వైద్య వృత్తిలో నర్సింగ్ పాత్ర…

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా…

రోనావైరస్ విజృంభణ నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వైద్యులు ఎంతటి కీలకపాత్ర పోషిస్తున్నారో దాదాపు అదే స్థాయిలో, కొన్ని సమయాలలో అంతకంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు నర్సింగ్ స్టాఫ్. బాధితులకు ఒకస్థాయి వరకు డాక్టర్లు చికిత్స అందిస్తే, తర్వాత వారి సంరక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలు అందిస్తూ నర్సులు వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా వారి సేవలను మరోమారు స్మరించుకుందాం. రోగుల ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైనది నర్సింగ్‌ వృత్తి. ఆసుపత్రిలో వీరి సేవలు ఎంతో అవసరం. వైద్య వృత్తి ఎన్ని నూతన పోకడలలో పోతున్నా, ఎన్ని ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చినా వీరి సేవకు మాత్రం వెల కట్టలేం.

కరోనా మహమ్మారి కకావికలం చేస్తున్న తరుణంలో కూడా వారు మనోనిబ్బరాన్ని కోల్పోకుండా, చివరికి కుటుంబాలను కూడా వదిలిపెట్టి సేవలందిస్తున్నారు. అయిన వారే బాధితుల దగ్గరకు రాలేని, పలకరించలేని పరిస్థితిలోనూ ఇంటింటా జ్వర సర్వే చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే బాధితులకు ఓర్పుగా కరోనాపై అవగాహన కల్పిస్తూ వారికి టీకా వేస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని కుటుంబ సభ్యులే నిర్లక్ష్యం చేయడంతోపాటు కొవిడ్‌ మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా శ్మశానవాటికలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తస్తున్నారు. మరికొందరు నర్సులు కరోనాను జయించి కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. అయితే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాక వారు పడుతున్న బాధలు అంతాఇంతా కాదు. తమ వల్ల పిల్లలకు వైరస్‌ సోకే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కేవలం కరోనా వంటి విపత్తుల్లోనే కాకుండా స్వైన్‌ఫ్లూ, క్షయ వంటి వ్యాధులకు కూడా వీరు ధైర్యంగా సేవలు అందిస్తున్నారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏటా మే 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌‌లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించింది.

భారతదేశంలో నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసా పత్రం, జ్ఞాపికతోపాటు 50 వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

ఇక, నర్సింగ్‌ వృత్తి ప్రస్తానానికి వస్తే… ఓ నర్సు ఆధునిక వైద్య సేవకురాలిగా మారేందుకు మూలరూపం ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌. యూరప్‌ ఖండంలోని క్రీమియర్‌ అనే ప్రాంతంలో ఒకప్పుడు భీకర పోరు సాగింది. ఇందులో వేల సంఖ్యలో చనిపోయారు, గాయపడ్డారు. ఓ మహిళ మాత్రం ఎలాంటి భయం లేకుండా ధైర్య సాహసాలతో వైద్య సేవలు అందించింది. ఆమె పేరే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌. ఈమె రాత్రిపూట సైతం యుద్ధంలో గాయపడిన సైనికులను పరామర్శించడానికి దీపంతో సంచరించేది. యుద్ధభూమిలో ఆమె చేసిన సేవలకు ప్రపంచం ప్రశంసలు కురిపించింది. లేడీ విత్‌ ది యాంప్‌ అనే బిరుదును నైటింగేల్‌ అందుకున్నది. 1910 ఆగస్టు 13న చనిపోయింది. ప్రతి సంవత్సరం మే 12న ఆమె జయంతిని పురస్కరించుకొని ‘ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు.

