చూస్తే తప్ప ఇదో స్వీట్ అని అనిపించదు…

0
6 వీక్షకులు

రాజమహేంద్రవరం, జనవరి 20 (న్యూస్‌టైమ్): ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్ప వీళ్లు తయారుచేస్తున్నది ఏమిటో అర్ధంకాదు. చేస్తున్నంత సేపు అందులో కొంత భాగం భలేగా ఉంటుంది. మిగతా సగం చూసేవారికే ఆశ్చర్యమేస్తుంది. కుస్తీపోటీల్లో పాల్గొనే వారు కూడా అంత కష్టపడరేమో అనిపిస్తుంది.

ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా, ఏమి చేసినా తిండి తినాల్సిందే! రకరకాల పనుల మధ్య తలమునకలయ్యే మనకు ఆహారం కేవలం జీవించటానికే కాదు; ఆహ్లాదరకంగా ఆస్వాదించటానికి కూడా! ఏదొకటి తిని పొట్ట నింపుకోవటం కాదు; నాలుక నలభై విధాలుగా అలరారాలి. ఆనందించాలి. అందుకే అనేక రుచులూ, అనేకనేక వంటకాలూ. తిండి అన్నిచోట్లా ఉంటుంది. అది ఒక్కోచోట ఒక్కో స్థానికతను అద్దుకొని మనల్ని అలరిస్తుంది. ఆంధ్రా అంటేనే భోజన ప్రియులకు కేరాఫ్‌.

అలాంటి రాష్ట్రంలో రుచికరమైన పదార్థాల గురించి ఎంత చెప్పినా తక్కువే! రాష్ట్రంలోని చాలా ఊళ్ళు ప్రత్యేక రుచులకు ట్యాగ్‌లైన్‌లుగా మారిపోయాయి. కొన్ని వంటకాలు గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలను దాటి, అంతర్జాతీయ స్థాయి కీర్తినీ గడించేశాయి. వెటకారానికి గోదావరి ఘాటు కారానికి గుంటూరు పేరు. ఆహారంలో కారం రుచి తగలాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పచ్చళ్ళు, రకరకాల నాన్‌వెజ్‌ వంటకాలూ రుచి చూడాల్సిందే! చేపలతో తయారుచేసే పులుసులు, ఫ్రై వంటకాలకు నెల్లూరుతో పాటు కృష్ణా, గోదారి జిల్లాలు ప్రసిద్ధి. రకరకాల తీపి రుచులతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆత్రేయపురం, తాపేశ్వరం, కాకినాడ, నిడదవోలులాంటి పట్టణాలు పేరుగడించాయి.

రాయలసీమ రాగిముద్ద, జొన్న రొట్టెలు, కడప ఉగ్గాణీ బజ్జీలు, ధరణి కోట పొట్టేలు మాంసంతో తయారుచేసే వంటకాలు ఇలా ఒక్కో ఊరు ఒక్కో బ్రాండు. తిరుగులేని రుచికి తిరుగులేని అడ్రస్సు. కృష్ణా జిల్లాలో తయారయ్యే పచ్చళ్ళు, రకరకాల నాన్‌వెజ్‌ వంటకాలు, పులిహోర, చక్రపొంగలి లాంటి పసందైన వంటకాలే కాదు; ఇక్కడి బందరు లడ్డూ కూడా చాలా ఫేమస్‌. బందరు లడ్డూ తయారీ ఓ ప్రత్యేకం. శనగపప్పు, బెల్లం లేదా పంచదార రోటిలో వేసి దంచుతారు.

దంచేటప్పుడు అందులో కావాల్సిన స్వచ్ఛమైన నెయ్యి, యాలకులు వంటివి కలుపుతారు. ఈ లడ్డూల తయారీలో శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు) స్వీట్స్‌, మల్లయ్య స్వీట్స్‌ చాలా ప్రసిద్ధి. ప్రముఖ సినీనటులు నందమూరి తారక రామారావు మచిలీపట్నం తాతారావు స్వీట్‌ షాపులో బందరు లడ్డూతో పాటు హల్వాను కొనుగోలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఊళ్లోనే రసాలు, బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి లాంటి మామిడి రకాలతోపాటు హిమాయతీ రకం మామిడి చాలా ప్రత్యేకం. నూజివీడు పేరు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి ఈ మామిడి రకాలే కారణమని చెప్పొచ్చు.

