విజయవాడ, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): అమరావతే రాజధాని అని, అందుకు తాము వ్యతిరేకం కాదు అని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు అంటూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్నికల ముందు ప్రజారాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, ఎందుకు మారుస్తాం, అమరావతే రాజధాని, వ్యతిరేకం కాదు, ఇక్కడే నిర్మించి తీరుతాం, తాడేపల్లి రాజగృహ ప్రవేశం చేశాం, మారిస్తే రాజీనామా చేస్తాం, రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న నాటి మీరు, మీ నాయకుల వంచన మాటలకు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? జగన్‌ గారు’’ అంటూ ప్రశ్నించారు.

మూడు రాజధానులు వైకాపా పతనానికి నాంది అని విమర్శించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వం గవర్నర్‌పై వత్తిడి చేసిందని వ్యాఖ్యానించారు. భాజపా నేతలు అమరావతికి అనుకూలం అంటూనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమంటూ కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారన్నారు. కేంద్రంలోని భాజపా అండదండలు లేకుండా రాజధానిని తరలించే సాహసం జగన్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. కక్ష పూరిత రాజకీయాల పక్షమో, అయిదు కోట్ల మంది ఆంధ్రుల పక్షమో భాజపా నేతలు తేల్చుకోవాలన్నారు. అయిదేళ్లు గడిచాక రాజధాని అమరావతిని తరలించడం దుర్మార్గమన్నారు. ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారని, చివరకు ఒక్క స్థానం మిగిలే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. జగన్‌ మొండి వైఖరి వీడి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని హితవు పలికారు.

మరోవైపు, అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో ‘రాఖీ ప్రొటెస్ట్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా జేఏసీ నాయకురాలు దుర్గాభవాని మాట్లాడుతూ అన్నగా, తమ్ముడిగా ఆదుకోవాల్సిన వారే… మాట తప్పి మహిళలతో కన్నీరు పెట్టించారన్నారు. రాఖీ పండుగ రోజున అయినా సోదరీమణుల ఆవేదన అర్ధం‌ చేసుకోవాలన్నారు. సోదరులైన ప్రధాని, సీఎం జగన్‌లు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. తాము సీఎం కలిసి విజ్ఞప్తి చేసే పరిస్థితి లేదు.. అపాయింట్మెంట్ ఇవ్వరు కాబట్టే ఆయన ఫోటోకు రాఖీలు కట్టి తమ ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరుతున్నామని దుర్గాభవాని పేర్కొన్నారు.

రాఖీ పండుగ సమయంలో రాజధాని మహిళలు రోధిస్తున్నారని మహిళా జేఏసీ నాయకురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన స్వార్ధం కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములు కొట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేకుంటే‌‌‌ మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మోదీ, జగన్‌లు చరిత్రకారులుగా ఉండాలే తప్ప, చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని అందుకే సోదరులుగా భావించి వారి ఫోటోలకు రాఖీలు కట్టామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here