వామ్మో… కొందరి పేరు చెప్పి…

130
  • ఉదారస్వభావుల్ని, దాతల్నీ వదలని ‘రాని పత్రికల సంఘం’ నేతలు

అమరావతి, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): నిన్న చెప్పినట్లే ఈరోజు అప్‌డేట్‌లో మరో తాజా విషయం బయటకు వచ్చింది. చిన్నపత్రికలు, ఎంపానల్‌మెంట్ పత్రికలు, భారత ప్రభుత్వ నమోదిత పత్రికలంటూ తిండికి ఠికానా లేని కొంత మంది జిల్లాల్లో స్థానికంగా చేస్తున్న దందాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మనల్ని మనమే సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో మనం సమాజాన్ని ఉద్దరిస్తామా?’ అనే సందేహాలు కూడా ఈ నేపథ్యంలో పుట్టుకువస్తున్నాయి. తిరిగే బండిలో కనీసం లీటర్ పెట్రోలు వేయించుకునేందుకు దిక్కులేని వాడు కూడా జర్నలిస్టు నాయకుడినేనంటూ ప్రగల్భాలు పలికే పరిస్థితులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

సిద్ధాంతాల పేరిట ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఈ నాయకమ్మన్యులు చివరికి కొందరి పేరు చెప్పి ఒకటి, అందరి పేరు చెప్పి మరొకటీ లెటర్లను (వినతి పత్రాలను) తయారు చేస్తూ అడ్డగోలు ఆర్జనకు తెరతీస్తున్నారు. కలెక్షన్లకు వెళ్లేటప్పుడు కొత్తగా ఈ మధ్య ఎంపానల్డ్ లోకల్ న్యూస్‌పేపర్స్ సంఘాలంటూ కొన్ని జిల్లాల్లో దందాలకు పాల్పడుతున్న నాయకులే తమ పదవులను కాపాడుకునేందుకు, అవే పదవుల్లో ఏళ్ల తరబడి కొనసాగేందుకూ అందరి పేరిటీ లోకల్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ అంటూ వినతి పత్రాలు ఇచ్చి కోర్కెలు తీర్చమంటున్నారు.

చివరికి వచ్చింది… రెండు రకాలుగా వినతి పత్రాలు ఇచ్చింది ఒకే వ్యక్తులు కదా? తక్కువలో తక్కువగా ఆ ఐయిదారుగురికి ఇచ్చేస్తే పోతుందన్న అభిప్రాయంతో తమ ఉదారతను కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు చాటుకుంటున్నప్పటికీ ఈ అక్రమార్కులైన నాయకమ్మన్యులు మాత్రం ఏ విషయాన్నీ అందరికీ చెప్పకుండా, ప్రశ్నించే, తప్పుల్ని నిలదీసే వాళ్లపై కన్నెర్రజేస్తూ వాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు లేని, క్రమంగా ప్రచురణ కాని పత్రికల విషయంలో మాత్రమే ఈ తొక్కలో సంఘాల, నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. వస్తున్న పత్రికలేవీ ఈ సంఘంలో కనీసం సభ్యత్వాన్ని కూడా తీసుకోకపోవడం వీళ్ల ప్రవర్తనకు నిదర్శనంగానే భావించాలి.

ప్రభుత్వం నుంచి ప్రకటనల ద్వారా ఆదాయం కావాలన్నప్పుడు ప్రచురణకర్తలలు నిబంధనలు పాటించరా? ప్రచురణకర్తలను జీఎస్టీ లెక్కలు అడగడం కూడా సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ చేసిన తప్పేనా? కేవలం అక్రిడిటేషన్ల కోసమే వేలకు వేల సర్క్యులేషన్ చూపించే వారికి లెక్కలు వెల్లడించాలని తెలియదా? పాత జీవో (96) ప్రకారం 5000 కాపీల ప్రింట్ ఆర్డర్ ఉంటేనే అక్రిడిటేషన్ పొందే అర్హత ఉండేది. కానీ, కొత్త జీవోలో అలాంటి కఠిన నిబంధనే లేకపోవడం విశేషం. మెచ్చుకోవాల్సింది పోయి అధికారులపై నిందలు వేస్తారా?