ఇక్కడి ఆవకాయ (మామిడికాయ) పచ్చడికి అంతర్జాతీయ గుర్తింపూ ఉంది. గోదావారి జిల్లాలనగానే మనకు పచ్చని పంటలు, కొబ్బరి తోటలు గుర్తొచ్చేస్తాయి. ఇక ఇక్కడ తయారుచేసే చేపల వంటకాలు, తీపిరుచులకు మంచి పేరు ఉండనే ఉంది. కాకినాడ కాజాకు బాగా పేరు. వీటిని తొలుత కోటయ్య అనే ఆయన తయారు చేశారు. గుండ్రని ట్యూబ్‌ ఆకారంలో ఉండటం వల్ల దీనిని గొట్టం కాజా అంటారు. మైదా పిండితో చేసే ఈ కాజా లోపలి భాగం స్పాంజిలా పొరల్లా ఉండి అందులో చక్కెర పాకం నిలువ ఉంటుంది. తాపేశ్వరం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి మండపేట వెళ్లే మార్గంలో ఉంది. ఈ ఊళ్లో తొలుత కాజా తయారుచేసిన ఘనత పోలిశెట్టి సత్తిరాజుది.

1930లో ఆయన తయారు చేసిన కాజా ఫార్ములాతో నేడు రాష్ట్ర మంతటా తాపేశ్వరం కాజాగా ఫేమస్‌ అయ్యింది. ఇందులో కృత్రిమ రంగులు గానీ, ఫ్లేవర్స్‌ గానీ ఉపయోగించరు. కండ్రిగ అనేది ఉభయ గోదావరి జిల్లాల ఫేమస్‌ స్వీట్‌. ఊరు పేరునే కోవా పేరుగా మార్చేసుకుంది. కొత్తపేట మండల కేంద్రానికి సమీపంలోని కండ్రిగ గ్రామంలో ప్రారంభమైన వ్యాపారం నేడు ఉభయ గోదావరి జిల్లాలకు పాకింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దిబ్బరొట్టె ప్రసిద్ధి. ఆ ఊరెళ్లే భోజన ప్రియుల స్థానిక మారుతీ థియేటర్‌ వద్ద తయారు చేసే దిబ్బరొట్టెలను రుచి చూడకుండా ఉండరు. అక్కడ పెనంపై రొట్టెలను వేసిన తర్వాత పైభాగంలో రేకు పెట్టి నిప్పులు వేస్తారు. రెండువైపులా ఒకేవిధంగా రొట్టె ఉడుకుతుంది.

దీంతో సరికొత్త రుచి వస్తుంది. భీమవరం నాన్‌వెజ్‌ పచ్చళ్లకు పెట్టింది పేరు. ఇక్కడ నిల్వపచ్చళ్లకు నోచుకోని నాన్‌వెజ్‌ లేదంటే లేదు. ఏదన్నా ఉంది అని ఒకమాట అని చూడండి. తెల్లారేసరికి ఆ పచ్చడి జాడీ ఒకటి సిద్ధం చేసేస్తారు భీమవరం నలభీములు. పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో సోంపాపిడి ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ సోంపాపిడిని పాలకొల్లు పట్టణంలోని ఐదు ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. సోం పాపిడిని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పాలకొల్లు నుంచి సోం పాపిడిని ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తుంటారు.

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్‌. వీటిని తయారీ ద్వారానే ఆత్రేయపురం ప్రపంచానికి సుపరిచితమయింది. పూతరేకులను కొన్ని చోట్ల పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పొరలుపొరలుగా వీటిని తయారుచేయడం ఒక కళే! పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడతారు. ఈ కుండ నున్నగా గుండ్రంగా ఉంటుంది. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. మినప, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి, మంట పెట్టి కుండను వేడెక్కిస్తారు. జాలుగా తయారు చేసిన పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుంచి మరొక వైపు లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్‌ మందంతో ఊడి వస్తుంది. దానిని రేకుగా పిలుస్తారు.

ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. నెయ్యి, బెల్లం వేసి చేసే సాంప్రదాయ పద్ధతి ఒకటైతే; పంచదార పొడి వేసి చేసే పద్ధతి ఇంకొకటి. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారు చేస్తుంటారు. అనేక ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతూనే ఉంటాయి ఈ ఊరి పూతరేకులు. కడపకు 25 కిలోమీటర్ల దూరంలో గువ్వలచెరువు ఉంది.

ఆ ఊరి పేరు చెబితే గుర్తుకు వచ్చేది పాలకోవా. ఇక్కడ తయారుచేసే పాలకోవాకు జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం గుర్తింపు ఉంది. లండన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాలు కువైట్‌, సౌదీ అరేబియా, ఖత్తర్‌, దుబాయి దేశాలకు ఎగుమతి కూడా అవుతోంది. కడప జిల్లా రామాపురం మండలంలోని బండపల్లె, హసనాపురం, సరస్వతీపల్లె, గోపగుడిపల్లె, కసిరెడ్డిగారిపల్లె, రాచపల్లె, పంచాయతీల నుంచే కాక చింతకొమ్మదిన్నె, లక్కిరెడ్డిపల్లె; చిత్తూరు జిల్లాలోని కలకడ పరిసర ప్రాంతాల్లో కోవాకు అవసరమైన పాలను సేకరించి వీటిని తయారుచేస్తారు.