లాలో రెండు రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. శీతాకాలం కారణంగా ఉదయం 9 గంటల వరకు మంచుపడడంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు, పాదచారులు, జంతువులు, రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు కనపడక ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. మితిమీరిన వేగం ప్రమాదకరమని చెప్పారు.

మంచువలన రోడ్డుప్రమాదాలు జరగకుండా వాహనచోదకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ద్విచక్రవాహనదారులు, ఆటోలు, లారీలు, బస్సులు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు ఎదురుగా వస్తున్న వాహనాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హెడ్‌లైట్లు వేసుకొని మంచులో రోడ్డు స్పష్టంగా కనపడుతున్న ప్రదేశంలోనే వాహనాలు నడపాలన్నారు. వీలైనంత నెమ్మదిగా ప్రయాణం చేయడం మంచిదని చెప్పారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు వీలైనంతవరకు తిరగడం తగ్గించి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలన్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు పోలీసులు పదేపదే జాగ్రత్తలు చెబుతున్నారని, వాటిని బేఖాతరు చేసి ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. రోడ్డుసేఫ్టీఓత్‌ యాప్‌లో ప్రమాణాలు చేసిన వారందరిని సంక్షిప్త సందేశాల ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుందని చెప్పారు. మంచు కారణంగా జనవరి చివరి వరకు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు అరికట్టాలని ఎస్పీ కోరారు.

మరోవైపు, జిల్లా కలెక్టర్ కూడా వాహనచోదకులకు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ద్విచక్రవాహనదారులు రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారుల్లో ప్రయాణించారదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి ఉంటే బస్సులలో గాని లేదా ఏదైనా పెద్ద వాహనాల్లో ప్రయాణించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ప్రజలకు సూచించారు. ఇదిలావుండగా, హైదరాబాద్ నగర శివార్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు దట్టమైన మంచులో ప్రయాణించాలంటే ప్రజలకు కత్తిమీద సాములాగా ఉంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచులో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. మంచులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు కారణాల గురించి ప్రజల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొగ మంచులో వేగంగా ప్రయాణం చేయటం, నైపుణ్యం లేని శోధన ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మంచు కురుస్తున్న సమయంలో రహదారులపై వాహనాలను నిలిపి ఉంచటం దగ్గరకు వచ్చేవరకు నిలిపి ఉన్న వాహనం కనిపించకపోవడం ప్రమాదాలకు మరో కారణంగా చెప్పవచ్చు. రహదారుల వెంట మంచులోను, చీకట్లోను కనపడే విధంగా అధికారులు రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది ఆకతాయిలు వాటిని ధ్వంసం చేయడం ప్రమాదాలకు హేతువులుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని చెప్పవచ్చు. పొగమంచు కారణంగా ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని రాజేంద్రనగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు.

మంచుతెరలు మాయమయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఒకవేళ ప్రయాణం చేసినా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిదన్నారు. రోడ్డుకు ఎడమవైపున సాధ్యమైనంత వరకు మార్జిన్‌లో ప్రయాణించాలన్నారు. వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలిపివేయకపోవడం మంచిదన్నారు. లైట్లు వేసుకొని ప్రయాణించాలన్నారు. అద్దాలను తుడిచే వైబర్లు సక్రమంగా ఉంచుకోవడం, మోటార్ వెహికిల్స్‌లో ప్రయాణించేటప్పుడు వైబర్లు వేసి ఉంచడం కొంత వరకు ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయం తెలిపారు.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించటం మంచిదన్నారు. మంచు రేణువులు శరీరంలోకి పోకుండా ముక్కుకు, నోటికి కర్చీప్‌లు కట్టుకోవడం, మాస్కులు ధరించడం ప్రయాణంలో సురక్షితమైన అంశాలుగా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మంచుతెరలు తొలగే వరకు ప్రయాణాన్ని ఆపివేయటం, తప్పనిసరి అయితే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడం మంచి లక్షణంగా చెప్పవచ్చు. బస్సులో ప్రయాణం పెద్ద వాహనం కనుక మంచు ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పారు.