మరోవైపు, కరోనా సోకితే కన్నపేగు తెంచుకుపుట్టిన బిడ్డనైనా తాకలేం. జన్మజన్మల బంధమని పాడుకున్న భార్యభర్తలూ అంటరానివాళ్లే అవుతారు. బంధువులు, ప్రాణస్నేహితులైనా సరే పారిపోతారు. ఫోన్లతోనే సరిపెట్టుకుంటారు. కనీస పరామర్శకు పదిరకాల ఆలోచనలు చేస్తారు. అప్పటి వరకు పలకరించిన పొరుగింటి వాళ్లు కూడా తలుపులు వేసుకుంటారు. కరోనా వైరస్‌ సోకితే.. లోకం వెలేసినంత పనిచేస్తుంది. ఒంటరైన రోగికి ఉన్న ఏకైక దిక్కు ఆస్పత్రి. వార్డుల్లో బెడ్‌ మీద పడుకున్నాక.. ఒక ఆత్మీయ పలకరింపు.. అమ్మలాంటి చల్లని స్పర్శ.. ఆ కళ్లలో కారుణ్యం.. తొలిసారి మన వద్దకు వచ్చేది ఒక్క నర్సు మాత్రమే. ఆమె సాధారణ పరీక్షలు చేశాక వైద్యులు వస్తారు. చికిత్స మొదలవుతుంది. ఆ తరువాత బీపీ, పల్స్‌, మందులు, ఇంజక్షన్లు, వైద్య సలహాలు.. అన్నీ తానై వ్యవహరిస్తుంది నర్సు. అమ్మ తరువాత అంత అమ్మ ఆమే అవుతుంది. ప్రకృతి ధర్మంలోనే ఉందేమో? మాతృమూర్తిలో ఆ సహజమైన ఆత్మీయత. ఇప్పుడు ఏ ఆస్పత్రిలో చూసినా.. ఒంటిచుట్టూ కప్పుకున్న పీపీఈ దుస్తుల్లో డాక్టర్లు దర్శనమిస్తున్నారు. వాళ్ల వెనక మందులు, సూదులు, బీపీ మిషిన్లు పట్టుకుని పరుగులు తీస్తుంటారు నర్సులు.

వైద్యులకంటే వాళ్లు బిజీ. పనిగంటలూ ఎక్కువే. భరించలేని ఒత్తిడి. కొందరు నర్సులైతే ఇంటికి వెళ్లేందుకు వీలుపడటం లేదు. ఆ మధ్య ఒక నర్సు తన కన్నకూతుర్ని చూడక వారాలైంది. కుటుంబీకులు ఆ బిడ్డను తీసుకొచ్చి, ఆస్పత్రి ఎదుట నిల్చున్నారు. లోపల పనిచేసే నర్సు ఆమడదూరం నుంచే కన్నకూతురు కన్నీటిని భరించలేకపోయింది. అమ్మా.. అంటూ ఆ చిన్నపిల్ల ఏడుస్తుంటే.. మాతృహృదయం తట్టుకోలేకపోయింది. కానీ, ఏం చేసేది? ఆమె కరోనా రోగులకు వైద్యం చేసే నర్సు. కూతుర్ని ముట్టుకోవాలంటే భయం. తనకు జబ్బు వస్తుందేమోనన్న ఆందోళన. ఇలాంటి నర్సులు వేల సంఖ్యలో బాధను దిగమింగుకుని సేవలు అందిస్తున్నారు. కుటుంబాలను ఫణంగా పెట్టి ఆస్పత్రుల్లోనే ఉండిపోతున్నారు. ‘రిపోర్టులు రాయడం, సెలైన్‌బాటిళ్లు ఎక్కించడం, శాంపిల్స్‌ తీసుకోవడం.. ఊపిరిసలపని పని ఉంటుంది. కనీసం ఇంటికి ఫోన్‌ చేసి పిల్లలతో మాట్లాడేందుకు కూడా తీరిక లేదిప్పుడు’ అంటున్నారు నర్సులు.

