ఏపీలో 10-12 శాతం భూముల విలువ పెంచుతూ నిర్ణయం

ఇప్పటికే నిర్మాణ విలువలు అమాంతం పెంచిన ప్రభుత్వం

రిజిస్ట్రేషన్ ఫీజు 3 శాతం లోపుల వుండాలంటున్న కేంద్రం

గతేడాది 17 లక్షల డాక్యుమెంట్లతో 2.89 శాతమే అభివృద్ధి

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

కరోనా ఆరోగ్య సంక్షోభంతో స్థిరాస్తి క్రయ విక్రయాల్లో గడిచిన మూడు నెలల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్, మే, జూన్ నాటికి గణనీయంగా తగ్గుదల నమోదైంది. ఒక్క జూన్ నెలలోనే 75 శాతం వరకు తగ్గుదల నమోదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణ విలువలు పెంచి భూముల విలువలు కూడా పెంచాలని అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పెంచబోతున్న నిర్మాణ భూముల విలువలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుకు రాబోతుండడంతో ఇప్పటికే కరోనా లెక్క చేయకుండా మదుపుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద స్థిరాస్తి క్రయవిక్రయాలకు పోటీ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల రెవెన్యూ మంత్రులతో అనేకసార్లు సమావేశమై భారతదేశవ్యాప్తంగా యూనిఫాం రిజిస్ట్రేషన్ చార్జీలు వుండాలని ప్రతిపాదించింది.

గణనీయంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ ఫీజులు మూడు శాతం మించి ఉండరాదన్న ప్రతిపాదనలు కూడా చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మన రాష్ట్రంలో గతంలో అర్బన్ ప్రాంతంలో 13 శాతం, మున్సిపాల్టీ ప్రాంతాల్లో 12 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 11 శాతంగా వున్న రిజిస్ట్రేషన్ ఫీజులు 75 శాతంగా నేడు ప్రభుత్వం వసూలు చేస్తోంది.

పొరుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఆరు శాతం, మరికొన్ని చోట్ల ఐదు శాతానికి కూడా పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి లక్ష్యాలను 6,600 కోట్ల రూపాయలకు నిర్ణయించుకుంది. కానీ ఆచరణలో 4,882 కోట్లే సాధించింది. కిందటి ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుదల శాతం 2.89 శాతం మాత్రమే నమోదైంది. గత సంవత్సరం 17 లక్షల 2 వేల 480 రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు నమోదయ్యాయి. అత్యధికంగా విజయనగరంలో పెరుగుదల శాతం 3121గా నమోదైంది. ఇదే సందర్భంలో తరుగుదల గుంటూరులో 11.17 శాతంగా నమోదైంది. కృష్ణా జిల్లాలో సైతం గతేడాది రిజిస్ట్రేషన్ల శాఖ తరుగుదల 2.8 శాతంగా వుంది. రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ద్వారా అత్యధిక ఆదాయం గుంటూరు నుంచి 640 కోట్లు వుంది. అతి తక్కువ శ్రీకాకుళం జిల్లా నుంచి 133 కోట్లు కే పరిమితమైంది.

ఈ ఏడాది 2020-21 నాటికి లక్ష్యాలను సైతం 4,999 కోట్లకే కుదించుకుంది. దీనికి తోడు ఏప్రిల్ మాసం లాక్‌డౌన్ కొనసాగడం, కరోనా ఆరోగ్య సంక్షోభ ప్రభావం మే, జూన్ మాసంలో కొనసాగడంతో గణనీయంగా మూడు మాసాల్లో లక్ష్యాలను 50 శాతం కూడా రెవెన్యూ సాధించకలేకపోతోంది. రాబోయే రోజుల్లో ప్రజల సౌకంర్యార్థం గ్రామ సచివాలయల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ పక్క సిబ్బంది కొరత రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడి, సాంకేతికత లోపాలతో రిజిస్ట్రేషన్ శాఖ తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతుంటే కరోనా దెబ్బతో మూడు నెలలుగా ఆదాయం తగ్గడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న ఒత్తిళ్లలో అధికారులు వున్నారు. ప్రతిఏటా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు ఒకసారి భూముల విలువలు జిల్లా స్థాయి, సబ్ రిజిస్ట్రార్ స్థాయి కార్యాలయాలు అంచనా వేస్తుంటాయి.

