నేటి కాలానికి సూటైన నేత జగన్

0
16 వీక్షకులు
  • సుభిక్షపాలనలో భాగస్వామ్యం పొందడం వరమే

  • అభినందన సభలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఏపీఎంవీపీసీ ఆధ్వర్యంలో ఘన సత్కారం

గుంటూరు, జూన్ 27 (న్యూస్‌టైమ్): ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వంతో ప్రజలకు మేలు జరుగుతుందని, నేటి కాలానికి సూటైన రాజకీయ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఇటీవల నూతనంగా మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఏపీ రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ (ఏపీఎంవీపీసీ) ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కారించారు.

స్థానిక రామన్నపేటలోని ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన సభకు ఏపీఎంవీపీసీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుత పాలనలోనే పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహమివ్వడంలో ముఖ్యమంత్రి నిర్ణయాలు వేగవంతంగా అమలవుతున్నాయని వివరించారు.

సీనియర్ నేతలు, మేధావుల సమక్షంలో మద్యవిమోచన ప్రచార కమిటీ తనకు ఇంతటి ఊహించని సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మద్య విమోచన ప్రచార కమిటీకి తనవంతు సలహా సూచనలిచ్చి సహకరిస్తామని హామినిచ్చారు. కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశచరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా శాసనమండలి పదవిని డొక్కా మాణిక్యవరప్రసాద్ తృణప్రాయంగా త్యాగం చేశారన్నారు. అంతటి త్యాగాన్ని గుర్తించి మరలా అదే పదవిని ఆయనకే కేటాయించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనాదక్షతకు నిదర్శనమని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల రాజ్యాధికార సాధన దిశగా ముఖ్యమంత్రి ఆలోచన సాగించడం శుభపరిణామ చరిత్రగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సామాజిక స్పృహతో పాటు రాజకీయ నీతిజ్ఞులుగా డొక్కా మరిన్ని పదవులు అలంకరించాలన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా మట్లాడుతూ తాడికొండ కేంద్రంగా వరప్రసాద్‌తో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

గుంటూరు వ్యవసాయ మిర్చి మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ భవిష్యత్తులో డొక్కాను మరోమారు మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. వైసీపీ గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల నేతగా వరప్రసాద్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేయడం పార్టీకి గర్వకారణమన్నారు. పెద్దల సభలో బహుజన గళంగా వరప్రసాద్ ఉంటారని ప్రముఖ విద్యాసంస్థల అధినేత కన్నా మాష్టారు అన్నారు. విలువలు పాటించే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోన్న కొడుకుగా మాణిక్యవరప్రసాద్ రాజకీయ పదవుల్లో మణిమాణిక్యమవుతారని జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ విజయ సారథి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను లక్ష్మణరెడ్డి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here