వైద్యులు, నర్సులపై ఇప్పుడు పూలు చల్లుతున్నారు. ఇదివరకైతే కొన్ని అపార్టుమెంట్లు, కాలనీల వాసులు బెరుకుబెరుకుగా చూసేవాళ్లు. నర్సులను చిన్నచూపు చూశారు. ఆస్పత్రికి వెళితే వాళ్ల సేవలు కావాలి. పక్కింట్లో ఉంటే మాత్రం మాకొద్దు అనే రీతిలో వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇక, ఆస్పత్రుల్లో రోగులు మృతిచెందితే.. రోగి తరఫు బంధువులు దాడులు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో కూడా నర్సుల సమస్యలు బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఆస్పత్రుల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోని సంఘటనలు ఉన్నాయి. ఇది మన దేశానికే చెందిన సమస్య కాదు. ప్రపంచమంతా ఉంది. అమెరికాలోని ‘సోన్జా ష్వార్జ్‌బాష్‌’ అనే ఆరోగ్య సేవకురాలు మొదలుపెట్టిన ప్రయత్నం చూస్తే చాలు… నర్సుల స్థితి ఎంత దయనీయమో అర్థమవుతుంది. సోన్జా ‘మిషన్‌ ఫర్‌ మాస్క్‌’ అనే ఓపెన్‌ డాక్యుమెంట్‌ ప్రారంభించింది. ఇందులో నర్సులు ఎవరైనా సరే.. గోప్యంగా తమ కష్టాన్ని చెప్పుకోవచ్చు. ఆ బాధలు చదివితే కడుపు తరుక్కుపోతుంది. వెయ్యి మందికి పైగా నర్సులు, తమకు సరైన రక్షణ లేదన్నారు. లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓ ఆసుపత్రి వాళ్లు.. మాస్కులకు బదులు కర్చీఫులు చుట్టుకురమ్మని సలహా ఇచ్చారట. ఇంకో ఆస్పత్రి వాళ్లు.. చేతులకు తొడుక్కునే గ్లవ్స్‌ను పారేయకుండా.. శానిటైజర్‌తో కడుక్కోమని సూచించారట. వైద్యులకు ఇస్తున్న ప్రాధాన్యం నర్సులకు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు కొందరు.

ఆస్పత్రుల్లో వసతులు, జీతభత్యాలు, రక్షణ పరికరాలు ఎలా ఉన్నా.. నర్సుల సేవల్లో మన దేశం ముందుంది. భారతీయ వైద్యులకు ఎంత పేరుందో మన నర్సులకు అంతే పేరుంది. ఆక్స్‌ఫర్డ్‌ (ఇంగ్లండ్‌) ఆసుపత్రిలో రోగులకు సేవ చేస్తూ చనిపోయిన ‘ఫిలోమినా చెరియన్‌’ సాక్షిగా, మన నర్సుల సేవలను ప్రపంచమంతా గుర్తిస్తోంది. సహజంగా ఉండే సహనమో, స్థిరమైన వృత్తిగా దీన్ని ఎంచుకోవడమో…. కారణం ఏదైతేనేం ‘ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్‌ అవసరాలను తీర్చడంలో భారతదేశానిది కీలకపాత్ర’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. అందులోనూ కేరళదే ముఖ్యపాత్ర. మత సంప్రదాయాలు, నచ్చిన వృత్తిని ఎంచుకోవడంలో స్వేచ్ఛ.. అక్కడి స్త్రీలకు నర్సింగ్‌ను అనువైన వృత్తిగా మార్చింది. మరోవైపు కేరళలో అక్షరాస్యత కూడా ఎక్కువే. కాబట్టి నర్సింగ్‌ రంగానికి తిరుగులేకుండా పోయింది. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక నర్సులు కేరళవాళ్లే అయ్యుంటారు. వీళ్లు విదేశాల్లోనూ అద్భుత అవకాశాలను అంది పుచ్చుకున్నారు.