భూముల విలువ పెంచడానికి అధికారులు కసరత్తు ప్రారంభించి తగిన ప్రతిపాదనలను శాఖాపరమైన వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల అభిప్రాయాలు, విజ్ఞప్తులను పరిగణిస్తారు. కరోనా నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆదాయాన్ని ఎలాగైనా భర్తీ చేసుకోవాలని స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కొనసాగుతున్నా భూముల విలువ పెంచి ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచనలో వుండడం గమనార్హం. రాష్ట్రంలో మార్చి 31 లోపుల స్థిరాస్తి అమ్మకందారులు గతంలో తాము కొనుగోలు చేసిన తక్కువ ధరలోని భూములను ఎక్కువ ధరకు అమ్మిన సందర్భంలో క్యాపిటల్ గెయిన్ లాంటి పన్నులు కట్టకుండా మార్చి 31లోపుల అమ్మిన భూముల సొమ్ములను మరో భూముల కొనుగోలుతో పెట్టుబడిగా పెడుతుంటారు.

కానీ కరోనా లాక్‌డౌన్లో భూములపై మదుపుదారులకు ఆదాయ పన్ను శాఖ ఎలాంటి సడలింపులు ఇస్తుందోనన్నది ఇప్పటివరకు తేలలేదు. ప్రభుత్వం ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖతో కసరత్తు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మాణ విలువలను సవరిస్తూ చదరపు అడుగు 20 రూపాయలు వున్న దానిని వంద శాతం 40 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది. ఆర్‌సీసీ భవనాలు, రేకుల షెడ్లు, మట్టితో నిర్మించిన ఇలా అన్నిరకాల నిర్మాణ విలువలను పెంచారు.

గుడిసెలను సైతం వదలలేదు. గుడిసెలు గోడలు లేకుండా వుంటే చదరపు అడుగుకు 180 రూపాయలు వున్న దానిని రూ. 170లు చేశారు. మైనర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణ విలువలు సైతం రూ. 20 నుంచి రూ. 30కి పెంచారు. నగరాల్లో ఆర్‌సీసీ శ్లాబ్ 1100 వుంటే 1140 చేశారు. అపార్ట్మెంట్ల విలువ రూ. 50లు పెంచారు. సెల్లార్ల విలువ రూ. 30లు పెంచారు. సినిమా హాళ్లు విలువ సైతం రూ. 30లు పెంచారు. జింక్ షెడ్లు, పౌల్టీలు, ఆర్‌సీసీ కప్పులు సైతం నిర్మాణ విలువలను రూ. 20కు పెంచారు. పెంచిన మార్కెట్ నిర్మాణ విలువలను ఆగస్టు 1వ తేదీ నుంచి లబ్దిదారుల నుంచి వసూలు చేయబోతున్నారు.

దీనికి తోడు మార్కెట్ భూముల విలువల పెంపుతో ఆదాయం పెంచుకునేందుకు ఆయా ప్రాంతాల వారీగా స్థానికంగా వున్న అభివృద్ది, ఆ ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని భూముల విలువ పెంచుతున్నారు. కరోనా మార్చి చివరి వారం నుంచి వెంటాడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్మాణ విలువలు, భూముల విలువలు పెంచి 1వ తేదీ నుంచివసూలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదురవుతుందనే వాదనలు కూడా వున్నాయి. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో సాధారణ ఆర్థిక సంక్షోభంతోపాటు కరోనా ఆరోగ్య సంక్షోభం తోడై రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రజలు తమ ఆదాయం మాట ఎలా వున్నా చేతిలో వున్న డబ్బును, అత్యవసరానికి మాత్రమే ఖర్చు చేసే పొదుపును కరోనా నేర్పింది. ప్రభుత్వం మాత్రం కరోనాలాంటి సామాజిక ప్రతికూల పరిస్థితులను పక్కనపెట్టి నిర్మాణ విలువ, భూములవిలువలు పెంచితే రెవెన్యూ సమకూర్చుకోవచ్చన్న ఆలోచన ఆచరణ సాధ్యం కాదన్నది స్పష్టం.

కేంద్రం ఓ పక్క రిజిస్ట్రేషన్ విలువ 3 శాతం వుండాలని చెబుతుంటే కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ విలువ, భూముల విలువ పెంచడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ, భూముల విలువ పెరగడంతో చాలా మంది స్థిరాస్తి క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేకుండా పెద్ద మనుషుల సమక్షంలో నమ్మకాల మీద తెల్ల కాగితాల మీద ఒప్పందాల జరిగిపోతున్నాయి. ప్రభుత్వం భూములు, నిర్మాణ, రిజిస్ట్రేషన్ విలువ పెంచితే ప్రభుత్వానికి అదాయం వచ్చే మాట ఎలా వున్నా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపే అవకాశముంది.

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువ, నిర్మాణ విలువ,రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెంచినా కార్పొరేట్ సంస్థకు, రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకులో రుణాలు పొందే వారికి వెనుకాడరు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంత స్థలం, సొంతింటి కల ప్రభుత్వం ధరల పెంపుతో మరింత భారం కాబోతోంది. ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, +91 94919 99678; ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)