పెరిగిన ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం

3296

హైదరాబాద్, జనవరి 20 (న్యూస్‌టైమ్): మీకంటూ సొంత బ్లాగు, వెబ్‌సైటు లేదా యూట్యూబ్‌లో చానల్‌ ఉన్నట్లయితే, వాటిల్లో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. ఇందుకోసం గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఉచితంగానే అకౌంటు తీసుకోవాల్సి ఉంటుంది.

ఎంత ఎక్కువ మంది మీ బ్లాగ్ లేదా వెబ్‌సైటు/ఛానల్‌ను సందర్శిస్తే మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇక వీటిల్లో ఏం రాయాలంటారా? మీకు తెలిసినవీ, మీకు నచ్చిన విషయాల గురించి రాయొచ్చు.

యూట్యూబ్‌లో ఆసక్తికరమైన వీడియోలు రూపొందించి అప్‌లోడ్ చేయొచ్చు. అప్‌లోడ్ చేయడం ఒక్కటే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వాటిని చూసేలా సోషల్ మీడియాలో ప్రమోట్ కూడా చేయాలి.

యూట్యూబ్ సగటున సుమారు 1,000 వ్యూస్‌కి 10 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా భారీగా ఆర్జిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

తాజా నివేదికల ప్రకారం ఈ శాతం ఏటా వంద రెట్లు పెరుగుతోందంటే నమ్మశక్యంకాదు. ఎల్‌రూబియస్‌ఓఎంజీ పేరుతో యూట్యూబ్ చానల్‌ని నిర్వహించే 24 ఏళ్ల స్పానిష్ వీడియో గేమ్ కామెంటేటర్ దీని ద్వారా ఏటా దాదాపు రూ. 24 కోట్ల దాకా అందుకుంటున్నాడు అంటే ఎవరూ విశ్వసించరు.

అసలు కనీసం పైసా ఆదాయం రాని.. వాట్సప్‌ గ్రూప్‌లలో మెసేజ్‌లు పెడుతూ, వాటిల్లో వచ్చేవాటిని షేరింగ్/ఫార్వర్డ్ చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవడానికి బదులు సొంత బ్లాగ్/పోర్టల్/వెబ్‌సైట్/ఛానల్ ఏదో ఒకటి ఏర్పాటుచేసుకుని దాని కోసం రోజుకు ఓ రెండు మూడు గంటలు సమయం కేటాయిస్తే తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడమే కాకుండా తమలాంటి మరికొంత మంది ఔత్సాహితులకూ ఉపాధి కల్పించిన వారవుతారు.

ఒక్కమాటలో చెప్పాలంటే, సృజనాత్మక సైట్‌లకు నేడు బోలెడు ఆదాయం లభిస్తోంది. కాస్తంత పరిజ్ఞానం, మరికాస్త నైపుణ్యంతోనే ఇదంతా సాధ్యం. ఔత్సాహితులకు ఇప్పుడు ఇదో ఆసక్తిదాయక అంశంగా మారింది. అంతర్జాలం వాడుకొని కాస్త బుర్ర పెడితే సులభంగా సంపాదించేయొచ్చని అనేక మంది ఇప్పటికే గ్రహించారు.

సంప్రదాయ చదువులు, కొలువుల కంటే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల ద్వారా యువతరం పది రెట్ల ఆదాయం సులభంగా పొందుతుండటమే దీనికి ప్రధాన కారణం. మారుతున్న సాంకేతి పరిజ్ఞానానికి, డిజిటల్‌ కాలానికి తగ్గట్టుగా ఆధునికంగా, సాంకేతికంగా, వినూత్నంగా ఆలోచించి ముందడుగు వేసేవారంతా ఈ రంగంలో రాణిస్తున్నారు.