కేరళ నర్సులకు అమెరికా, ఇంగ్లండ్‌, కెనడా, యూరప్‌ దేశాల్లో అత్యధిక డిమాండ్‌ ఉంది. కేరళ జి.డి.పి.లో మూడోవంతుకు పైగా డబ్బును, విదేశాల్లో స్థిరపడిన మలయాళీలు పంపుతున్నదేనని ‘కేరళ మైగ్రేషన్‌ సర్వే’ చెబుతోంది. అందులో అధికశాతం నర్సులు పంపిన సొమ్మే!. ‘మా దేశంలోని అత్యుత్తమ నర్సులు… కేరళ నుంచి వచ్చినవారే. వాళ్ల చేతి చలవో ఏమో కానీ.. రోగులకు ఎక్కడలేని సాంత్వన చేకూరుతుంది. ఒక వ్యక్తి ఆస్పత్రిలో చేరాడంటే.. తెలియని ప్రాణభయం పట్టుకుంటుంది. అలాంటి భావోద్వేగ క్లిష్టసమయంలో భరోసా కావాలి. అది నర్సుల నుంచే లభిస్తుంది..’ అంటారు అన్నా సౌబ్రీ అనే బ్రిటిష్‌ రాజకీయవేత్త. కేరళ నర్సుల పట్ల ఆ సదభిప్రాయం ప్రపంచానికి తెలుసు. అందుకే వారికి వీసాలు కూడా తేలిగ్గా లభిస్తాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఆ సానుకూల అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏటా ఇరవైవేలకు పైగా నర్సులు, విదేశాల్లో స్థిరపడుతున్నట్టు అంచనా. ఇక మఽధ్య ఆసియా దేశాలు చెప్పనక్కర్లేదు. సౌదీ అరేబియా, కువైట్‌, యుఎఇ… దేశాలలో మన నర్సులకి ఎంత డిమాండ్‌ ఉందంటే… ఒకానొక దశలో నర్సులు ఆయా దేశాలకు వలస వెళ్లడానికి వీల్లేదంటూ నిషేధాన్ని విధించాల్సి వచ్చింది. ఇప్పటికే మన దేశంలో ఇరవై లక్షల మంది నర్సుల కొరత ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడొచ్చిన కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకునైనా.. ప్రభుత్వాలు, ఆస్పత్రుల యాజమాన్యాలు నర్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

ఇతర దేశాల్లో అయితే నర్సులకు దక్కే గౌరవం అసాధారణం. సీనియర్‌ నర్సులకు, వైద్యులతో సమానమైన హోదా దక్కుతుంది. యువ డాక్టర్లు, అనుభవజ్ఞులైన నర్సుల సలహాలు తీసుకుంటుంటారు. మన దేశంలో పరిస్థితి వేరుగా ఉంది. ఆస్పత్రుల్లోనూ పురుషాధిక్యత కనిపిస్తుంది. నర్సులకు తగిన ప్రాధాన్యం దొరకదు. వాళ్లను నాలుగో తరగతి సేవకుల్లాగే చూస్తున్నారు. ప్రాథమిక చికిత్సకు సైతం వైద్యుడి అనుమతి ఉండాల్సిందే. ఇక, నర్సుల జీతాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌లో శ్రమదోపిడి ఎక్కువగా ఉంది. షిప్టులు, పనివేళలు సరేసరి. ట్రైనింగ్‌లో ఉన్నవారికి పదివేల లోపు, గ్రాడ్యుయేట్లకు ఇరవైవేల లోపు జీతాలే దక్కుతున్నాయి. గ్రాట్యుటి లాంటి సదుపాయాలు ఎక్కడ కల్పించాల్సి వస్తుందో అని… చాలా ఆసుపత్రులు కాంట్రాక్టు పద్ధతి పైనే నర్సులను ఎంపిక చేసుకుంటాయి. అంటే… రోగి ప్రాణానికి చివరి ఆశగా మిగిలే నర్సులకి, తమ జీవితాల మీదే భరోసా లేదన్నమాట!. ఒకవేళ విదేశాలకు వెళ్లి బతుకుదామంటే…. లక్షల రూపాయలను కమిషన్లుగా దండుకునేందుకు దళారులు కాచుకుని ఉంటారు. ఈ పరిస్థితిని మార్చుకునేందుకు కేరళలో వేలమంది నర్సులు సంఘటితం అయ్యారు. ‘జాస్మిన్‌ రివల్యూషన్‌’ పేరుతో పెద్ద ఉద్యమాన్నే నడిపారు. ఆ సమయంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న ప్రభుత్వం.. ఆ ఊసే ఎత్తడం లేదు.