పత్రిక రెగ్యులారిటీ ఉన్న, RNI ఆడిట్ రిపోర్టులో చూపించిన విధంగా పత్రికలను ప్రచురిస్తున్న వారికి ఈ జీవోలో అభ్యంతరాలేవీ లేవనే చెప్పాలి. రెండేళ్ల జీఎస్టీ అనేసరికి గుండెలు బాధుకుంటున్న ‘రాపసం’ నాయకులు నిజంగా పత్రికల్ని ముద్రిస్తున్నారా? లేక సామాజాక అనుసంధాన వేదికలకే పీడీఎఫ్ ఫైళ్లను పరిమితం చేస్తున్నారా? అన్నది ఆలోచించుకోవాలి. ప్రస్తుతం I&PR అధికారుల మెదళ్లను కూడా తొలిచేస్తున్న ప్రశ్న ఇదే.

దినపత్రికలకు కేవలం 2000 సర్క్యులేషన్ ఉన్నా ఎంపానల్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిన అధికారుల్ని తప్పుబడుతున్న ‘రాపసం’ నాయకులు అంతకముందు కనీస సర్క్యులేషన్ 5000 ఉన్నప్పుడు మూసుకునే ధోరణిలోనే దొంగ ఆడిట్ రిపోర్టులను తయారుచేయించారు కదా? కేవలం వెయ్యి రూపాయలు పడేస్తే చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఇస్తాడన్న ధీమాతో అప్పట్లో అడ్డగోలుగా వ్యవహరించినప్పుడు తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వానికి లెక్కలు చూపించాలని తెలియదా?

కనీసం అక్రిడిటేషన్ పొందిన వారు సైతం తమ పత్రికల అటెండెన్స్ వేయించుకోవడంలో నిర్లక్ష్యం ప్రద్శిస్తున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్ధంచేసుకోవచ్చు. ఇదంతా I&PR అధికారులదే తప్పా? ప్రచురణకర్తలుగా మనకు బాధ్యత లేదా? కేవలం జీఎస్టీ పెట్టినంత మాత్రాన గొంతులు చించుకుంటున్న మనం చట్టానికి అతీతులం కామని తెలియదా? కనీస అర్హతలు లేకపోయినా అడిగిన వాడికల్లా… డబ్బులిచ్చిన వాడికల్లా లేదా ప్రకటనల రూపంలో ఆదాయాన్ని సమకూర్చేవాడికల్లా అక్రిడిటేషన్లకు రికమండ్ చేసే ప్రచురణకర్తలు జీఎస్టీ లెక్కలు అడిగే సరికి తప్పించుకోవాలని చూస్తున్నారా?

ఇంత కాలం ఎలాంటి పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ లేకుండా అక్రిడిటేషన్లు జారీ చేసే విధానాన్ని ఇప్పటికైనా స్వస్తిపలికి, కేవలం అర్హులకు మాత్రమే వాటిని అందిస్తే ప్రభుత్వ ఆశయం నేరవేరినట్లవుంది. గత ప్రభుత్వాల హయాంలో అక్రిడిటేషన్ కోసం ఎవరికి రికమండ్ చేస్తున్నారో కూడా తెలియని దుస్థితి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 15 వేల అక్రిడిటేషన్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. వేరే ఉద్యోగాలు, పనుల్లో ఉన్నవారికీ ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడంకంటే దారుణం మరొకటి ఉండదు.

ఇక, ప్రభుత్వ ఉద్యోగాలలో (అది ఔట్ సోర్సింగ్ కావచ్చు. కన్సాలిడేటెడ్ పోస్టు కావచ్చు. లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన చేస్తున్నది కావచ్చు) ఉన్నవారికి సైతం ఈ దగుల్భాజీ ప్రచురణకర్తలు అక్రిడిటేషన్ కార్డులకు సిఫార్సులు చేశారు. చివరికి నేర చరిత్ర ఉన్నవారికి సైతం. ఇదేనా పాత్రికేయం? మనం ఈ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నామని గొప్పలకు పోవడం, సిద్ధాంతాలు వల్లించడం కాదు… నిజజీవితంలో ఎంత వరకు మనం త్రికరణ శుద్ధిగా వ్యవహరిస్తున్నామన్నదే అవసరం. అదే మన వృత్తి నిబద్దతకు, నిజాయితీకి కొలమానం.

