నేటి నుంచి భార‌త్‌-విండీస్‌ వన్డే సమరం

1812

గయానా, ఆగస్టు 8 (న్యూస్‌టైమ్): వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో గురువారం నుండి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లోనూ సత్తా చాటాలని యువ ఆటగాళ్లు ఉర్రూతలూగుతున్నారు. సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే నేడు గయానాలోని ప్రొవిడెన్సీ స్టేడియంలో జరగనుంది. ఇక్కడే మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

టీ20 సిరీస్‌లో అంతగా ఆకట్టుకోని శిఖర్‌ ధావన్‌ వన్డేల్లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ నాల్గో స్థానంలో బరిలోకి దిగే అవకాశముంది. రోహిత్‌-ధావన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే మూడోస్థానంలో విరాట్‌ బ్యాటింగ్‌కు రానున్నాడు. శిఖర్‌ ధావన్‌ 130 వన్డేల్లో 17 సెంచరీలను నమోదు చేశాడు. ప్రపంచకప్‌ టోర్నీలో ఆసీస్‌పై సెంచరీ చేసి ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌తో కరేబియన్‌ పర్యటనలో వన్డేల్లో సత్తా చాటి ఓపెనర్‌ స్థానం సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ధావన్‌కు ఎంతైనా ఉంది.

ఇక కెఎల్‌ రాహుల్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడంతో కేదర్‌ జాదవ్‌ ఐదోస్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. రిఫబ్‌ పంత్‌, మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లు మిడిలార్డర్‌లో కొనసాగనున్నారు. ధోని తర్వాత వారసునిగా చెప్పుకొనే రిషబ్‌ పంత్‌ ఈ సిరీస్‌లో తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో అజేయంగా 65 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో వన్డేల్లోనూ తన ప్రతిభకు సాన పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రోహిత్‌ శర్మ అయితే ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు సెంచరీలతోపాటు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ నిలిచి రికార్డు సృష్టించాడు. రోహిత్‌ క్రీజ్‌లో కుదురుకుంటే భారీస్కోర్‌ నమోదు చేయడం ఖాయం. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అయితే ఆఖరి టీ20లో అర్ధసెంచరీ చేసినా వన్డేల్లో సెంచరీ బాది చానాళ్లయ్యింది. ఈ నేపథ్యంలో మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి అవసరం ఎంతైనా ఉంది.