విలవిల్లాడుతున్న జనం..

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

కరోనా డబ్బున్నోడికి జలుబుతో సమానం. చేతిలో పైసా లేనోడికి అది చావు దెబ్బే. తుమ్మినా దగ్గినా గొంతు నొప్పి వచ్చినా అది కరోనానే అనే ఆందోళన ఇంటిగడప దాటి నానా యాగీ సృష్టిస్తోంది. అది పాజిటివా? లేక నెగిటివా? తేలక ఉక్కిరి బిక్కిరితో ఊపిరి సలపటం లేదు. ఆసుపత్రికి వెళ్తే కనీసం నాడి చూడటానికి వైద్య సిబ్బంది బెంబేలెత్తిపోతోంది. రోగగ్రస్తుడి ప్రాణాలు గాలిలో కలుస్తుంటే తమ ఊపిరి ఆగిపోతుందనే భయం జనాన్ని పీడిస్తోంది. నడిరోడ్డున పడిన కొనఊపిరి మనిషిని పట్టించుకుని ఆసుపత్రికి తరలించేందుకు నేనున్నాను నేనున్నాను నేను ఆదుకుంటాను అనే నాధుడు కనుచూపు మేరలో కనిపించటం లేదు. కనీసం కుటుంబ సభ్యులు కన్నెత్తి చూడటం లేదు.

కడసారి చూపు అనే మానవ సంబంధం తెగిపోయింది. మానవత్వమూ అచేతన స్థితికి చేరింది. కేవలం కరోనా మహమ్మారితో అమానవత్వం, అమానుషం జతకడితే ప్రాణభయం పేరిట స్వార్థం కరాళ నృత్యం చేస్తోంది. అసలేం జరుగుతోంది? ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టి కబళిస్తుంటే? మృత్యుఘోష మార్మోగిపోతుంటే, ప్రజారక్షణలో పాలకులు సతమతవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసే స్థితికి చేరింది. లాక్‌డౌన్ కట్టడిని తెంచుకుని కరోనా వైరస్ జనంపైకి ఉరికింది. దొరికినోళ్లను దొరికినట్టు మింగేస్తోంది. ఆదుకునే వైద్య సేవలు కనిపించటం లేదు. వైద్యానికి అండ లేదు. ఆన్‌లైన్‌లో మందులు, మందుల షాపులు, డాక్టర్లు తప్ప మరో దిక్కులేదు.

ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే కరోనా పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాలు, కరోనా చికిత్సలు శరవేగంగా చేస్తున్నప్పటికీ కరోనాతోపాటు అనారోగ్య బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగిపోతోంది. రాష్ట్రంలో అనంతపూర్, తిరుపతి, కడప, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ముఖ్య నగరాల్లో ప్రభుత్వ వైద్యం కంటే అధునాతన ప్రైవేటు వైద్యం కరోనా నేపథ్యంలో సొమ్ములు చేసుకునేందుకు ఇస్తున్న ప్రాధాన్యతతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు సిఫార్సులుంటేనో రోజుకు 50 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేసే స్తోమత వున్న వారికి మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చిన్న తరహా పట్టణాల్లో ఆపరేషన్ థియేటర్లతో కూడిన చిన్న చిన్న ఆసుపత్రులు కరోనా దెబ్బకు చేతులెత్తేశారు. దీంతో అనారోగ్యంతో బాధపడే జనం మానసిక ఒత్తిడితో సగం మృతి చెందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అందని వైద్యసాయం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

ఆసుపత్రుల్లో అలసత్వం… నిర్లక్ష్యం కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో శానిటైజేషన్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రిజిస్ట్రే షన్ తరుణంలో ప్రాథమిక వసతులను పేర్కొంటున్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆచరణలో అమలు చేయడం లేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లిపోయారు. ఊపిరి అందక ఆసుపత్రికి వెళ్లేందుకు నడిరోడ్డుమీదకు చేరిన మధ్యతరగతి జీవికి కనీసం ఆటో లభించటం లేదు. ఆసుపత్రికి వెళ్లినా వార్డులోనికి కూడా రానివ్వటం లేదు. రోగి ఆక్రందన వినిపించినా వైద్యులు నిక్కి చూడటం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రైవేటు హెల్త్ సెంటర్లు మొదలు జిల్లా స్థాయి వరకు వివిధ రకాల 1421 ఆసుపత్రులుంటే అందులో 34, 235 పడకలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు 81 డిస్పెన్సరీలు, 39 డయాగ్నిస్టిక్ సెంటర్లు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది ఇతర సేవల సిబ్బందుల కొరతతో వేధిస్తోంది.

వందల సంఖ్యలో కార్పొరేట్ ఆసుపత్రులున్నా పేద, మధ్య తరగతికి వైద్య సేవలు కలే. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 20 రకాల జబ్బు లతో అనారోగ్య బాధితులు పెరుగుతున్నారు. ప్రభు త్వం చెబుతున్న లెక్కల ప్రకారం ప్రైవేటు రంగం కాకుండా 2016లో 8 వేల అనారోగ్య బాధితులు 2017 వచ్చేసరికి 25 వేలకు చేరుకున్నారు. 2018 వచ్చేసరికి 31 వేలకు చేరుకున్నారు. 2019కి దాదాపు 35 వేలకు పైగా వివిధ రకాల అనారోగ్య బాధితులు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలుచెబుతుంటే దీనికి తోడుగా మరో లక్షకు పైగా వ్యాధిగ్రస్తులు ప్రైవేటు రంగంలో చికిత్స పొందుతుంటారు. కరోనా నేపథ్యంలో గుండెనొప్పి, శ్వాసకోశ, క్యాన్సర్, కిడ్నీలో రాళ్ల నొప్పి, పంటి నొప్పి లాంటి అత్యవసర సేవలు సైతం కరోనా నెపంతో అనుమానం కింద కాల యాపన చేయడం బాధితుల బాధలు వర్ణనాతీతం.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్; +91 94919 99678, ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here