ఆదాయంలో పెద్దది… అభివృద్ధిలో చిన్నది!

3996
  • నేడు దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…

భారతదేశంలోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966 అక్టోబర్‌ 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్‌ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే డివిజన్‌లు కలవు. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాదు, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరులతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్‌ డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించియున్న ఈ డివిజన్‌ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.

1966 అక్టోబర్‌లో భారతీయ రైల్వేలో 9వ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు. దక్షిణ రైల్వే జోన్‌ నుండి విజయవాడ, హుబ్లి డివిజన్లను, సెంట్రల్‌ రైల్వేలోని సికింద్రాబాదు, షోలాపూర్‌ డివిజన్లు వేరు చేసి ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. 1977 అక్టోబర్‌లో దక్షిణ రైల్వేకు చెందిన గుంతకల్లు డివిజన్‌ను దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో షోలాపూర్‌ డివిజన్‌ను సెంట్రల్‌ రైల్వేకు బదిలీ చేశారు.

1978లో సికింద్రాబాదు డివిజన్‌ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్‌ను నూతనంగా ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి సికింద్రాబాదు డివిజన్‌ నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించగా, హైదరాబాదు డివిజన్‌ పరిపాలన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2003, ఏప్రిల్‌ 1న కొత్తగా ఏర్పడిన గుంటూరు, నాందేడ్‌ డివిజన్లు కూడా ఈ జోన్‌లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్‌ను నూతనంగా ఏర్పాటైన నైరుతి రైల్వేలో విలీనం చేశారు.

ప్రస్తుతం ఈ జోన్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్‌) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.

డివిజన్ల పరిధి… మార్గాలు

సికింద్రాబాదు రైల్వే డివిజను:
సికింద్రాబాదు నుండి వాడి(స్టేషను కాకుండా) వరకు, ఖాజీపేట నుండి బల్లార్ష(స్టేషను కాకుండా) వరకు, వికారాబాద్‌ నుండి పర్లి వైజ్యనాథ్‌ వరకు, హైదరాబాద్‌ నుండి కొండపల్లి(స్టేషను కాకుండా) వరకు, డోర్నకల్‌ నుండి మణుగూరు వరకు, కారేపల్లి నుండి సింగరేణి కాలరీస్‌ వరకు.
హైదరాబాదు రైల్వే డివిజను:
కాచిగూడ నుండి ద్రోణాచలం(స్టేషను కాకుండా) వరకు, సికింద్రాబాదు నుండి నిజమాబాద్‌ నుండి ముద్ఖేడ్‌(స్టేషను కాకుండా) వరకు.
నాందేడ్‌ రైల్వే డివిజను:
ముద్ఖేడ్‌ నుండి మన్మాడ్‌(స్టేషను కాకుండా) వరకు, ముద్ఖేడ్‌ నుండి అదిలాబాద్‌ నుండి పింపలకుట్టి వరకు, పూర్ణ నుండి ఖాండ్వా(స్టేషను కాకుండా) వరకు, పర్బణి నుండి పర్లి వైజ్యనాథ్‌(స్టేషను కాకుండా) వరకు.
విజయవాడ రైల్వే డివిజను:
గూడూరు నుండి దువ్వాడ(స్టేషను కాకుండా) వరకు, నిడదవోలు నుండి నర్సాపూర్‌ వరకు, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు, విజయవాడ నుండి కొండపల్లి వరకు, గుడివాడ నుండి భీమవరం వరకు, సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్‌ వరకు.
గుంతకల్లు రైల్వే డివిజను:
గుత్తి నుండి ధర్మవరం వరకు, రేణిగుంట నుండి వాడి(స్టేషను కాకుండా) వరకు, తిరుపతి నుండి గూడూరు(స్టేషను కాకుండా) వరకు, గుంతకల్‌ నుండి కాట్పాడి(స్టేషను కాకుండా) వరకు, గుంతకల్‌ నుండి నంద్యాల(స్టేషను కాకుండా) వరకు, గుంతకల్‌ నుండి బళ్ళారి(స్టేషను కాకుండా) వరకు.
గుంటూరు రైల్వే డివిజను:
గుంటూరు నుండి కృష్ణాకెనాల్‌(స్టేషను కాకుండా) వరకు, గుంటూరు నుండి తెనాలి(స్టేషను కాకుండా) వరకు, గుంటూరు నుండి మాచెర్ల వరకు, రేపల్లి నుండి తెనాలి(స్టేషను కాకుండా) వరకు, గుంటూరు నుండి దొనకొండ నుండి నంద్యాల వరకు, నడికుడి నుండి మిర్యాలగూడ నుండి పగిడిపల్లి(స్టేషను కాకుండా) వరకు విస్తరించి ఉంది. ఇక, స్టేషన్లు, జంక్షన్ల వారీగా రైల్వే గురించి చెప్పుకోవాల్సి వస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంటూరు జంక్షన్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

గుంటూరు రైల్వే జంక్షను, భారతదేశ దక్షిణమధ్య రైల్వే విభాగానికి చెందిన ప్రధాన రైల్వే జంక్షనులలో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే విభాగములో గల ఆరు డివిజన్లలో ఇది ఒకటి. ఇది విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉన్నది. గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్‌ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్‌ లైన్‌ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు ఇంకా చేయవలసి ఉన్నది.

రైలుమార్గం పొడవు: 5809.990 కిలోమీటర్లు (బ్రాడ్‌గేజి:5634.060, మీటర్‌గేజి:175.930), రైల్వే ట్రాక్‌ పొడవు: 7806.251 కిలోమీటర్లు. డివిజన్ల సంఖ్య: 6. విస్తరించిన రాష్ట్రాల సంఖ్య: 5 (తమిళనాడు(7 కి.మీ)తో కలిపి), రైలు వంతెనల పొడవు: 117.85 కిలోమీటర్లు. విద్యుదీకరించిన మార్గం: 1620 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్లు సంఖ్య: 689, పనిచేస్తున్న మొత్తం సిబ్బంది : 84,145, రోజువారీ నడిచే ప్రయాణీకులు (ప్యాసింజర్‌) రైళ్లు సంఖ్య: 699, మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు సంఖ్య: 218, ప్యాసింజర్‌ రైళ్లు సంఖ్య: 302, లోకల్‌ రైళ్లు సంఖ్య: 58, ఎమ్‌ఎమ్‌టిఎస్‌: 121.