ఇదీ నర్సుల కథ. ఇందాక పలకరించిన గీత చెప్పినట్టు ‘ఇప్పుడంతా మమ్మల్ని దేవదూతలని పొగిడేస్తున్నారు. కానీ ఈ కరోనా హడావుడి అయిపోయాక మమ్మల్ని మర్చిపోతారు. మా జీవితాల్లో ఎలాంటి మార్పూ రాదు’. ఇదే అభిప్రాయం చాలామంది నర్సుల్లోనూ ఉంది. కరోనా సోకితే కుటుంబసభ్యులే దగ్గరికి వెళ్లలేని పరిస్థితుల్లో.. నర్సులే ధైర్యంగా రోగి వద్దకు వెళ్లి.. సేవలు అందిస్తున్నారు. వాళ్లవీ ప్రాణాలే కదా! వైద్యులు, నర్సుల సేవల్ని కొనియాడుతూ.. హెలికాప్టర్ల నుంచి పూలు చల్లడం కాదు. వాళ్ల జీవితాలకు భరోసానివ్వాలి. ఆస్పత్రుల్లో ఉద్యోగమంటే.. జబ్బుల యుద్ధ క్షేత్రంలో పనిచేయడమే! నర్సులు మనకింత భరోసా ఇస్తుంటే.. వాళ్ల బతుకులకు మనం ఏమిస్తున్నాం? అమ్మ రుణం తీర్చలేనిది.. నర్సమ్మల రుణం కూడా తీరనిదే!.

మానవాళి సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ ఓ అనూహ్యమైన వ్యక్తిత్వం ఏదో బయటపడుతుంది. సమస్యకు దారి చూపించడమే కాదు… రాబోయే శతాబ్దాలకు మార్గదర్శిగా నిలబడుతుంది. గాంధీ నుంచి మండేలా వరకు నిరూపితం అయిన సత్యం ఇది. ఆ జాబితాలో నిలిచే మరో వ్యక్తి ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’. నర్సింగ్‌ విధానానికి, ఆ మాటకు వస్తే రోగుల ఉపచారానికి సరికొత్త ఒరవడిని రూపొందించిన వ్యక్తి. ఆమె పుట్టిన ఊరి మీదుగా నైటింగేల్‌కు ఫ్లోరెన్స్‌ అన్న పేరు జోడించారు ఆమె తల్లిదండ్రులు. ఆమె మహా చురుకు. ఎలాంటి భాషనైనా ఇట్టే పట్టేసేది. అలా ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, గ్రీస్‌, లాటిన్‌ లాంటి భాషలన్నీ నేర్చుకుంది. వీటన్నింటికీ మించి మానవత్వం అనే విశ్వజనీనమైన భాష ఆమెను ఆకర్షించింది. అందుకే ధనిక కుటుంబం నుంచి వచ్చినా నర్సింగ్‌ను వృత్తిగా ఎంచుకుంది. ఆ రోజుల్లో నర్సింగ్‌కు నిర్దుష్టమైన ప్రాతిపదిక ఏదీ లేదు. ఎలా తోస్తే అలాగే! దాన్ని ఓ దారికి తేవాలన్నది నైటింగేల్‌ తపన. ఈలోగా బ్రిటన్‌, రష్యాల మధ్య క్రిమియన్‌ యుద్ధం తలెత్తింది ఆ పోరులో గాయపడినవాళ్లు, యుద్ధభూమిలో ఆక్రందనలు చేస్తూ మరణం అంచుల వరకు వెళ్లారు. గాయాలకంటే… అంటువ్యాధులు, ఇన్‌పెక్షన్లే వాళ్లని మృత్యుఒడిలోకి తీసుకెళున్నాయి. ఆ పరిస్థితిని మార్చడం నైటింగేల్‌కే సాధ్యమని గ్రహించింది ప్రభుత్వం. వారి సూచన మేరకుఓ 38 మంది బృందాన్ని వెంటబెట్టుకుని ఇస్తాంబుల్‌కు చేరుకుంది.

