సమాచార చోరశిఖామణులు!

1112

కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ భారతావణితోనే చర్చనీయాంశంగా మారిన ‘ఐటీ గ్రిడ్స్’ కేసులో ఎవరు దోషులో తేలకముందే రాజకీయ వర్గాలలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అక్కడి అధికార తెలుగుదేశం ప్రభుత్వం చౌర్యం చేసిందన్నది విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఇదే విషయంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పోలీసు కేసు కూడా నమోదైంది. చంద్రబాబునాయుడే లక్ష్యంగా తెరాసతో కలిసి వైఎస్సార్‌సీపీ దొడ్డిదారి రాజకీయాలకు పాల్పడుతోందన్నది తెదేపా వర్గాల విమర్శ.

కేసు దర్యాప్తు పూర్తయితే, ఎలాంటి విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తాయో తెలియదు గానీ, ఓట్ల తొలగింపు కేంద్ర బిందువుగా తెలుగు రాష్ట్రాలలో తాజా రాజకీయ విమర్శనాస్త్రాలను నాయకులు సంధించుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన డేటాను చౌర్యం చేసి చివరికి తమమీదే కేసులు నమోదుచేయడం ఏమిటంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విపక్ష వైకాపా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు, వైఎస్ జగన్ తను బోగస్ ఓట్ల తొలగింపునకు మాత్రమే పార్టీ తరపున ఫారం-7 ఇచ్చానంటూ ప్రకటించుకుంటున్నారు.

ఇదంతా చూస్తుంటే సరిగ్గా ఏడాది కిందట (మార్చి 2018) కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే కంపెనీ వార్తల్లోకెక్కిన విషయం గుర్తుకువస్తోంది. ప్రజల వ్యక్తిగత వివరాలు (డాటా) సేకరించి, దాన్ని రాజకీయ పార్టీలకు అమ్ముకుందని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల్లో గెలువడానికి పార్టీలు, నాయకులు ఈ కంపెనీకి భారీగా డబ్బు ముట్టజెప్పి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొనుగోలు చేశారని, తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందారని బయటికి పొక్కింది. సదరు కంపెనీ ఫేస్‌బుక్ వినియోగదారుల ఊరు-పేరు, కులం-గోత్రం, ఏం చేసేది, ఎక్కడుండేది, ఏది ఇష్టం, ఎందుకిష్టం, ఆఖరికి వారి సోషియో-ఎకనామిక్ (సామాజిక-ఆర్థిక) స్థితిగతులన్నీ సేకరించింది. ఇది ఫేస్‌బుక్‌కు తెలిసే జరగడం మరో పెద్ద ఆశ్చర్యకర విషయం. ఎక్కడో లండన్‌లో ఉండే ఈ కంపెనీ చేసింది అక్షరాలా డాటా దొంగతనం.

అందుకు పరోక్షంగా సహకరించింది ఫేస్‌బుక్. దాని ద్వారా లాభపడింది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన టెడ్ క్రూజ్, యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చే (బ్రెగ్జిట్) అంశం, మెక్సికో సార్వత్రిక ఎన్నికలు, ఇలా అనేకమంది ప్రపంచస్థాయి నేతలు, ప్రభుత్వాలు, సంస్థలు ఈ డాటా కుంభకోణం ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకెర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ చేపట్టిన విచారణకు హాజరై, డాటా దొంగతనం నిజమేనని, వ్యక్తిగత సమాచారం సేకరించడం, అనుమతి లేకుండా వాడుకోవడం నేరమేనని అంగీకరించాడు. ఈ దెబ్బతో స్టాక్‌ మార్కెట్‌లో ఫేస్‌బుక్ షేర్ల విలువ ఒక్కసారి కుదేలైంది.

కొన్ని వేల కోట్ల జరిమానా కట్టాల్సిందిగా దానికి తాఖీదులు అందాయి. దీంతో కేంబ్రిడ్జ్ అనాలిటికా మూతపడింది. ఆ కేసు మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకెన్ని పెద్ద తలకాయలు రాలిపోతాయో, ఎన్ని ప్రభుత్వాలు కూలిపోతాయో తెలియదు. ఇక రెండు మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, నడుస్తున్న మాటల యుద్ధాన్ని గమనిస్తే అచ్చం కేంబ్రిడ్జ్ అనాలిటికా తరహాలోనే ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ వ్యవహరించింది.

