పల్లెపల్లెనా ధాన్యపురాశులే!

0
10 వీక్షకులు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు

  • కేంద్రాలను పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి

మెదక్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): కరోనా విపత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో పంటల కొనుగోళ్లు చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని, కరోనా విపత్తులోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రం మెదక్ సహా కొల్చారం మండలాలలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘణపూర్, అంబోజిపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు, క్యాబ్ డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 వేల కోట్లు సమకూర్చిపెట్టడం అనేది సాహసోపేత చర్యగా పేర్కొన్నారు. ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, గత ఆరేళ్లలో కేసీఆర్ ప్రణాళికాబద్దంగా చిత్తశుద్దితో ప్రాజెక్టులు పూర్తి చేయడంతో తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు. దేశానికి రేపు దారి చూపేది తెలంగాణ రాష్ట్రమేనని, తెలంగాణలో జరుగుతున్న కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానం గురించి మిగతా రాష్ట్రాల వారు ఆసక్తితో తెలుసుకుంటున్నారని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రజల ఇండ్ల వద్దకే పండ్లు, కూరగాయలు అందజేస్తున్నామని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. వైద్య, పోలీసు, పారిశుద్ధ్య, రైతులకోసం వ్యవసాయ, మార్కెటింగ్, సహకార సిబ్బంది ప్రజలకోసం చేస్తున్న సేవలు అమూల్యమైనవని, వ్యవసాయ, మార్కెటింగ్ ఉద్యోగుల మీద పోలీసుల చర్యలు గర్హనీయమన్నారు.

ప్రజల కోసం పోలీసుల మాదిరే రైతుల కోసం వీళ్లు పనిచేస్తున్నారని, ఉద్యోగుల వద్ద పాసులు చూసేంత తీరికలేని కొందరివల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోందని, దుబ్బాక, వరంగల్ ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకుని మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారనీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here