వినియోగం ఎక్కువైతే.. బిల్లులు సహజం!

0
8 వీక్షకులు
  • కరెంట్ షాక్ కష్టాలపై మంత్రి పేర్ని నాని వ్యాఖ్య

మచిలీపట్నం, మే 21 (న్యూస్‌టైమ్): కరెంట్ బిల్లులు వాడుకున్నంతే వచ్చాయని, లాక్‌డౌన్ సమయంలో ప్రజలు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతోనే బిల్లులు సహజంగానే వచ్చాయని జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతుందని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రమయ్య (నాని) తేల్చిచెప్పారు.

గురువారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి ఇబ్బందులను స్వయంగా కనుకొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని, పనులు లేకపోవడంతో తాము ఆ బిల్లులు చెల్లించలేమని ఆర్ధికంగా ఎంతో పడుతున్నట్లు మంత్రి పేర్ని నాని ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. విద్యుత్ బిల్లులపై కొందరు అనవసరపు అనుమానాలు పెంచి ప్రజలలో అనవసర గందరగోళం నెలకొల్పి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అన్నారు.

శ్లాబుల ధరలు పెరిగాయని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. స్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్లు ప్రచారం సాగిస్తున్నారని వివరించారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని, మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ప్రజలకు ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే అది కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు.

తన గృహంలో సైతం ఇటీవల విద్యుత్ వినియోగం అధికమయ్యిందని లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో విద్యుత్ ఉపకరణాలను అత్యధికంగా ఉపయోగించడం వలెనే తమకు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చేయని మంత్రి చెప్పారు. భాస్కరపురానికి చెందిన పలువురు మహిళలు తమకు ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిగా ఉందని, నిత్యావసర సరుకులను అందచేసి తమను ఆదుకోవాలని వారు మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు. ‘‘తప్పక మీ ప్రాంతానికి వచ్చి ఆ సహాయం చేస్తాను’’ అని ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఇసుక కష్టాలపై మచిలీపట్నం బలరామునిపేట రాజీవ్‌నగర్‌కు చెందిన గొర్లె శ్రీరాములు మంత్రి పేర్ని నానికి విన్నవించిన సందర్భంలో మరలా ఆన్లైన్ ఇసుక బుకింగ్ మొదలవుతుందని మంత్రి తెలిపారు.

బందరు ప్రభుత్వాసుపత్రిలో స్ట్రెచర్ బేరర్ కాంట్రాక్టు ఉద్యోగం ఉందని తనకు ఆ ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలని మచిలీపట్నం జనశక్తి నగర్‌కు చెందిన వేములమడ భాను ప్రసాద్ మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు. రైతుల వద్ద తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొని వేరే ప్రాంతాలలో లాభాలను జోడించి అత్యధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారని, అలాగే లాక్‌డౌన్ కారణంగా ప్రజలు వెలుపలికి రాలేని పరిస్థితి ఉందని, ఆన్లైన్‌లో ఆయా ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ధరల పట్టిక ప్రకారం కిసాన్ గ్రోసరీ యాప్ రూపొందించామని చల్లపల్లి మండలం కొత్త మాజేరుకు గ్రామానికి చెందిన బీటెక్ చదివిన అంకెం మోహన్ సాయి ప్రసాద్, మనోజ్ కుమార్ రెడ్డి అనే యువకులు మంత్రి పేర్ని నానికి తమ యాప్ పనితీరు వివరించారు.

మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన వహీద్, శ్రీనివాసనగర్‌కు చెందిన తోట గౌరీ శంకర్‌లు తమకు తెలుపు రంగు రేషన్ కార్డు లేకపోవడం చేత నిత్యావసరాల కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా కార్డులను మంజూరు చేయాల్సిందిగా మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here