ఉగ్రదాడి హెచ్చరికలతో భద్రత పెంపు

949

న్యూఢిల్లీ, అక్టోబర్ 31 (న్యూస్‌టైమ్): రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఒక ఉగ్రవాద సంస్థ కుట్రపన్నిందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

బెదిరింపులకు సంబంధించి ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఒక లేఖ కూడా అందింది. దీని ప్రకారం, టెర్రరిస్టుల హిట్‌ లిస్టులో బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌‌భాగవత్‌, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్లు కూడా ఉన్నాయని తెలిసింది.

ఆలిండియా లష్కరే తొయబా హైపవర్‌ కమిటీ (కోజీకోడ్‌) నుంచి వచ్చినట్లు చెబుతున్న ఈ లేఖ నేపథ్యంలో ఆయా ప్రముఖులకు భద్రతను పటిష్ఠం చేశారు. విరాట్‌ కోహ్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కెప్టెన్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లందరికీ భద్రతను పటిష్ఠం చేశారు ఢిల్లీ పోలీసులు.

వచ్చేనెల 3న బంగ్లాదేశ్‌-భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. దీంతో ఆటగాళ్లంతా ఇక్కడి జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనున్న సందర్భంగా జట్టుకు భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమైనప్పటికీ అతని భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోనున్నట్టు పోలీసులు వెల్లడించారు.