న్యూఢిల్లీ, జనవరి 18 (న్యూస్‌టైమ్): భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగానికి (డి.ఎస్.టి) చెందిన స్వయంప్రతిపత్త సంస్థ అయిన భారత జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) అభివృద్ధి చేసిన ఇన్నోవేషన్ పోర్టల్‌ను, కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు న్యూఢిల్లీలో దేశానికి, అంకితం చేశారు.

నేషనల్ ఇన్నోవేషన్ పోర్టల్ (ఎన్.‌ఐ.పి)లో ప్రస్తతం, ఇంజనీరింగ్, వ్యవసాయం, పశు సంవర్ధక, మానవ ఆరోగ్యం వంటి వివిధ రంగాలలో, దేశంలోని సాధారణ ప్రజల నుండి సేకరించిన సుమారు 1.15 లక్షల ఆవిష్కరణలు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ పోర్టల్‌లో ఇంధనం, యాంత్రిక, ఆటోమొబైల్, విద్యుత్తు, ఎలెక్ట్రానిక్సు, గృహ ఉపకరణాలు, రసాయన, సివిల్, వస్త్రాలు, వ్యవసాయం, సాగు పద్ధతులు, నిల్వ పద్ధతులు, వివిధ రకాల పరిశ్రమల, పారిశ్రామిక భద్రతా, కోళ్ళ పరిశ్రమ, ఇతర జీవాల యాజమాన్యం, పౌష్టికాహారం మొదలైన రంగాలకు చెందిన అనేక ఆవిష్కరణలు ఉన్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, ఆవిష్కరణల ఉద్యమాన్ని ప్రేరేపించి, గత 6 సంవత్సరాలలో దేశంలో ఆవిష్కరణలకు అనుకూలమైన ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు. సృజనాత్మక సామర్థ్యంతో పాటు, వినూత్న శాస్త్ర, సాంకేతిక ఆధారిత పరిష్కారాల ద్వారా సమస్యలను, సవాళ్లను అధిగమించిన స్వావలంబన పౌరులను ఆయన అభినందించారు. సాంప్రదాయ పరిజ్ఞానానికి పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుండి వచ్చిన మూలికా పద్ధతుల గురించి, మంత్రి నొక్కి చెప్పారు. ఇన్నోవేషన్ పోర్టల్ కీలక ముఖ్యాంశాలలో ఇది ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఇన్నోవేషన్ పోర్టల్ స్థానిక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనే దిశగా, సాధారణ ప్రజల నూతన ఆలోచనలను సంస్థాగతీకరించడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

‘‘ఆలోచనలతో కూడిన ఆర్ధిక వ్యవస్థ – ఉత్తమ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఆవిష్కరణలతో కూడిన సహ-సమర్థత కూడా దేశ పురోగతికి చాలా ముఖ్యమైనది.’’ అని, డాక్టర్ హర్ష వర్ధన్ నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఇదే, దేశ పురోగతిని నడిపించే ఆలోచన అవుతుందని కూడా, అయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ పోర్టల్ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుందనీ, వారి ఆలోచనలు, ఆవిష్కరణలను వ్యవస్థాపకతగా మార్చగల వారందరి వెనుక సంస్థలు నిలబడతాయని ఆయన ఉద్ఘాటించారు.

గ్రామీణ, గిరిజన లేదా అధికారిక విజ్ఞాన నేపథ్యం ఉన్న ఎవరైనా వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ఆవిష్కరణ కోరిక ఉన్న ఎవరైనా, అతను లేదా ఆమె ఆలోచనలను అభివృద్ధి చేయాలనీ, దేశంలోని స్టాండ్-అప్ స్టార్ట్-అప్ వ్యవస్థను ప్రోత్సహించాలని, ఆయన కోరారు. 2020 సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా గడిచిందనీ, అయితే, మన దేశం యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలు ఎంతో అభివృద్ధి చెంది, మనందరికీ సహాయపడ్డాయనీ ఆయన అన్నారు.

రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ పోర్టల్ ఇప్పటివరకు మన డిజిటల్ పురోగతిలో ఒక ముఖ్యమైన సంఘటనగా పేర్కొనవచ్చు. అదేవిధంగా, ఇది, ఆవిష్కరణల పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు, వారి పరిణామానికి అధికారంలో ఉన్నవారికి మధ్య వారధిగా కూడా పనిచేస్తుంది. ఇన్నోవేషన్ పోర్టల్ ప్రయోజనాన్ని పొందడంతో పాటు, ఆసక్తి ఆవిష్కరణలను అన్వేషించాలని – విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎమ్.ఎస్.ఎమ్.ఈలు, వివిధ వృత్తులలో నిమగ్నమైన సాధారణ ప్రజలను ఆయన కోరారు. సాధారణ ప్రజల నుండి వ్యక్తమవుతున్న అసాధారణమైన నిబద్ధతపై, డాక్టర్ హర్ష వర్ధన్, తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అదేవిధంగా, ఇది దేశ సాంకేతిక నాయకత్వాన్ని నడిపిస్తుందనీ, భవిష్యత్తులో ఇది మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందనీ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇన్నోవేషన్ పోర్టల్ ప్రారంభంలోనే, 1.15 లక్షల ఆవిష్కరణలు రావడానికి ఎన్.‌ఐ.ఎఫ్; డి.ఎస్.‌టి. చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. డి.ఎస్.‌టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన, 5వ భారత జాతీయ ఎస్.టి.ఐ. విధానం పరిణామం చెందుతున్న సమయంలో, ఈ ఆవిష్కరణ పోర్టల్‌ను ప్రారంభించడం జరిగిందని, తెలియజేశారు.

ఇన్నోవేషన్ పోర్టల్‌‌కు భవిష్యత్తులో సహకరించేవారు, ఈ పాలసీలోని అంశాలకు అనుగుణంగా ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారుమూల ప్రాంతాలలో, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, ద్వీపాలు, గిరిజన ప్రాంతాలలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యమని, ఆయన వివరించారు. ఆలోచనల కోసం అన్వేషించడంతో పాటు, వాటిని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో, ఎన్.‌ఐ.ఎఫ్. నిమగ్నమై ఉందని, ప్రొఫెసర్ అశుతోష్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి ఆలోచనల నుండి, స్థానిక పారిశ్రామికవేత్తలను సృష్టించడంతో పాటు, వారి ఆలోచనలను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇన్నోవేషన్ పోర్టల్ సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఇన్నోవేషన్ పోర్టల్ అనేది అవసరాలకు తగినట్లుగా తన సొంత పరిష్కారాలను రూపొందించుకోవాలని విశ్వసించే, ప్రతి భారతీయుడి సంకల్పం ప్రతిభకు ప్రతిబింబమని, ఎన్.ఐ.ఎఫ్. చైర్‌పర్సన్ డాక్టర్ పి.ఎస్.గోయెల్ అభివర్ణించారు. వాణిజ్యీకరణకు అనువుగా ఉత్పత్తులను అభివృద్ధి చేసే దృష్టితో ఈ పోర్టల్‌ను సందర్శించాలని ఆయన పారిశ్రామిక వర్గాలను కోరారు. ఇన్నోవేషన్స్ పోర్టల్ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, ఎన్.ఐ.ఎఫ్. డైరెక్టర్ డాక్టర్ విపిన్ కుమార్, వందన సమర్పణ చేశారు. ఇన్నోవేషన్ పోర్టల్ స్వావలంబన భారతదేశం సాధన దిశగా ఒక ముందడుగు. విద్యార్థులు, వ్యవస్థాపకులు, ఎమ్.ఎస్.ఎమ్.ఈలు, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు (టి.బి.ఐ)తో పాటు, వివిధ వృత్తులలో నిమగ్నమైన సామాన్య ప్రజలకు ఇది ఒక అద్భుతమైన వనరుగా ఉపయోగపడుతుంది.