హేయమైన పరిస్థితులు, అధికారుల నిర్లక్ష్యం, శ్మశాన వైరాగ్యాలతో… నైటింగేల్‌ మాటల్లో చెప్పాలంటే అక్కడ ‘నరకం రాజ్యమేలుతోంది’. స్థానిక అధికారుల నుంచి ఎలాంటి సహకారమూ లభించకపోయినా… ఆ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది. పరిశుభ్రత, చికిత్స, సపర్యలు, ఆహారం.. అన్నింటినీ మెరుగుపరచింది. సైనికులలో స్థైర్యం పెంచేందుకు వారికి విద్య, వినోదాలను అందించింది. రాత్రివేళల్లో సైతం చేతిలో దీపంతో వారిని పర్యవేక్షిస్తూ ‘లేడీ విత్‌ ద ల్యాంప్‌’ అన్న బిరుదు సాధించింది. ఆమె కృషితో మరణాల రేటు రెండు శాతానికి పడిపోయిందట. ఆ యుద్ధంలో తన పరిశీలన ఆధారంగా 1860లో ప్రపంచంలోనే తొలి నర్సింగ్‌ స్కూల్‌ను స్థాపించింది. ఆమె రాసిన ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ ఇప్పటికీ చదివితీరాల్సిన పాఠ్యగ్రంథం. కరోనాతో విలవిల్లాడుతున్న ఈ 2020 సంవత్సరానికి ఆమె జన్మించి రెండు వందల ఏళ్లు పూర్తికావడం యాదృచ్ఛికం ఏమీ కాదు. ‘నా పరివారం… మీకు అండగా నిలుస్తుంది’ అనే భరోసా ఆమె ఇవ్వదల్చుకున్నారేమో! ఆమె పుట్టినరోజునే ఏటా మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా (మే 12) జరుపుకుంటున్నాం. ఎంతో కష్టంలో ఉంటాం. ఈ రోగంతో ఇక బతకడం అసాధ్యం అన్న నిరాశలో కూరుకుపోతాం. నా అన్నవాడు ఎవడూ రాడే అన్న బాధతో కుమిలిపోతుంటాం. హాస్పిటల్‌ బెడ్‌ మీద అలా నిరాశలో ఉన్న వ్యక్తిని ఓ దేవత ఆదుకుంటే, ఆమె సేవలో అతను సాంత్వన పొందితే… తెలియకుండానే ఆమె పట్ల ప్రేమ కలగడం సహజం. దీన్నే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ సిండ్రోమ్‌ అంటారు. సాధారణంగా నర్సులు ఓర్పుతో, కరుణతో సేవ చేస్తుంటారు. దాన్ని అపార్థం చేసుకుని ప్రేమిస్తున్నామంటూ వెంటబడే రోగులకు కొదవ లేదు. అలాంటివాళ్ల ప్రవర్తనను మరింత జాగ్రత్తగా డీల్‌ చేయాల్సిన పరిస్థితి. నొప్పించక తానొవ్వక తప్పించుకోనూ లేక… ఆ నర్సులు పడే అవస్థ కత్తి మీద సాముకంటే ప్రమాదకరమే!

బెస్సీ యాంగ్యూ… లాస్‌వెగాస్‌లోని మౌంటెన్‌వ్యూ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా ఆమెకు కరోనా సోకింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఐసియులోకి చేరింది. మత్తో, మరణమో తెలియని మగతలోకి జారిపోయింది. రోజులు కాదు, గంటలు గడవడం కూడా కష్టమైపోయాయి. ఇలాంటి సందర్భంలో సాటి నర్సులే ఆమెను కాపాడుకున్నారు. అటుతిరిగీ ఇటుతిరిగీ ‘ఏయ్‌ బెస్సీ త్వరగా కోలుకో!’ అంటూ ఆమెతో మాట్లాడేవారు. ఆమెకు ఇష్టమైన సంగీతాన్ని వినిపించేవారు. ఆశ్చర్యం! బెస్సీ కోలుకుంది. ‘జీవితం ముగిసిపోతుంది అన్నంత నిస్సత్తువలో నేనున్నప్పుడు… వాళ్ల పిలుపులు పలకరించేవి, నాకిష్టమైన సంగీతం వినిపించేది. మృత్యువుతో పోరాడాలన్న సంకల్పాన్ని కలిగించేది’ అంటారు బెస్సీ.

