ప్రతి ధాన్యపు గింజనూ కొనే బాధ్యత ప్రభుత్వానిదే!

0
7 వీక్షకులు

ఖమ్మం, ఏప్రిల్ 10 (న్యూస్‌టైమ్): రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని, అందుకు ప్రభుత్వం అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలంలోని పెద్ద బీరపల్లి, కల్లూరుగూడెం, మార్లపాడు, వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు దళారులు కొనకూడదనే భావంతో ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలని సంకల్పంతో సూక్ష్మస్థాయిలో విరివిగా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

మక్కలు కొనుగోలు కోసం ప్రభుత్వం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలో 88 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 2.34 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయిందని, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుండి ఇప్పటికే 40లక్షల గన్నీ బ్యాగులు వచ్చాయని అన్నారు. మిగత వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పీఏసీఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర1760/- చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదేనని అన్నారు.

సేద్యానికి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృశ్య రైతులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, మనిషికి మనిషికి మధ్య మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్నారు. కరోనా వ్యాప్తిని రాష్ట్రంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్ పొడగింపుకు మించిన మార్గంలేదని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారని, లాక్‌డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య అని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయని ప్రజలందరూ సామాజిక/భౌతిక దూరం తప్పక పాటించాలన్నారు. వైరస్‌ను సమూలంగా తుదముట్టించే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, మార్కుఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ నిర్మల, మార్కుఫెడ్ జీఎం సుధాకర్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here