ఆకట్టుకున్న బీజేపీ ఇసుక సత్యాగ్రహం

241
విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం చేపట్టిన ఇసుక సత్యాగ్రహం నిరసననుద్దేశించి మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు

విజయవాడ, నవంబర్ 4 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత నేపథ్యంలో జీవనోపాధికి దూరమైన భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఇక్కడి ధర్నా చౌక్‌లో చేపట్టిన నిరసన కార్యమానికి మంచి స్పందన లభించింది.

భాజపా ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ నాయకత్వంలో చేపట్టిన ‘ఇసుక సత్యాగ్రం’లో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, కిశోర్‌బాబు, పార్టీ నేతలు కిలారు దిలీప్, షేక్ బాజీ, శ్రీనివాసరాజు, సత్యమూర్తి, చాగర్లమూడి గాయత్రి తదితరులు మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగంపై ఆధారపడ్డ రోజువారీ కార్మికులకు పనుల్లేకుండా పోయాయని, వరదలు, వర్షాల పేరిట ఇసుక పంపిణీని స్తంభింపజేయడం గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వం తాజాగా అనుసరిస్తున్న వైఖరి వల్ల నిర్మాణ, దాని అనుబంధ రంగాలలో పనిచేస్తున్న వారికి సమస్యలు తప్పడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వరదల వలన ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్తున్న సమాధానం సహేతుకంగా లేదన్నారు. ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఇసుక పాలసీకి ముహూర్తం పెట్టారని, ప్రభుత్వ డబ్బులతో పంచాయితీల భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ లక్షలాది మందికి ఉపాధి మార్గమైన ఇసుక సరఫరాపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

‘‘రేపు ఎన్నికల సమయంలో ఈసీకి ఏం సమాధానం చెబుతారు? భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు. సిగ్గుండాలి… మీడియాపై ఆంక్షలు విధించడానికి. మీకు కూడా సొంత మీడియా ఉంది. ఒక్కటైనా నిజం రాస్తున్నారా? మంచి పాలన అందించి, మంచి వార్తలు రాయించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ప్రజల కష్టాలు పడుతుంటే పత్రికలలో ఆ కష్టాలు రాకూడదంటే ఎలా? ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని కార్మికుల కష్టాలు తీర్చాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.