ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు అమలు: చిత్తూరు ఎంపీ

1601

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చిత్తూరు ఎం.పి రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ప్రజా సంక్షేమ అమలు గురించి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో చిత్తూరు ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేస్తున్నారని అందుకు అధికారులందరూ సహకరించాలన్నారు.

క్షేత్ర స్తాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులదరూ చిత్తశుద్ధితో పని చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఇందుకు ప్రజా ప్రతినిధుల అందరి సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్నదని మీరు, మేము, మనం ఒక్కరిగా పని చేసి జిల్లాను ప్రగతి పథంలో పయనింపచేయాలని, వ్యవస్థకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షిస్తూ ప్రథమంగా వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా రైతుల భూముల్లో భూసార పరీక్షలను నిర్వహించాలని, యాంత్రీకరణను ప్రోత్సహించాలని పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్ర రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నియోజకవర్గానికి భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు.

అనంతరం హార్టి కల్చర్, ఏపిఎంఐపి శాఖల పై సమీక్షిస్తూ హార్టి కల్చర్‌లో అందించే రాయితీలపై సామాన్య ప్రజలకు అవగాహన లేదని తంబళ్లపల్లి శాసన సభ్యులు ద్వారకనాథ రెడ్డి సభ దృష్టికి తీసుకురాగా హార్టి కల్చర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యటించి సామాన్య ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

అనంతరం పశు సంవర్థక శాఖపై సమీక్షిస్తూ దాణా కొరత కలదని, పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, ఆవులు, గేదెలు, గొర్రెలను లోన్ ద్వారా పొందినపుడు ఇతర జిల్లా నుండి తెప్పించాలని నిబందన ఉండడంతో ఆ జీవులు ఈ ప్రాంత వాతావరణానికి సర్దుబాటు కాలేక చనిపోతున్నాయని పీలేరు, సత్యవేడు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి, ఆదిమూలం సభ దృష్టికి తీసుకునిరాగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించి 400 టై అప్, 3483 ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్.ఇ వేణు వివరించగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్థానికంగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలని, కొత్త బోర్లు వేయడానికి అనుమతులు మంజూరు చేయడం లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.

డ్వామా సమీక్షలో భాగంగా 178 లక్షల పని దినాలను జనరేట్ చేశామని, ఒక లక్షా 6 వేల ఫారం పాండ్లను నిర్మించామని, ప్రతి స్థలంలో ఆట స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డ్వామా పిడి చంద్ర శేఖర్ సభకు వివరించగా డ్వామా కింద ప్రతి పంచాయతీలో శ్మశాన వాటిక ఏర్పాటుకు భూమిని గుర్తించాలని, భూమి లేని చోట భూ సేకరణ ద్వారా అయినా శ్మశాన వాటిక ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా పలమనేరు, బంగారుపాలెం, మదనపల్లె ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, సరైన సదుపాయాలు లేవని భాదలతో వచ్చే పేద వారికి మెరుగైన వైద్య సేవలను అందివ్వాలని పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె శాసన సభ్యులు వెంకటే గౌడ్, ఎన్.బాబు, నవాజ్ బాషా సభ దృష్టికి తీసుకుని రాగా డిఎం అండ్ హెచ్ఓ, డిసిహెచ్ఎస్‌లు ఈ ఆసుపత్రులను పరిశీలించి నివేదికలను ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశించారు.

చిత్తూరు శాసన సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్ని పంచాయతీలకు కాకపోయిన కొన్ని ఊళ్ళకు అయిన శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లాను సంక్షేమ పథకాల అమలులో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పందన కార్యక్రమంపై సమీక్ష అనంతరం 2700 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు గుర్తించడం జరిగిందని 10 వేల ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని జె సి డి.మార్కండేయులు సభకు వివరించారు.