బ్రిటిష్‌ పాలనలో ఉన్న మన దేశంలో తీవ్ర అంటువ్యాధులు వ్యాపించాయి. ఈ విషయం నైటింగేల్‌ దృష్టికి రావడంతో, ఆమె పరిశోధన మొదలుపెట్టింది. పరిశుభ్రత లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అధికారులను తలంటింది. ఇండియాలో ఆసుపత్రుల తీరు మెరుగుపడేందుకు, ప్రత్యేక నర్సింగ్‌ విధానం ఉండాలని సూచించింది. అందుకోసం ఓ విస్తృతమైన నివేదికను రూపొందించడంతో పాటు, తన శిష్యురాళ్లను కూడా పంపింది. వారి నేతృత్వంలో 1867లో దిల్లీలో సెయింట్‌ స్టీఫెన్స్‌ ఆసుపత్రిలో తొలి నర్సింగ్‌ శిక్షణా కేంద్రం మొదలైంది. అది ఇప్పటికీ నడుస్తోంది. ఈ రంగానికీ, దేశానికీ నైటింగేల్‌ చేసిన సేవలను తల్చుకుంటూ…. ఏటా మన రాష్ట్రపతి, ఉత్తమ నర్సులకు ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’ను అందిస్తున్నారు.

నిరంతరం రోగుల మధ్య పని, రాత్రివేళల్లో సైతం డ్యూటీ, టిబిలాంటి అంటువ్యాధులతో సహజీవనం… అందుకే వాళ్లని పెళ్లి చేసుకునేందుకు చాలామంది తడబడుతుంటారు. నిజానికి జీవిత భాగస్వామిగా నర్సుకు మించిన ఎంపిక లేదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. ఉన్న మాటను స్పష్టంగా చెప్పగలగడం, పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, ఆపదలోనూ ప్రశాంతంగా ఉండగలగడం, పని ఒత్తిడిని తట్టుకోవడం, ఎదుటి వ్యక్తి బాధను ఓపికగా వినడం… ఇవన్నీ వారి వృత్తితో పాటు అలవడిపోయే లక్షణాలు. ఎన్నో కష్టాలకు సాక్షిగా నిలిచిన అనుభవంతో, ఓ మార్గదర్శిగా నిలవగలరు. సహజమైన కరుణతో తల్లిప్రేమను మరిపించగలరు. అన్నింటికీ మించి భర్త ఆరోగ్యం, జీవనశైలిలో వస్తున్న మార్పులను గమనించి హెచ్చరించగలరు.

కొవిడ్‌ను కట్టడి చేయడంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులతోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. రేయింబవళ్లు రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారి బాగోగులు చూస్తున్నది నర్సులేననేది వాస్తవం. అన్ని రకాల రోగులకూ సేవలందిస్తున్నవారిలో 69శాతం వాటా నర్సులదే కావడం గమనార్హం. వారిలో అధికభాగం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నారు. 2013-2018 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన 47 లక్షల మంది విద్యార్థులకు ఉపాధి లభించినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సింగ్‌ వృత్తిపై పురుషులు అంతగా ఆసక్తి చూపకపోవడంవల్ల- నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు సుమారు 59లక్షల మంది నర్సింగ్‌ సిబ్బంది కొరత ఉన్నట్లు తాజాగా వెలువడిన ప్రపంచ నర్సింగ్‌ నివేదిక స్పష్టం చేసింది. దానివల్ల ఏటా 80 లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో మెరుగైన సంరక్షణ లేక మరణిస్తున్నారని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. అందువల్ల రానున్న రోజుల్లో నర్సింగ్‌ విద్యకు ఉజ్జ్వల భవిషత్తు ఉందని తేటతెల్లమవుతోంది.