సామాన్య కొలువులు చేసుకునేవారూ వూహించని సంపాదనను సొంతం చేసుకుంటున్నారు. కేవలం ఇంట్లో ఓ కంప్యూటర్‌, దానికి అంతర్జాల కనెక్షన్‌ ఉంటే చాలు ఉపాధి కాళ్ల దగ్గరికే వచ్చేలా చేసుకుంటున్నారు. తమ సొంతూరిలో పొలం గట్టుపై కూర్చొని దర్జాగా సంపాదించుకుంటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

పాతికేళ్లు దాటని చాలా మంది యువకులు నెలవారీ లక్షల్లో సంపాదిస్తున్నారు. గూగుల్‌ సంస్థ నుంచి నగరాల్లోనే కాకుండా జిల్లాల్లోనూ కోట్లల్లో చెక్కులను యువతరం అందుకుంటోంది. వీరి కనీస సంపాదన నెలకు రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకూ ఉంటోందనేది ఓ అంచనా. షరతులు వర్తిస్తాయన్నట్లు వెబ్‌సైట్లకు సంబంధించిన పూర్తి సాంకేతికతపై పట్టు లేకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు. అనుకున్నంత తేలికా కాదు.

వెబ్‌సైట్లపై సంపాదిస్తున్న వారంతా తాము ఫలానా సాంకేతిక, సినిమా, వార్తలు, కళాశాలల ఉత్సవాలు (ఫెస్ట్‌లు), ఉద్యోగాల గురించి, నగరాలకు సంబంధించిన విషయాలను అందరికీ తెలియజేసే వెబ్‌సైట్లను నడుపుతున్నామని ఎక్కువగా చెబుతుంటారు. దీనికి పెద్దగా పెట్టుబడీ అక్కర్లేదు. కేవలం రూ.50 వేల లోపే పెట్టుబడితో ఓ వెబ్‌సైట్‌కు అనుమతి తీసుకుని, డిజైన్‌ చేసుకుని నడపొచ్చు.

వెబ్‌సైట్‌ను పెట్టడం, దాన్ని నడపడం తేలికేగానీ, ఎలా ఆర్జించాలో తెలియాలంటే సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి. పక్కింటి కుర్రోడు సంపాదించేస్తున్నాడు కదా, స్నేహితుడు దూసుకెళ్తున్నాడు కదా? మనమెందుకు చేయకూడదని అనుకోవడంలో తప్పులేదు. దానికి తగ్గ నైపుణ్యాలను సాధన చేయడం ద్వారానే వాళ్లు సాధిస్తున్నారనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.

బ్లాగ్/పోర్టల్/వెబ్‌సైట్/ఛానల్ పెట్టడం సులువే. కానీ, నిర్వహించి, దాన్ని బాగా ప్రమోట్ చేసి ఓ ఆదాయ వనరుగా మార్చడమే కష్టం. దానికి కొంత వరకు సమయం కేటాయించగలిగితే ఆశించిన లక్ష్యాన్ని చేరుకున్నట్లే.

చాలామందికి వెబ్‌సైట్‌లు, వీడియోల ద్వారా ఆదాయం పొందాలని ఉన్నా అసలు ఏం చేయాలి? ఎలా చేయాలనే ప్రాథమిక సమాచారం తెలియక, చెప్పేవాళ్లు లేక ఏళ్ల తరబడి అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంటారు. నైపుణ్యం సంపాదించిన వారు మాత్రం పైపైకి దూసుకెళ్తున్నారు. పట్టణాల్లో యువత వారింటి వద్దే ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని, మిత్రులతో బృందంగా ఏర్పడి వెబ్‌సైట్లతో కంటెంట్‌ని అప్‌డేట్‌ చేస్తూ ఆర్జిస్తున్నారు.

వెబ్‌సైట్‌ పెట్టాలనుకునే వారికి ప్రధానంగా ఎస్‌ఈవోపై పట్టు ఉండాలి. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటూ అప్‌డేట్స్‌ని పసిగట్టే నేర్పుతో నగరాల్లోని యువత వెబ్‌సైట్‌లను సొంతంగా నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నెట్టింట్లో లక్షల్లో నెలవారీ ఆదాయం సంపాదిస్తున్నారు. వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం లాంటి అంశాలపై ఒక్కో బృందం మూడు, నాలుగు సైట్‌లను నడుపుతోంది. ఒకరు కంటెంట్‌ రాయడం, మరొకరు బ్యాక్‌ లింకులు, మరొకరు ఎస్‌ఈవో చేస్తూ కలిసికట్టుగా విజయబావుటా ఎగరేస్తున్నారు.

