ధాన్యం సేకరణలో ఉమ్మడి నల్గొండ ఫస్ట్

0
11 వీక్షకులు
మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో సూర్యపేట జిల్లాలో దిగుబడి ముందెన్నడూ ఊహించని రీతిలో రికార్డ్ అయిందని ఆయన చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రుల శ్రమ దాగి వుందని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. గురువారం మధ్యాహ్నం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై గ్రామాల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము ధాన్యం కొనుగోళ్లలో ముందుంటే అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉండడం విశేషమని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగితే అందులో అయిదు లక్షల మేర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన జిల్లాలుగా ఉమ్మడి నల్గొండ నిలిచిందన్నారు. వ్యవసాయ శాఖా చరిత్రలోనే యిది మొదటిసారి అని ఆయన ప్రకటించారు. కొనుగోళ్లలో ప్రభుత్వం పోటీకి దిగడంతో రైతుకు మద్దతు ధర లభించిందన్నారు. ముమ్మాటికి యిది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతగా ఆయన అభివర్ణించారు. దానికి తోడు సూర్యపేట జిల్లాలో అదీ యాసంగి పంటలో ఇంతటి దిగుబడి రావడానికి కాళేశ్వరం రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన వరమే సూర్యపేట జిల్లాలో ధాన్యపు రాశులు పొగయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

గోదావరి జలాలు పరుగులు పెట్టడంతో సమృద్ధిగా పంటలు పండించుకొని దిగుబడిలో రికార్డులు సృష్టించిన రైతాంగం సంబురాలు చేసుకునే తరుణంలో కరోనా వైరస్ ప్రబలడం మన దురదృష్టం అన్నారు. అదే సమయంలో గన్ని బ్యాగులను ఎప్పటికప్పుడు ఐకేపీ కేంద్రాలకు తరలించడంతో పాటు రైస్ మిల్లర్స్‌తో అధికారులు జరిపిన సమన్వయం కూడా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరగడానికి దోహదపడిందన్నారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని మిగితా ధాన్యం కొనుగోళ్లు జరిపేల దృష్టి సారించాలని ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here