తెలుగు రాష్ట్రాలపై ‘చలి పులి’ పంజా!

5131

హైదరాబాద్, జనవరి 15 (న్యూస్‌టైమ్): చలిపులి పంజా తెలుగు రాష్ట్రాలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఒక్కసారిగా చలి తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8, రామగుండంలో 12, హన్మకొండలో 13, హైదరాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకన్నా 3 డిగ్రీలు తక్కువగా ఉండటం వల్ల చలి పెరిగి పొగమంచు కురుస్తోంది.

గురు, శుక్రవారాల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌‌లోని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు, రాగల 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, మంగళవారం కూడా అత్యల్పంగా మెదక్‌లో 12, ఆదిలాబాద్, రామగుండంలో 14, హైదరాబాద్లో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు, పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3డిగ్రీలు పెరిగాయి. తూర్పు భారతదేశం నుంచి వీస్తున్న చలి తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టిందని, మరో 3 రోజుల తరువాత చలితీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన పొడి వాతావరణం ఒక విధంగా ప్రజలకు మేలు చేసిందనే చెప్పాలి.

చలి కూడా తక్కువగా ఉంటుడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్ వ్యతిరేక గాలులు ఉత్తరాది శీతలగాలులు అడ్డుకోవడం వల్ల పొడివాతావరణం ఏర్పడుతోందని వాతావారణ అధికారులు వెల్లడిస్తున్నారు. తూర్పు, ఈశాన్య భారతం నుండి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని, పగటి పూట సాధారణం కన్నా కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి సాధారణస్థాయిలోనే నమోదవుతోందన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధాని విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగింది. రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. మినుమలూరులో 6, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయం, రాత్రి సమయాలలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.