ప్రపంచంలో సుమారు 81శాతం నర్సులు అమెరికా, ఐరోపా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాల్లోనే సేవలందిస్తుండటం గమనార్హం. ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా లాంటి దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. భారత్‌లో నర్సుల కొరత అంతగా లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రతి పదివేల జనాభాకు- తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో 9.1శాతం, అధిక ఆదాయం కలిగిన దేశాల్లో 107.7శాతం చొప్పున నర్సులు ఉన్నారు. అంటే పేద దేశాల్లో ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా ఉండే నర్సుల సేవలు అంతగా అందుబాటులో లేవనేది అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 36శాతం నర్సులు అందుబాటులో ఉన్నారు. పల్లెసీమల్లో ఉండే ప్రజలకు వైద్య సేవలందించేందుకు నర్సులు అంతగా సుముఖంగా లేరు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఆ కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జర్మనీలో సుమారు 2.63 లక్షల మంది నర్సుల కొరత ఉంది. ఈ సంఖ్య 2030 నాటికి అయిదు లక్షలకు చేరవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ దేశంలో కొరత తలెత్తకుండా- విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నర్సింగ్‌ విద్య చదివే ప్రతి విద్యార్థికి ఖర్చయ్యే మొత్తం రుసుమును తామే భరించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాంటి విధానపరమైన నిర్ణయాలు భారత్‌లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయితో పోల్చి చూస్తే- భారత్‌లో నర్సింగ్‌ విద్యలో ప్రమాణాలు అంతంతమాత్రమే. కోర్సు పూర్తి చేసినప్పటికీ తగిన ప్రావీణ్యం లేక ఉద్యోగాలు పొందలేని వారెందరో!

అమెరికావంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నర్సింగ్‌ సిబ్బంది పని చేసే ప్రదేశాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. వారికి రక్షణ కవచాలూ పటిష్ఠంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అనేక దేశాల్లో లేవు. దాంతో నర్సులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, తీవ్ర వేధింపులకు సైతం గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ సేవలందిస్తున్నారు. భారత్‌లోనూ నర్సింగ్‌ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది వైద్య సిబ్బందికి రక్షణగా ఎపిడమిక్‌ డిసీజెస్‌ సవరణ ఆర్డినెన్సు-2020 తీసుకువచ్చారు. కానీ, అది వైద్య సిబ్బందికి అంతగా రక్షణ ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వాలు నర్సింగ్‌ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా- తగినన్ని నిధులు కేటాయించాలి. కళాశాలల సంఖ్యను పెంచడంతో పాటు ప్రత్యేక నర్సింగ్‌ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. అందులో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ప్రవేశపెట్టాలి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు పరిశోధక కోర్సులనూ ప్రవేశపెట్టాలి. వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమని భావించిన పాకిస్థాన్‌ రెండేళ్ల క్రితమే నర్సింగ్‌ యూనివర్సిటీని ప్రారంభించింది. ఏటా సుమారు 25వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఆ విధానాన్ని మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తే, నర్సింగ్‌ విద్యపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఉద్యోగ భద్రత లభించే అవకాశమూ ఉంటుంది. నర్సింగ్‌ విద్యను ప్రోత్సహించే దేశాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యమిచ్చే దేశాలకు ఆర్థిక చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నర్సింగ్‌ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అనేక దేశాల్లో నర్సింగ్‌ సిబ్బందికి మంచి గుర్తింపు ఇస్తున్నారు. వైద్య రంగంలో ప్రభుత్వాలు కేటాయించే పదవుల్లో వారికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దేశంలోనూ నర్సులకు తగిన ప్రాధాన్యమిచ్చి వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది.