‘జై అనకాపల్లి సేన’ అధ్యక్షుడు కొణతాల సీతారాం

సూటిగా ప్రశించిన కొణతాల సీతారాం…

విశాఖపట్నం, జనవరి 27 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరపాలని, అందుకు గాను పంచాయితీలకు జనాభా వారీగా నజరానా ప్రకటించడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ‘జై అనకాపల్లి సేన’ అధ్యక్షుడు కొణతాల సీతారాం తప్పు పట్టారు. బుధవారం అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న నమ్మకం లేకనే ప్రలోభాలకు గురిచేసే ఉత్తర్వులు జారీ చేశారా? అని సీతారాం ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా ప్రశించారు.

ఏకగ్రీవాలు జరగడం మంచిదే అయినప్పటికీ ప్రభుత్వం నజరానాలు ప్రకటించడం ప్రలోభాలకిందే వస్తుందని, దీన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర మంత్రులు గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలని మాట్లాడుతున్నారని దీన్ని బట్టి గమనిస్తే ఎన్నికలు జరిగితే ఏదో విధంగా శాంతి భద్రతల అదుపు తప్పేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలికి ప్రభుత్వం హుందాగా ఎన్నికలను జరిపించాలని కోరారు. అలాగే ఏకగ్రీవ ఎన్నికల ప్రకటనలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి ప్రభుత్వంపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కొణతాల సీతారాం డిమాండ్ చేశారు.