వెబ్‌సైట్‌ను పెట్టాక దానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఎంత పెరిగితే అంత ఆదాయం వస్తుంది. ఈ సందర్శకుల రాకను పెంచుకునేందుకు ప్రత్యేకంగా సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ చేయాల్సి ఉంటుంది. కచ్చితమైన సమాచారం క్రమం తప్పక ప్రచురిస్తూ ఉండడం, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, జీమెయిల్‌ ద్వారా ఆ సమాచారాన్ని ఎక్కువ మందికి తెలిసేలా చేస్తూ వారు వెబ్‌సైట్‌ను సందర్శించేలా చేయగలగాలి. దీనికి తోడు గూగుల్‌లో ఎక్కువ మంది ఏ సమాచారం కోసం వెతుకుతున్నారనే కీవర్డ్స్‌ ఉంటాయి. దానికి అనుగుణంగా సమాచారం ఇస్తూ ఉంటే సందర్శకులు పెరుగుతారు.

వెబ్‌సైట్లు ఎన్ని రకాలున్నాయి, దేని ద్వారా ఎలా సంపాదించొచ్చనే సమాచారం తెలుసుకోవాలి. మన సైట్‌లోకి ఎక్కువ మంది వచ్చి వెళ్లేలా ఎస్‌ఈవో చేసుకోవాలి, బ్యాక్‌ లింకులు పెట్టాలి, సమాచారం ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉండాలి. వెబ్‌సైట్‌ను కళాత్మకంగా, ఆకర్షణీయంగా డిజైన్‌ చేసుకోవాలి. వీటన్నింటిపైనా పూర్తి పట్టు సాధించగలిగితే చాలు.

ఒక వెబ్‌సైట్‌ను నెలకొల్పాలంటే తొలుత సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో)పై పట్టుండాలి. తర్వాత వెబ్‌సైట్‌ను ఏ పేరుతో పెట్టాలనుకుంటున్నారో ఆ డొమైన్‌ పేరును ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. మనం అనుకున్న పేర్లన్నీ దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాటిని వేరొకరు సొంతం చేసుకుని ఉండొచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఎలా పేర్లను ఎంచుకోవాలి, డాట్‌ కామ్‌, డాట్‌ ఇన్‌, డాట్‌ జీవోవీ, డాట్‌ ఈడీయూ వంటి అనేక ఎక్సటెన్షన్లతో వెబ్‌సైట్ల పేర్లను బుక్‌ చేసుకోవాలి. తర్వాత అంతర్జాలంలో వెబ్‌సైట్‌కు స్థలం (హోస్టింగ్‌ స్పేస్‌)ను తీసుకోవాలి. వెబ్‌ సర్వర్ల గురించి తెలియాలి.

వెబ్‌సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, యూట్యూబ్‌ వీడియోలపై ఆదాయం, ఎస్‌ఈవో లాంటి సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్‌లో వెతికి తెలుసుకోవచ్చు. ప్రాంతీయ భాషల్లోనూ వివరాల్ని అందించే ఆన్‌లైన్‌ సోర్స్‌లు చాలానే ఉన్నాయి. వీడియో పాఠాల్ని చూద్దాం అనుకుంటే యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. తెలుగులో వివరిస్తూ రూపొందించిన యూట్యూబ్‌ పాఠాల్ని వెతికి చూడొచ్చు. మరింతగా నిపుణత్వాన్ని సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవచ్చు.

ఈ శిక్షణ తీసుకునేందుకు హైదరాబాద్‌, ఢిల్లీ లాంటి నగరాలు అనుకూలం. హైదరాబాద్‌లో అనేక పెద్ద సంస్థలు డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈవో, వెబ్‌సైట్లు, గూగుల్‌ యాడ్‌సెన్స్‌ (వెబ్‌సైట్లకు ఆదాయం వచ్చే అనుమతి) పొందడం, హెచ్‌టీఎంఎల్‌, హెచ్‌టీటీపీ, కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, వెబ్‌మాస్టర్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌ వంటివన్నీ నేర్పిస్తున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు వీలుంటుంది.

