పెద్ద సంఖ్యలో పరీక్షలతో తగ్గిన పాజిటివ్ కేసులు..

న్యూఢిల్లీ, నవంబర్ 22 (న్యూస్‌టైమ్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించటంకలో భారత్ మరో మైలురాయి దాటింది. మరిన్ని పరీక్షలు జరపాలన్న తన వ్యూహానికి అనుగుణంగా రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు జరుపుతూ వస్తోంది. గడిచిన 24 గంటలలో 10,66, 022 పరీక్షలు జరిగాయి. ఈ మొత్తం పరీక్షల సంఖ్య నేటికి 13,06,57,808 కి చేరటంతో 13 కోట్ల మైలురాయి దాటినట్టయింది. ఆఖరి కోటి పరీక్షలు కేవలం పది రోజులలోనే జరగటం విశేషం. ఇలా రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు జరపటం వలన మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ కనీస స్థాయిలో సాగుతోంది. జాతీయ స్థాయిలో పాజిటివ్ కేసుల శాతం ఈ రోజుకు 6.93% కు చేరింది.

నిన్నటి కేసులలో పాజిటివ్ శాతం 4.34% లోపే నమోదైంది. ఇది ఎక్కువ పరీక్షలవలన జరిగింది. గత 24 గంటలలో 46,232 మంది కోవిడ్ పాజిటివ్‌గా నమోదు కాగా పాజిటివ్ శాతం 4.34%, అమెరికన్, యూరోపియన్ దేశాలలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉండగా భారత్‌లో అలాంటి పరిస్థితులు లేకపోవటం విశేషం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నట్టు తెలియటంతో అన్ని రాష్ట్రాలూ పరీక్షల సంఖ్య పెంచాలని కేంద్రం సూచించింది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల మందిలో దేశ సగటు కంటే ఎక్కువగా పరీక్షలు జరిగాయి. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువగా పరీక్షలు జరుగుతున్నాయి.

అందుకే ఆ రాష్ట్రాలలో పరీక్షలు పెంచాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. భారత్‌లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4,39,747 కాగా, ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.86%. ఆ విధంగా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్యను 5% లోపే ఉంచగలుగుతున్నారు. దేశంలో గత 24 గంటలలో మొత్తం 49,715 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 84,78,124కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 93.67%కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 80,38,377కి చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 78.19% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉండగా 8,775 మందితో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 6,945 మంది, కేరళలో 6,398 మంది కోలుకోగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా పాజిటివ్‌గా నమోదైన కేసులలో 77.69 పది రాష్ట్రాలనుంచే వచ్చ్చాయి. వాటిలో అత్యధికంగా 6,608 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.

6,028 కొత్త కేసులతో కేరళ రెండో స్థానంలోను, 5,640 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలోను ఉన్నాయి. గత 24 గంటలలో 564 మంది చనిపోగా వారిలో 82.62% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 27.48% (155) తాజా మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీలో 118 (20.92%) మరణాలు నమోదయ్యాయి.