సీఎం నిర్ణయాలను అమలుచేయాలి: ఎర్రబెల్లి

50

వరంగల్, ఏప్రిల్ 14 (న్యూస్‌టైమ్): కరానా నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల ప్ర‌జ‌లే కాదు దేశం, ప్ర‌పంచ‌మంతా హ‌ర్షిస్తున్న‌దని, ఇక సీఎం నిర్ణ‌యాల‌ను అమ‌లు ప‌రిచే బాధ్య‌త అధికారుల‌దేనని, ఆ నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాద‌టులోకి రావ‌డానికి వీలుగా అధికారులు-ప్ర‌జ‌ల మ‌ధ్య అనుసంధానం, స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త ప్ర‌జాప్ర‌తినిధులు తీసుకోవాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మంత్రి హ‌న్మ‌కొండ‌లోని నంద‌న గార్డెన్‌లో వ‌రంగ‌ల్ రూర‌ల్, అర్బ‌న్ జిల్లాల ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి, ఆయా జిల్లాల కలెక్ట‌ర్లు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ‌, మార్క్ ఫెడ్, మార్కెట్, గిడ్డంగులు, పోలీసులు, వైద్యులు వంటి ప‌లు శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించారు. అనంత‌రం మీడితో మాట్లాడారు.

క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌జ‌లంతా క‌ట్ట‌డిగా ఉండాలని, లాక్‌డౌన్‌ని పాటించాలని, ఇక రైతాంగం నుంచి చివ‌రి గింజ వ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తున్న‌దన్నారు. ‘‘మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తున్నాం. మిర్చీ పంట‌లు కూడా కొనుగోలు మొల‌య్యాయి. రైతులు భ‌రోసాగా ఉండండి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కెసిఆర్ ప్ర‌జ‌ల్ని, రైతాంగాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డానికి అన్ని విధాలుగా క‌ష్ట ప‌డుతున్నార‌ని, మ‌నం చేయాల్సింద‌ల్లా సిఎం స‌హ‌క‌రించ‌డ‌మే’’ అని అన్నారు. ‘‘క‌రోనా వైర‌స్ ని నిర్మూలించ‌డంలో సిఎం కెసిఆర్ నిర్ణ‌యాల‌ను దేశం, ప్ర‌పంచ‌మంతా అభినందిస్తున్న‌ది. అంద‌రికంటే ముందే లాక్‌డౌన్ వంటి క‌ఠిన‌, సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌ను ఆయ‌న తీసుకున్నారు. అవ‌న్నీ స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. ఇప్పుడు మ‌నం చేయాల్సింద‌ల్లా ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డ‌మే’’ అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు.

రైతాంగానికి మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించే విధంగా, ధాన్యం, మ‌క్క‌జొన్న‌లు కొనుగోలు చేసే విధంగా నిబంధ‌న‌ల‌ను సీఎం స‌ర‌ళ‌త‌రం చేశార‌న్నారు. మిర్చీ పంట‌ల‌ను కూడా మార్కెట్ల‌లో కొనుగోలు చేస్తున్నామ‌న్నారు. ఒక‌వేళ త‌మ పంట‌ల‌ను ఇప్పుడే అమ్ముకోవ‌డానికి సిద్ధంగా లేని రైతుల కోసం ప్ర‌భుత్వం కోల్డ్ స్టోరేజీ గోదాముల్లో వారి పంట‌ల‌ను నిలువ పెట్టుకోవ‌డ‌మే గాక‌, ఆ పంట‌ల మీద వ‌డ్డీలేని రుణాల‌ను మంజూరు చేస్తున్న‌ద‌న్నారు. ఇలాంటి ప‌థ‌కం దేశంలోనే ఎక్కడాలేద‌న్నారు. ఎనుమాముల మార్కెట్ లో 10 మంది మిర్చీ రైతులు త‌మ పంట‌ల‌ను నిలువ చేసుకున్నార‌ని, వారిలో ఒక్కొక్క‌రికి రూ.2ల‌క్ష‌ల చొప్పున ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఆఖ‌రు గింజ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తున్నందున రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు రైతాంగానికి భ‌రోసా ఇచ్చారు.

ఇక లాక్‌డౌన్‌ని ప్ర‌జ‌లు పూర్తిగా పాటించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌లు ఇళ్ళ‌కే ప‌రిమితం కావాల‌న్నారు. క‌రోనా చైన్‌ని తెంచివేయాలంటే తెగించి సామాజిక‌, భౌతిక దూరం పాటించాల‌ని, లాక్‌డౌన్‌లో ఉండాల‌ని మంత్రి అన్నారు. అధికారులు, పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. సిఎం కెసిఆర్ తీసుకుంటున్న అన్ని చ‌ర్య‌లూ అద్భుతంగా ఉన్నాయ‌ని, రాష్ట్ర ఖ‌జానాను సైతం లెక్క చేయ‌కుండా, ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించ‌డానికి అన్ని విధాలుగా సిఎం ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ప్ర‌జావ‌స‌రాలు తీరేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌న్నారు. లాక్‌డౌన్‌కి ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ స‌మీక్ష‌, మీడియా స‌మావేశాల్లో మంత్రి ఎర్ర‌బెల్లితోపాటు రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ‌య్య‌, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల స‌తీశ్, డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, వ‌రంగ‌ల్ అర్బ‌న్, రూర‌ల్ క‌లెక్ట‌ర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హ‌రిత‌, పోలీసు క‌మిష‌న‌ర్ ర‌వింద‌ర్, మార్క్ ఫెడ్ జీఎం భాస్కరాచారి, వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న‌, మార్కెట్ వంటి ప‌లు శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.