నేటి యువతరం యూట్యూబ్‌ ఛానళ్లకు రూపకల్పన చేసి, కుప్పలుతెప్పలుగా వీడియోలు, బుల్లి సినిమాలు (షార్ట్‌ఫిల్మ్‌లు), హాస్య సన్నివేశాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో పెడుతున్నారు. వాటిని నెటిజన్లు వీక్షించేలా చేస్తూ వీడియోలపై రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. యూట్యూబ్‌ ఛానల్‌లోని ఈ వీడియోలను ఎంతమంది చూస్తే అంత డబ్బొస్తుంది. లక్ష మంది చూస్తే వంద డాలర్లు (రూ.7,000) చొప్పున ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఆదాయం వస్తుంది.

ఇళ్లన్నీ ‘నెట్టి’ల్లులా మారుతున్న నేపథ్యంలో జనం యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలకూ పట్టం కడుతున్నారు. ఒక్క రోజులో కనీసం పదేసి లక్షల మంది చూసే వీడియోలు వేల సంఖ్యలో ఉంటున్నాయి. చిన్న వీడియోలపైనా భారీగా ఆదాయం వస్తోంది. కొంచెం ఆసక్తిగా, ఆలోచింపజేసేలా, కొత్తదనమున్న వాటికి ఆదరణ బాగుంటోంది. యూట్యూబ్‌ వీడియోలను చూసేటప్పుడు మధ్యలో వచ్చే ప్రకటనల (యాడ్స్‌) ద్వారా ఈ ఆదాయం సమకూరుతుంది. వీడియోలకు సైతం ప్రత్యేకంగా ఎస్‌ఈవో చేస్తూ ముందువరుసలో వచ్చేలా చేసుకోవచ్చు. దీనికి అవసరమైన సమాచారాన్ని అంతర్జాలం లేదంటే శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు.

గతంలో గూగుల్‌ యాడ్‌సెన్స్‌ (వెబ్‌సైట్లకు యాడ్స్‌)ను ఆంగ్లంలో ఉన్న వెబ్‌సైట్లకు మాత్రమే ఇస్తుండేది. దీంతో ఆదాయం పొందాలనుకునేవారు ఆంగ్లంలో సమాచారం పొందుపరచాల్సి ఉండేది. క్రమంగా ఈ మధ్య గూగుల్ తన యాడ్‌సెన్స్ సేవల్ని ప్రాంతీయ భాషల వెబ్‌సైట్లకూ విస్తరించడంతో మన మాతృభాషలోనే కంటెంట్ పెట్టుకునే వెసులుబాటు లభించింది.

వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రధానంగా గూగుల్‌ యాడ్‌సెన్స్‌పై అవగాహన ఉండాలి. వెబ్‌సైట్‌ ఏర్పాటుచేసిన తర్వాత గూగుల్‌ నుంచి ఆమోదం పొంది యాడ్స్‌ ద్వారా ఆదాయం పొందాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. దీని కోసం గూగుల్‌ కొన్ని నిబంధనలను విధించింది. వెబ్‌సైట్‌లో పెట్టే ఏ సమాచారమైనా కొత్తగా, సొంతంగా రాసిందై ఉండాలి. కాపీ కొట్టి తెచ్చి పెట్టింది కాకూడదు. తప్పులు లేకుండా నాణ్యమైన భాషలో సమాచారం పొందుపరచాలి.

వీటన్నింటిపైనా గూగుల్‌ నిఘా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. చాలామందికి అవగాహన లేక వెబ్‌సైట్‌ను పెట్టేసి సమాచారం కాపీ కొట్టి పేస్ట్‌ కొట్టేస్తే డబ్బులొచ్చేస్తాయని అపోహ పడుతుంటారు. యూట్యూబ్‌లో పెట్టే వీడియోల విషయంలోనూ అంతే సొంతంగా చిత్రీకరించిన వాటికే ఆదాయం వస్తుంది. సంగీతాన్నీ సొంతంగానే సమకూర్చుకుని పెట్టాలి. సినిమాల్లోని పాటలు, మాటలు పెట్టినా రూపాయి కూడా రాదు. ఆ వీడియో ఎంత బాగున్నా, ఎన్ని లక్షల మంది వీక్షించినా. ప్రయోజనం ఉండదు. కాపీ కంటెంట్‌ చట్టం కింద దానికి డబ్బివ్వరు.

