మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్

విజయవాడ, జనవరి 19 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని ఎంపీ నందిగాం సురేష్ హెచ్చ‌రించారు. గొల్ల‌పూడిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చుతున్నార‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను పేద‌ల‌కు అంద‌జేసి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నార‌ని తెలిపారు. ఇక త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని గ్ర‌హించిన టీడీపీ నేత‌లు కడుపు మంట‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు. దేవినేని ఉమాకు ద‌మ్ము, దైర్యం ఉంటే చంద్ర‌బాబు హ‌యాంలో ఏయే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారో? వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక ఎంత అభివృద్ధి చేశారో చ‌ర్చించేందుకు ముందుకు రావాల‌న్నారు.

డేట్‌, స‌మ‌యం, వేదిక వారినే నిర్ణ‌యించుకోవాల‌ని సూచించారు. నిన్న గొల్ల‌పూడి గ్రామంలో దాదాపు 4 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయ‌డంతో ఓర్వ‌లేక దేవినేని ఉమా రోడ్డుపైకి వ‌చ్చి ర‌చ్చ చేసి ప‌బ్లిసిటీ పొందాల‌ని ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. బ్ర‌హ్మండ‌మైన రాజ‌ధాని నిర్మిస్తాన‌ని గొప్ప‌లు చెప్పిన చంద్ర‌బాబు ఒక ఇటుక కూడా వేయ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేద‌ల గురించి ఎంత సుక్ష్మంగా ఆలోచిస్తున్నారో గ‌మ‌నించాల‌న్నారు. పేద‌వాడి ఇంటి నిర్మాణానికి ఏ మెటిరీయ‌ల్ అవ‌స‌రం, ఎలాంటి సిమెంట్‌, ఇనుము వాడాల‌ని ఒక ముఖ్య‌మంత్రి ఆలోచ‌న చేస్తున్నారంటే పేద‌వారిపై ఆయ‌న‌కు ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌మన్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో క‌ట్టించిన ఇందిర‌మ్మ కాల‌నీలోనే తాను ఇప్ప‌టికీ నివ‌సిస్తున్నాన‌ని ఎంపీ నందిగాం సురేష్‌ చెప్పారు.