‘రాపసం’ నాయకులు చెబితే అధికారులు వినే పరిస్థితి పోయింది. ఎందుకంటే, వాళ్లే పెద్ద అక్రమార్కులన్న విషయం క్రమంగా వాళ్లకూ అర్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ జీవో రూపొందించకముందు అన్ని సంఘాలతో సంప్రదింపులు జరిపిన I&PR ఉన్నతాధికారులకు ఎలాంటి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు నిజమైన ప్రచురణకర్తల నుంచి పెరిగిన వత్తిడి నేపథ్యంలో జీవో సవరించాలనడం ఎంత వరకు న్యాయం? అయినా, ఈ విజ్ఞప్తి చేయాల్సింది బోగస్ ఎడిషన్లు, దొంగ ఆడిట్ రిపోర్టులు, సర్క్యులేషన్ ఫిగర్స్ చూపించే వాళ్లు కాదు… నిజమైన, రెగ్యులర్‌గా పత్రికల్ని ప్రచురిస్తున్న వారు అడిగితే కనీసం అధికారులు స్పందిస్తారేమో?

కేవలం డీఏవీపీ రేట్ కార్డ్ కోసం లెక్కకు మించిన ఎడిషన్ సెంటర్లను పెట్టిన వాళ్లకు జీఎస్టీ ఉండాలని తెలియకపోవడం శోచనీయం. ఉదాహరణకు దినపత్రిక విషయాన్నే తీసుకుంటే రోజుకు 5000 కాపీల సర్క్యులేషన్ చూపిస్తే ఏడాదికి అయ్యే ఖర్చెంతో ప్రచురణకర్తకు తెలియకపోవడం మరీ విడ్డూరం. అసలు టన్ను న్యూస్ ప్రింట్ ధర ఎంత? 5000 కాపీలను ప్రింట్ చేయాలంటే ఎన్ని టన్నుల న్యూస్ ప్రింట్ అవసరం అవుతుంది? ముద్రణకు అయ్యే ఖర్చు (ఇంక్ ఇతరత్రా సామగ్రి) ఎంత? దానిని ఎలా కొనుగోలు చేశారు? ఏడాదికి టర్నోవర్ ఎంత? ఆ మొత్తంలో ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం ఎంత శాతం? మన వద్ద పనిచేస్తున్న వారు (జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు) ఎందరు? వాళ్లకు జీతభత్యాల రూపంలో చెల్లిస్తున్నది? కార్యాలయ నిర్వహణ ఖర్చులు ఎంత? ఇవన్నీ తెలియకుండానే వేలకు వేల సర్క్యులేషన్ ఫిగర్స్ చూపించి డీఏవీపీ, డీఐపీఆర్ నుంచి ప్రకటనల రూపంలో నొల్లుడు కార్యక్రమం కొనసాగుతోందా?

పోనీ, పైన చెప్పిన భారతానికంతా ఏకవాఖ్య సమాధానంగా అంతా లాసే చూపిస్తున్నామనుకుందాం? కానీ, అసలు 5000 కాపీల ప్రింట్ ఆర్డర్ ఉన్న పత్రిక నిర్వహణకు దాదాపు ఏడాదికి ప్రస్తుతం పెరిగిన లెక్కల ప్రకారం రమారమీ 2 కోట్ల రూపాయలు అవసరం. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చుకుంటున్నారన్న విషయాన్నయినా మనం ఆడిట్ లేదా ఆదాయ పన్ను రిటర్న్ రూపంలో చూపించాలి కదా?

ఐదుగురికి మించి పనిచేసిన సంస్థ ఏదైనప్పటికీ కార్మిక చట్టం ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ పరిధిలోకి వెళ్తాయి. అలాగని పత్రికా రంగానికి ఎలాంటి మినహాయింపులు లేవు. అలాంటప్పుడు మండలానికో విలేకరి ఉన్నాడంటూ పదుల సంఖ్యలో అక్రిడిటేషన్లు పొందిన ‘రాపసం’ నాయకులు వీటన్నిటినీ మరచిపోయారా? లేక, ప్రభుత్వం, అక్కడ పనిచేస్తున్న అధికారులు గుడ్డిగా వ్యవహరిస్తారనుకున్నారా?

ఈ నేపథ్యంలో సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి ప్రలోభాలకూ తలొగ్గకుండా కొత్త జీవోను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పూనుకోవడమే తరువాయి. అయితే, అక్రమార్కుల విషయాన్ని పక్కనపెట్టి కేవలం తాము నిర్వహిస్తున్న పత్రికపైనే (అది దినపత్రిక కావచ్చు లేదా పిరియాడికల్ కావచ్చు) పూర్తిగా ఆధారపడ్డ నిజాయితీ కలిగిన మిత్రుల విషయంలో I&PR ఉన్నతాధికారులు ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాము.

(తరువాయి అప్‌డేట్‌లో తెలుగు రాష్ట్రాలలో లెక్కకు మిక్కిలి పత్రికలు… దొంగ లెక్కలు)