ప్రస్తుతం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ట్యూన్స్‌ను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో ఉచితంగా ఉంచుతున్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని వాడుకునేందుకు ఆ సంస్థలు అనుమతిస్తాయి. ఇలాంటి గూగుల్‌ యాడ్‌సెన్స్‌ నిబంధనలన్నింటిపైనా తొలుత పక్కాగా నైపుణ్యం పొందాకే వెబ్‌సైట్‌ పనిని ప్రారంభించడం ఉత్తమం.

ప్రస్తుతం ప్రతి వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఓ యాప్‌ను సృష్టిస్తున్నారు. ఈ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచి అవసరమైన వారు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకసారి యాప్‌ను ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన తాజా సమాచారమంతా ఎప్పటికప్పుడు వారికి వచ్చేస్తుంటుంది. దానివల్ల వారు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తుంటారు. ఇలా సందర్శకుల సంఖ్య పెరిగి ఆదాయం భారీగా వస్తోంది.

అందుకే ప్రస్తుతం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయగానే దానికి అనుబంధంగా ఓ యాప్‌నూ సృష్టిస్తున్నారు. నిరుద్యోగులు ఎక్కువగా ఉద్యోగ వెబ్‌సైట్లకు సంబంధించిన యాప్‌లను తమ ఫోన్‌లలో స్టోర్‌ చేసుకుంటున్నారు. దీనివల్ల ఉద్యోగ ప్రకటన రాగానే వారికి సందేశం వెళ్తుంది. మరికొందరు సినిమా వార్తల యాప్‌లు, సాధారణ వార్తల యాప్‌లను మొబైల్ ఫోన్లలో స్టోర్‌ చేసుకుంటున్నారు.

వెబ్‌సైట్లను నెలకొల్పేందుకు ఉన్నత చదువు, వయసుతో సంబంధం లేదు. పదో తరగతి వరకే చదివి సాంకేతికంగా నైపుణ్యమున్న ఎంతోమంది యువతరం నేడు రూ.లక్షల్లో సంపాదిస్తోంది. ఆంగ్లంపై మాత్రం కొంత ప్రావీణ్యం ఉండాలి. తమకు తెలిసిన ఓ భాష, సబ్జెక్టు, సినిమా పరిజ్ఞానం, సాంకేతిక సమాచారం, వైద్యం. ఇలా ఏదైనా కావొచ్చు. సమాజ అవసరాలకు తగిన అంశాలతో కూడిన వెబ్‌సైట్‌ పెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందికి తెలిసేలా చేయొచ్చు. ఇంటిదగ్గరే కూర్చుని ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకూ దోహదపడుతుంది.

సమాచారం కచ్చితమైన, నమ్మశక్యమైనది ఇస్తే ఆ వెబ్‌సైట్‌కు నానాటికీ ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం వెబ్‌సైట్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారిలో విశ్రాంత ఉద్యోగులూ ఎక్కువ మందే ఉన్నారు. ఇంటి దగ్గరే కూర్చుని చేసుకునే పని కావడంతో వీరికి అనుకూలంగా ఉంటోంది.

ఔత్సాహికులు ఆసక్తి ఉన్న అంశాన్ని ముందుగా ఎంచుకోవాలి. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికేది సమాచారం (కంటెంట్‌) కోసమే. వెబ్‌సైట్‌ ప్రారంభించి మనకు ఆసక్తి ఉన్న అంశాలపై సమాచారాన్ని పొందుపర్చి ఎక్కువ మందికి చేరువైతే ఆదాయాన్ని పొందవచ్చు. వ్యాపకంగానూ, ఉద్యోగం చేస్తూనూ చేయవచ్చు.

