జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన కేంద్ర సామాజిక న్యాయ, యువజన వ్యవహారాల శాఖ మంత్రి రాందాస్ అథ్వాలేను అభినందిస్తున్న సురేంద్రబాబు బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్ 1 (న్యూస్‌టైమ్): కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రశ్నార్ధకంగా మారిన మీడియా రంగం సమస్యలు, వాటిల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్సు అసోసియేషన్ రెండో విడత ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తోంది. దీనిలో భాగంగా మంగళ, బుధవారాలలో కేంద్ర సమాచార, ప్రసార, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సామాజిక న్యాయం, యువజన వ్యవహారాలు, బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు వినతి పత్రాలు అందజేసింది. సంఘం జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత అంతర్జాల, సామాజిక మాధ్యమాల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేంద్రబాబు బండి నాయకత్వంలోని ప్రతినిధి బృందం రెండు రోజుల పాటు శ్రమించి కరోనా వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలతో పాటు ఆర్ధిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది.

దేశవ్యాప్తంగా జర్నలిస్టులను కరోనా వారియర్సుగా గుర్తించి కొవిడ్-19 బీమా సదుపాయాన్ని వర్తింపజేయాలన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, త్వరలో దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూల నిర్ణయాన్ని ప్రకటించనున్నారని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్సు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత అంతర్జాల, సామాజిక మాధ్యమాల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేంద్రబాబు బండి తెలిపారు. కేవలం జర్నలిస్టుల సంక్షేమం, ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తమ ప్రయత్నం గత ఆరు మాసాలుగా నిరాటంకంగా సాగుతోందని, అందులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వరకు కొన్ని కార్యక్రమాలను అమలుచేసేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టుల మెడిక్లయిమ్ పాలసీని, హెల్త్ ఇన్స్యూరెన్సు పునరుద్దరించి, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆయా సదుపాయాలను కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత, బీమా, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలన్న తమ వినతి పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారన్నారు.

కరోనా వచ్చి వైద్యం చేయించుకుంటున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్‌కు నెలకి 10,000 ఆర్ధిక సహాయం అందించాలని, పలు డిమాండ్లను సురేంద్రబాబు తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది క్రితం వరకూ అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల మెడిక్లయిమ్ పాలసీని, 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్స్యూరెన్సు పునరుద్దరించి, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆయా సదుపాయాలను కల్పించాలని, మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్‌ కార్డులను కేవలం బస్ పాస్‌ల కోసమో, రైల్వే పాస్‌ల కోసమో ఇస్తున్నామన్న భావన నుంచి బయటకువచ్చి వాటి ద్వారా ఆయా ప్రతినిధులకు ఆర్ధిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయపడింది. గతంలో ప్రకటించిన మాదిరిగా రిటైర్డ్ జర్నలిస్ట్‌లకు పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ఆర్ధిక ఆసరా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కరోనావైరస్ కష్టాలు మీడియా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని, అయితే, ఈ మధ్య జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ, బీమా రక్షణ వంటి కార్యక్రమాలు సక్రమంగా అమలుజరగడం లేదన్నారు. ‘‘కరోనా విపత్తు నేపథ్యంలో కూడా ప్రభుత్వం కనీసం వాటి పునరుద్దరణ, అమలుపై దృష్టిపెట్టని ఫలితం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులకు మరణశాపంగా మారింది. సహజంగా ప్రతి పాత్రికేయుడు విధి నిర్వహణలో ముందుండాలని, తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని ముందుగా వార్తల రూపంలో అందించాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అనేకమంది మిత్రులు ప్రాణాంతకమని తెలిసినా రిస్కు ఫేస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో జర్నలిస్టు సోదరులు కరోనా వైరస్ బారిన పడటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కరోనాపై ప్రత్యక్ష పోరులో మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాలలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది.’’ అని పేర్కొన్నారు.

కరోనా వారియర్సు (వైద్యులు, పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు)కు అమలుచేస్తున్న కొవిడ్-19 బీమాను వర్కింగ్ జర్నలిస్టులకు కూడా వర్తింపజేసి, కష్టాల్లో ఉన్న మీడియా రంగాన్ని ఆదుకునేందుకు ఆర్ధిక ఉద్దీపన పథకాన్ని అమలుచేయాలని, జీవితాలకు భరోసా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత, బీమా, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలని కోరుతున్నామన్నారు. కరోనా వారియర్సు (వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుధ్య కార్మికుల) జాబితాలో మీడియా ప్రతినిధులను చేర్చకపోవడం వల్ల జరిగిన నష్టం ఎలా ఉంటుందో చనిపోయిన జర్నలిస్టుల దారుణాన్ని చూస్తే మరోసారి అర్ధమవుతుంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం జర్నలిస్టులని ఆదుకోవాలని, అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద 50 లక్షల కొవిడ్-19 బీమా సౌకర్యాన్ని పోలీసులకి, డాక్టర్లకు ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, జర్నలిస్టుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, కరోనా వచ్చిన జర్నలిస్టులకు వైద్యం చేయించుకుంటున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వాలని, కరోనా సమయంలో ప్రతి జర్నలిస్ట్‌కు నెలకి 10,000 ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.