‘స్వర్ణా ప్యాలెస్’ ప్రమాదానికి బాధ్యులు ఎవరు?
విజయవాడ, ఆగస్టు 9 (న్యూస్‌టైమ్): నగరంలోని స్వర్ణా ప్యాలెస్‌లో ఆదివారం జరిగిన ఘోర దుర్ఘటనకు బాధ్యులు ఎవరు? అసలు జరిగిన హోరానికి కారకులు ఎవరు? ఈ హోటల్ యాజమాన్యమా? అద్దెకు తీసుకున్న డాక్టర్ రమేష్ ఆసుపత్రి యాజమాన్యమా? రోజుకు వేల రూపాయలు రూమ్ అద్దెల రూపంలో వసూలు చేసే పరిస్థితుల్లో కొవిడ్ కేర్ కేంద్రం నిర్వహణకు అప్పగించడం వెనుక ఎవరి హస్తం ఉంది? కేవలం కరోనా లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించేందుకు ఇంత పెద్ద భారీ బడ్జెట్ హోటల్‌ను రమేష్ ఆసుపత్రి అద్దెకు తీసుకున్న నేపథ్యాన్ని ప్రస్తుతానికి పక్కనపెడితే, ఇక్కడ చికిత్సపొందుతున్న బాధితుల నుంచి ఎంతెంత వసూలు చేస్తున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు కాబట్టి పది మంది ప్రాణాలతో విపత్తుకు అడ్డుకట్టపడింది. అదే ఇంకాస్త ఆలస్యం అయి ఉంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకుంటుంటేనే భయమేస్తోంది. హోటల్లో 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం.
వీరిలో 30 మంది కొవిడ్ బాధితులు కాగా 10 మంది ఆసుపత్రి సిబ్బంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు వెల్లడించారు. దట్టంగా అలుముకున్న పొగవల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేశారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి. ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు కిందకి దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని, షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని చెప్పారు. దీంతో నిచ్చెనల ద్వారా బాధితులను కిందికి దించి ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
కాగా, ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అంతకముందు ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు, ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు.
అగ్ని ప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం తెలిపారు. హోటల్‌ను ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని వివరించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడ్డారన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు.
ఘటన జరిగిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు. అగ్నిప్రమాద స్థలిని మంత్రులు సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో నాని మాట్లాడారు. ‘‘తెల్లవారుజామున 4.30-5.00 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద సమయంలో భవనంలో 43 మంది ఉన్నారు. వీరిలో 30 మంది కొవిడ్ రోగులు ఉన్నారు. 20 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదు’’ అని ఆళ్లనాని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లాంటి విషయాలను కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షించిన అనంతరం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాద ఘటనపై నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరోవైపు, హోటల్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చిన తరువాత శానిటైజర్స్ వినియోగం పెరిగినట్టు అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదంపై ఫైర్, విద్యుత్ శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. లోపలి వైరింగ్ వలనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని విద్యుత్ శాఖ అంటోంది.
ఇక ఫైర్ సేఫ్టీ నిబంధనలను హోటల్ నిర్వాహకులు పాటించడం లేదని అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనపై అగ్నిమాపక శాఖ ఓ నివేదికను ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. ఈ ప్రమాదంలో డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58), పూర్ణ చంద్ర రావు, మొవ్వ, సుంకర బాబురావు, సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై), మజ్జి గోపి, మచిలీపట్నం, సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు, వెంకట లక్ష్మి సువర్చలా దేవి, (జయ లక్ష్మి) కందుకూరు, పవన్ కుమార్, కందుకూరు, అబ్రహం, చర్చి ఫాథర్, జగ్గయ్య పేట, రాజకుమారి అబ్రహం, జగ్గయ్యపేట, రమేష్, విజయవాడ మృత్యువాతపడ్డారు.
ఇదిలావుండగా, ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. స్థానిక ఎమ్మార్వో జయశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపబోతున్నట్లు వారు తెలిపారు. అయితే శానిటైజర్ వలనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. అలాగే కరోనా ట్రీట్మెంట్కి పర్మిషన్ లేనట్లు గుర్తించిన పోలీసులు, దానిపై కూడా విచారణ జరపనున్నారు. రమేష్ ఆసుపత్రి చేస్తున్న ట్రీట్మెంట్ వ్యవహారంపై కూడా విచారణ కొనసాగుతోంది.
కాగా స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్‌కి అనుమతి తీసుకోలేదని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేశారని, హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా ఈ తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డ విషయం తెలిసిందే. స్వర్ణ ప్యాలస్ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ‘‘10 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాద బారినపడటం అత్యంత విషాదం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పవన్ పేర్కొన్నారు.
రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.