కాకపోతే ఒక అడుగు ముందుకేసి డాటాను ఏ ఫేస్‌బుక్ లాంటి ప్రైవేట్ సంస్థ నుంచో కాకుండా ఏకంగా ప్రభుత్వం నుంచి, అదీ ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో సేకరించింది. తెలుగుదేశం పార్టీకి అనధికార అనుబంధ సంఘంగా వ్యవహరిస్తున్న ఆ ఐటీ కంపెనీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో అనుకూల ఓట్లు సంపాదించి పెట్టి, వ్యతిరేక ఓట్లు తగ్గించి, కుదిరితే ప్రతిపక్ష ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాలో లేకుండా చేసే గొప్ప బాధ్యత మీదేసుకుంది. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారి వ్యక్తిగత వివరాలు ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీకి అప్పగించడం ఒక నేరమైతే, ఆ వివరాల ఆధారంగా వారిని పొలిటికల్ సెగ్మెంటేషన్ కోసం వాడుకోవడం ఇంకో నేరం.

ఇదంతా ఒకెత్తయితే ఆ వివరాలు (డాటా) తమ సొంత ఆస్తి అన్నట్టు వ్యవహరించడం చంద్రబాబుకు, అతని పుత్రరత్నం లోకేశ్‌కే చెల్లింది. అదేదో తాము అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్మన్నట్టు, ఇంకెవరో దాన్ని ఎత్తుకెళ్లినట్లు గగ్గోలు పెడుతున్నారు. జరిగింది దొంగతనమని, అది తమ అనుంగ సంస్థే చేసిందని, టీడీపీకి ఎన్నికల్లో పనికొచ్చేవిధంగా ఆ డాటాను ఉపయోగించుకుంటున్నారని, ఇదొక పెద్ద నేరమని ఇంటర్నెట్ వాడకం మీద కనీస అవగాహన ఉన్న అందరికీ తెలుసు. ఈ దొంగతనం బయటపడగానే తమకు బాగా తెలిసిన ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగించారు చంద్రబాబు.

ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత వివరాలు ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన విషయాన్ని పక్కనబెట్టి, తెలుగుదేశం పార్టీని ఓడించే కుట్ర జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఐటీ కంపెనీల మీద, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, ఓట్లను తొలిగిస్తున్నారని ప్రభుత యంత్రాంగం మీద చంద్రబాబు, లోకేశ్‌ అబద్ధపు ప్రచారాలకు తెరలేపుతున్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో ఆరితేరిన చంద్రబాబు ప్రభుత్వ సమాచారాన్ని, రహస్య నిర్ణయాలను తనకు, తన సొంత సామాజిక వర్గానికి, తన పార్టీకి కొమ్ముకాసే వ్యాపారవేత్తలకు అనుకూలంగా వాడుకోవడం ఇది మొదటిసారి కాదు. ఐటీ రంగం ఎదుగుదలను హైటెక్ సిటీ నిర్మాణం పేరుతో సొంతవాళ్లకు ముందస్తు సమాచారం అందించి వేల ఎకరాల విలువైన భూమిని వారికి కారుచౌకగా అంటగట్టిన సంగతి జగద్విదితం. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త రాజధాని నిర్మాణాన్ని, దాని సమాచారాన్ని వాడుకొని ఏకంగా ప్రభుత్వాన్నే ఒక రియలెస్టేట్ కంపెనీగా మార్చి ప్రజలను ఎలా ఏమారుస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు అదే ఇన్‌సైడర్ ట్రేడింగ్ తెలివితేటలు ప్రజల వ్యక్తిగత వివరాలు రహస్యంగా సొంత పార్టీకి వాడుకోవడానికి ప్రదర్శిస్తున్నారు. కానీ ఇదంతా ఎల్లకాలం కుదరదు. కోట్లమంది సమాచారాన్ని గోప్యంగా ఉంచకపోతే సైబర్ చట్టాలు చూస్తూ ఊరుకోవు. గోప్యత పాటించని సంస్థలైనా, ప్రభుత్వాలై నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే డాటా ఎవరి బాబు సొత్తుకాదు, దానికి చంద్రబాబు కూడా అతీతుడు కాదు. మరోవైపు, ఓటుకు నోటు కేసులో దర్యాప్తు నెమ్మదించిందన్న అపవాదును చెరిపేసుకునే రీతిలో తెలంగాణ సర్కార్ సమాచార చౌర్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది.

దీని కోసం స్టీఫెన్ రవీంద్ర నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటుచేసింది. ఇంకోవైపు, ఏపీ సర్కారు కూడా తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు అన్నట్లు స్వరాష్ట్రంలో ఈ కేసు దర్యాప్తునకు వేరుగా సిట్ ఏర్పాటుచేసింది. మొత్తానికి రెండు రాష్ట్రాల పోలీసుల దర్యాప్తుల మధ్య ఎన్నికల అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫారం-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లను తొలగించినట్లు కాదని ఎన్నికల అధికారులు స్పష్టంచేస్తున్నా విమర్శల దాడులు మాత్రం ఆగడం లేదు.