51వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే చిత్రాలు

న్యూఢిల్లీ, జనవరి 3 (న్యూస్‌టైమ్): 51వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇప్ఫీ) ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. థామస్ వింటర్‌బర్గ్ దర్శకత్వం వహించిన ‘అనథర్‌ రౌండ్’తో వేడుక ప్రారంభమవుతుంది. ఇఫ్పీలో ప్రదర్శితంకానున్న ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. కేన్స్‌ ఉత్తమ నటుడిగా నిలిచిన మాడ్స్ మిక్కెల్సెన్ ఇందులో నటించారు. డెన్మార్క్‌ నుంచి ఆస్కార్‌కు ఈ సినిమా అధికారికంగా నామినేట్‌ అయింది. ప్రపంచ స్థాయి సినిమా ‘మెహ్రూనిసా’ కూడా ఈ వేడుకల్లో అలరించనుంది. సందీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేడుకల సగంలో ప్రదర్శితమవుతుంది. ప్రముఖ నటుడు ఫరూఖ్ జాఫర్ నటించిన ఈ చిత్రం, ఒక మహిళ జీవితకాల కలను వివరిస్తుంది.

జపాన్‌ దర్శకుడు కియోషి కురోసావా చేతిలో రూపుదిద్దుకున్న ‘వైఫ్ ఆఫ్ ఏ స్పై’ చిత్రంతో, ఈనెల 24న చిత్రోత్సవం ముగుస్తుంది. వెనిస్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో, ఉత్తమ దర్శకుడి విభాగంలో ఈ సినిమా వెండి సింహం పురస్కారాన్ని దక్కించుకుంది. ఇఫ్పీ సందడి మొత్తం గోవాలో సాగనుంది. ఆన్‌లైన్‌, భౌతిక పద్ధతులు కలగలిపి, తొలిసారిగా మిశ్రమ విధానంలో చిత్సోత్సవం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న 224 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇండియన్‌ పనోరమ చిత్ర విభాగం కింద, 21 నాన్-ఫీచర్, 26 ఫీచర్‌ ఫిల్మ్‌లు కనువిందు చేయనున్నాయి.

మీడియా ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 10వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. 2020 జనవరి 1వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయస్సు 21 ఏళ్లు నిండివుండాలి. ఇప్ఫి వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలను కనీసం మూడేళ్లపాటు కవర్‌ చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.