ఆరోగ్యం, వ్యాయామం, వ్యాపారం ఇలా వేర్వేరు అంశాలపై రాయడమే కాదు ఫేస్‌బుక్‌, వాట్సాప్, ట్విటర్ ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది చూసేలా చేసుకోవాలి. నచ్చిన విషయాలు ఉంటే ఒకరి నుంచి మరొకరికి అలా వ్యాప్తి చెందుతుంటాయి. మన వెబ్‌సైట్‌ ఎక్కువ మంది చూస్తున్నారంటే గూగుల్‌ మన సైట్‌లో ప్రకటనలను (యాడ్స్‌) పోస్టు చేస్తుంది. ప్రైవేటు ప్రకటనలూ వస్తాయి. అలా ఆదాయం మొదలవుతుంది. ఇందుకు ఆరేడు నెలలు పడుతుంది. అంత ఓపిక ఉండాలి. సాంకేతిక అంశాలపై పట్టు ఉంటే బాగా రాణించవచ్చు. ఎవరిపై ఆధారపడకుండానే సొంతంగా నిర్వహించుకోవచ్చు.

డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వీడియోలు వంటి రంగాల్లో విదేశీయులతో పోల్చుకుంటే మనం పది శాతాన్ని ఆర్జించలేకపోతున్నాం. వాళ్లు ఇంట్లో కూర్చునే రూ.కోట్లను ఆర్జిస్తున్నారు. ఒక్క యూట్యూబ్‌ వీడియోతోనే బాగా సంపాదించిన వారున్నారు. నెలవారీ ఒక్కో వెబ్‌సైట్‌తోనే రూ.50 కోట్ల వరకూ సంపాదించే విదేశీ యువత ఎందరో ఉన్నారు. మన యువతరం ఇప్పుడిప్పుడే ఈ రంగంపై దృష్టి పెడుతోంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా గూగుల్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ అండ్‌ డిజిటల్‌ స్టడీస్‌ (ఐఐపీడీఎస్‌) పేరుతో యువతకు దేశవ్యాప్తంగా అవగాహన పెంచుతున్నాం. శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ అనలిటిక్స్‌ ధ్రువపత్రాలను అందజేయనున్నాం. డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌సైట్‌ ప్లానింగ్‌, ఎస్‌ఈవో, గూగుల్‌యాడ్‌వర్డ్స్‌, పీపీసీ, ఈ కామర్స్‌, కంటెంట్‌, మొబైల్‌ వెబ్‌, యూట్యూబ్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ రెపిటేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రీలాన్సర్‌గా ఎలా సంపాదించొచ్చు వంటి అన్ని అంశాలూ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.

పలు వెబ్‌సైట్లు నిర్వహిస్తూ గూగుల్‌ యాడ్‌సెన్స్‌ ద్వారా పదేళ్ల నుంచి హైదరాబాద్‌కు చెందిన సురేందర్‌ వర్మ ఆదాయం పొందుతున్నారు. ‘బాహుబలి’ విడుదల సమయంలో చాలామంది ఆన్‌లైన్‌లో ముందే టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపించారు. అప్పుడెవరైనా ‘బాహుబలి’ పేరుతో గూగుల్‌లో వెతికితే ఆయన రూపొందించిన కీవర్డ్‌ ‘బైబాహుబలిఆన్‌లైన్‌’ గూగుల్‌లో ముందు వరసలో వచ్చేలా చేసుకున్నారు.

