హైదరాబాద్, ఏప్రిల్ 10 (న్యూస్‌టైమ్): ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సలహాదారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ స్పెషల్ సీఎస్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య నియమితులయ్యారు. ఐసీఎంఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన జాతీయ ప్రాజెక్టు అయిన యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ బయో మెడికల్ రీసెర్చ్ సలహాదారుగా ఆచార్యను సలహాదారుగా నియమించింది.

జినోమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌ను సృష్టించడానికి ఆయన చేసిన కృషికి, ఈ రంగానికి ఆయన అందించిన సహకారానికి గుర్తింపుగా ఐసీఎంఆర్ ఈ ఎంపిక చేపట్టింది. దాదాపు 300 కోట్ల పెట్టుబడితో యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ బయో మెడికల్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రీ క్లినికల్ యానిమల్ ట్రయల్స్ కోసం దేశంలోని ఫార్మా, బయోఫార్మా, వ్యాక్సిన్ పరిశ్రమకు ఐసీఎంఆర్ సేవలందిస్తుంది.