ఏపీలో పెరుగుతున్న డెంగీ మరణాలు

0
6 వీక్షకులు

అమరావతి, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఏపీలో డెంగీ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చూస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణతో పోటీ పడి మరణాల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఉన్నట్టున్నారు పాలక పార్టీ పెద్దలు. డెంగీ బారినపడి మృత్యు ఒడి చేరుతున్న వారిలో డాక్టర్లు సైతం ఉండటం సమస్య తీవ్రతకు అడ్డం పడుతోంది.

విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వందన (50) డెంగీతో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందారు. అలాగే, డెంగీ జ్వరంతో గుంటూరు నగరానికి చెందిన యూరాలజిస్ట్‌, ఐఎంఏ నగర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య 20 రోజుల క్రితం మృతి చెందారు.

కర్నూల్ జిల్లా డోన్ మండల పరిధిలోని కామగాని కుంట్ల గ్రామంలో డెంగ్యూ విషజ్వరంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో కావ్య అనే పెళ్లికూతురు మరణించింది. పెళ్లి కూతురిని చేసే క్రమంలో నలుగు పెడుతుండగా స్పృహ తప్పి పడిపోయిన ఆమెకు చికిత్స అందిస్తుండగా మరణించింది.

ఇవి వార్తల్లోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. బయటకు రాని మరణాలు ఇంకెన్నో! అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఇప్పటికైనా ఈ మహమ్మారి మరణాలపై ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా దృష్టిపెట్టకపోతే, ఇంకెంత మంది బాధితుల జాబితాలో చేరుతారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.