దీనిపై క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయించే వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యేది. కీవర్డ్‌ ఆయన సొంతంగా క్రియేట్‌ చేసింది కావడంతో క్లిక్స్‌ను బట్టి కేవలం వారం రోజుల్లోనే దాదాపు 750 డాలర్ల ఆదాయం సురేందర్‌ వర్మకు వచ్చాయి. అయితే, ఈ తరహా కీవర్డ్స్‌ కోసం ముందే సెర్చ్‌ ఇంజిన్‌ అప్టిమైజేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సొంతంగా వెబ్‌సైట్‌ ఉంటే దాన్ని వంద మంది చూస్తున్నట్లయితే గూగుల్‌ యాడ్‌సెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌కు వీక్షకులు ఉన్నారని గూగుల్‌ గుర్తిస్తే కోడ్‌ ఇస్తారు. ప్రస్తుతం వెబ్‌సైటే కాదు మొబైల్‌, యాప్స్‌ వేర్వేరు మాధ్యమాలు రావడంతో రెస్పాన్స్‌ కోడ్‌ ఇస్తున్నారు. ప్రకటనలు చూసేవారు, క్లిక్‌ చేసేవారు ఉంటారు. క్లిక్స్‌కు ఎక్కువ డబ్బొస్తుంది.
యు.ఎస్‌. నుంచి క్లిక్స్‌ ఎక్కువ ఉంటే ఎక్కువ మొత్తం వస్తుంది. తర్వాత యూరోప్‌ ఆ తర్వాత ఆసియా దేశాలు ఉంటాయి. వీటిలోనూ విద్య ఆరోగ్యపరమైన కంటెంట్‌కు ఎక్కువ డిమాండ్‌. యూట్యూబ్‌లోనూ లఘు వీడియోలు పోస్టు చేస్తూ వీక్షకులను బట్టి ఆదాయం వస్తుంది. నిర్వాహకులే ఎక్కువ క్లిక్స్‌ చేస్తున్నారని తెలిస్తే వాటిని నిలిపేసే (బ్లాక్‌) ప్రమాదమూ ఉంది. సైట్‌ నిర్వహణకు ఆంగ్లం మీద పట్టుండాలి.

ఇక, యూట్యూబ్‌నే వేదికగా చేసుకుని వర్ధమాన ఫిల్మ్‌మేకర్‌, డ్రీమ్‌మర్చంట్స్‌ యమున కిషోర్‌ కూడా బాగానే ఆర్జిస్తున్నారు. యూట్యూబ్‌తో వ్యాపారం పెరిగింది. తాము ప్రకటనలు, కార్పొరేట్‌ యాడ్స్‌ చేస్తుంటామని, ఇంటర్నెట్‌ వేదికపై డిజిటల్‌ మార్కెటింగ్‌కి బాగా ప్రాచుర్యం పెరగడంతో తమ పని సులువయిందని చెప్పుకొచ్చారు.

తాము చేసిన చిత్రాలన్నీ యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటామని, వాటిని చూసి కొత్తగా ప్రకటనలు చేయాల్సిందిగా కోరుతున్నారని, నేరుగా యూట్యూబ్‌ ద్వారా ఆదాయం పొందడం లేదు కానీ తమ వ్యాపారం విస్తరించడానికి యూట్యూబే పరోక్షంగా కారణమని చెప్పారు.

ఇక, ఆకర్షణీయమైన హంగులతో సొంత న్యూస్ పోర్టల్/బ్లాగ్/వెబ్‌సైట్/ఛానల్ ఏర్పాటుచేసి, నామమాత్రపు చార్జీలతోనే వాటిని నిర్వహించే సంస్థలు అనేకం ఉన్నాయి. జర్నలిజంలో ప్రస్తుతం అతి కీలకంగా మారిన వెబ్ జర్నలిజంలో అడుగుపెట్టి ఆర్జించాలనుకునే వారికి, ప్రింట్ మీడియాలో కోల్పోయిన ఆదాయాన్ని ఆన్‌లైన్ యాడ్స్ రూపంలో పొందాలనుకునే వారికీ ఈ రంగం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

మీ న్యూస్ పోర్టల్/బ్లాగ్/వెబ్‌సైట్/ఛానల్‌ కోసం గూగుల్ యాడ్‌సెన్స్‌ అనుమతులు పొందేందుకు నేరుగా ఈ లింక్‌ను క్లిక్ చేయవచ్చు. (https://www.google.com/intl/en_in/adsense/start)

ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఎలా సంపాదించవచ్చన్నదానిపై కొంత అవగాహన కోసం ఈ లింక్‌ను సందర్శించవచ్చు. https://youtu.be/YT9AoL_XyUc

ఇది మరో లింక్… https://youtu.be/swG6q11qB-M