వెండితెరపై రగిలిన స్ఫూర్తి!

0
15 వీక్షకులు

సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రపంచాభివృద్దిలో కీలక భాగస్వామ్యం కార్మిక, కర్షక, శ్రామిక జీవులదే. కార్మిక, కర్షకులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ… ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటిచెపుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మే 1న ఆవిర్భవించింది. మేడేగా ఖ్యాతి గడించిన ఆ రోజు ప్రపంచ కార్మికులకు పండగ దినం. తమ హక్కులను సాధించుకుంటూ కార్మికుల పురోభివృద్ధే ధ్యేయంగా విరాజిల్లే మేడే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కన్నుల పండువగా ప్రతీఏటా జరుగుతుంటుంది. భారతదేశంలో కూడా మేడేకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు.

కార్మిక, కర్షకులు అధికంగా ఉండే మనదేశంలో వివిధ ట్రేడ్‌ యూనియన్ల వారు మేడేను ఎంతో గొప్పగా జరుపుకోవడం చూస్తున్నదే. ఇక సినిమారంగంలో కూడా వివిధ శాఖలలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. పవర్‌ఫుల్‌ సాధనంగా చెప్పబడే సినిమా రంగంలో మేడే స్ఫూర్తితో అనేక చిత్రాలొచ్చాయి. పాతతరం సినిమాలు మొదలుకుని నేటితరం సినిమాల వరకు ఎన్నో సినిమాల్లోని పాటలు, సన్నివేశాలు మేడే చుట్టూ చైతన్యవంతంగా సాగాయి.

ముఖ్యంగా గతంలో మాదాల రంగారావు నటించిన అనేక చిత్రాలు కార్మికుల కథాంశంతో తెరకెక్కినవే. కార్మికులకు జరిగే అన్యాయాలను ప్రతిఘటిస్తూ ఆవిష్కరించినవే. విప్లవశంఖం, ఎర్రమల్లెలు వంటి పలు చిత్రాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అలాగే ఆర్‌.నారాయణమూర్తి కూడా కార్మిక పక్షపాతిగా సినిమాలను తీశారు. ఆయన నటించి, నిర్మించిన అనేక చిత్రాలు ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తాయి. సింగన్న చిత్రంలో ఆయారే మేడే ఆయుధమై నేడే… అంటూ సాగే పాట కార్మికులలో చైతన్యాన్ని నింపుతుంది. చండశాసనుడు చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌.పై చిత్రీకరించిన జనం తిరగబడుతోంది.. ధనం ఉలికి పడుతోంది… ఇది మరో పొద్దుపొడుపు అంటూ సాగే విప్లవ పాట కార్మిక పక్షాన నిలుస్తుంది. ఇక కార్మిక, కర్షక… శ్రామిక జీవులు మన దేశానికి వెన్నుపూసలు… అంటూ ఓ కవి తన గీతంలో నినదించిన అక్షర సత్యాలు ఒకప్పటి పునాదిరాళ్లు చిత్రంలోనివి.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మొదటి చిత్రంలోనిది ఆ పాట. కార్మికులు, కర్షకులు లేకుండా సమాజాభివృద్ధిని, ప్రపంచాభివృద్ధిని ఊహించలేం… చూడలేం అంటూ కవులు తాము రాసిన విప్లవ గీతాలలో ఆవిష్కరించిన పదాలు చైతన్య కరదీపికలుగా నిలుస్తాయి. ఇంకా పలువురు నటీనటులు నటించిన చిత్రాల్లోని సన్నివేశాలు, పాటలు మేడే సందేశాన్ని ప్రతిబింబించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నటీనటులు నటించిన చిత్రాల్లో మేడే ప్రాధాన్యం ఆవిష్కరింపబడి… సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here