విలేకరులతో మాట్లాడుతున్న ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి, జనవరి 19 (న్యూస్‌టైమ్): మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన మత బోధకుడు ప్రవీణ్‌ చక్రవర్తితో తమ పార్టీ నేతలకు సంబంధాలున్నట్టుగా చిత్రీకరించేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. వాస్తవానికి ప్రవీణ్‌ చక్రవర్తిౖపై ఉన్న కేసులు ఎత్తేసింది టీడీపీ ప్రభుత్వమైతే అతన్ని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కాకినాడకు చెందిన ప్రవీణ్‌ చక్రవర్తి రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెట్టాడని తెలిసిన వెంటనే ప్రభుత్వం అతనిపై కేసు పెట్టి, అరెస్టు చేసి జైలుకు పంపింది. అలాంటిది అతన్ని కాపాడేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలనడం సిగ్గులేని రాజకీయాలకు పరాకాష్ట. ప్రవీణ్‌పై గతంలో 6కేసులు నమోదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మూడు కేసులు ఎత్తేశారు. 2 కేసుల్లో హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఇంకో కేసు న్యాయస్థానంలో తొలగించారు. ఇవన్నీ జరిగింది టీడీపీ హయాంలోనే. ఇప్పుడు మాపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు సీఎంగా ఉన్నకాలంలోనే..’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.

‘‘ప్రవీణ్‌తో తనకు, వైఎస్సార్‌సీపీ నేతలకు సంబంధాలున్నాయంటున్న నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ హయాంలో హోంమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో ప్రవీణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ దళిత మహిళ ఎంత చెప్పినా ఆయన పట్టించుకోలేదు. అప్పట్లో ఆమె ఆవేదనను వెలుగులోకి తెచ్చింది సాక్షి పత్రికే. ప్రవీణ్‌ను కాపాడే ఉద్దేశమే మాకుంటే ఇది జరిగేదేనా? ప్రవీణ్‌కు విదేశీ నిధులు వస్తున్నాయని అప్పట్లోనే ఆరోపణలొస్తే చినరాజప్ప ఎందుకు విచారణ జరిపించలేదు?’’ అని కన్నబాబు నిలదీశారు. ‘‘మా ఎంపీ వంగా గీతా, నేను కూడా ఉన్న ఒక ఫోటో ప్రవీణ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడట. అంతమాత్రాన సంబంధాలున్నట్టేనా? చంద్రబాబుతో యూరో లాటరీ వచ్చిందని మోసం చేసిన కోలా కృష్ణమోహన్, దొంగనోట్ల కేసులో ఉన్న రామకృష్ణగౌడ్‌ దిగిన ఫోటోలుంటాయి. దీన్నిబట్టి ఆ దొంగలందరితో చంద్రబాబుకు సంబంధాలున్నట్టు భావించాలా? కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయిన అఖిలప్రియ మీ కేబినెట్‌లో మంత్రి కదా చంద్రబాబూ. అంటే ఈ కిడ్నాప్‌తో మీకు సంబంధం ఉన్నట్టేనా? విగ్రహాలు కూలదోసి జై శ్రీరాం అనడం, ఎన్టీఆర్‌ చావుకు కారణమై జై ఎన్టీఆర్‌ అనడం చంద్రబాబుకే చెల్లు. దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా ఏపీలో వైఎస్‌ జగన్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, 3వ స్థానంలో ఉంటే ఓర్వలేక టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది.’’ అని విమర్శించారు.