వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌!..

గుర్తించి ఉత్తర్వులు జారీచేసిన ఉత్తరాఖండ్..

డెహ్రాడూన్, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ వ్యాప్తి, నేషనల్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా కొన్ని రంగాల వారిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మీడియా ప్రతినిధులను కనీసం పట్టించుకోలేదు. అయితే, ఆలోటును తీర్చినట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి, వయసుతో సంబంధం లేకుండా కోవిడ్-19 వ్యాక్సిన్‌ వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీచేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. రెండో దశ కరోనా విజృంభణ నేపథ్యంలోనూ కేంద్రం ఇప్పటికీ మీడియా ప్రతినిధులను కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించేందుకు సంసిద్ధత వ్యక్తంచేయడం లేదు.

‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెతలా కేంద్రమే గుర్తించనప్పుడు తాముందుకు గుర్తిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాలూ జర్నలిస్టులను విస్మరించాయి. కరోనా నిర్ధరణ పరీక్షల దగ్గర నుంచి వ్యాక్సినేషన్ వరకూ తెలుగు రాష్ట్రాలలో అయితే, మరీ దారుణంగా మీడియాను పక్కనపెట్టిన ప్రభుత్వాలు కూరలో కరివేపాకులా తమ అడ్డగోలు ప్రచారానికి మీడియాను వాడుకోవడం తప్ప జర్నలిస్టులను గుర్తించే విషయంలో కాలయాపన చేస్తూనే వస్తున్నాయి. జర్నలిస్టులందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను చూసైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కళ్లు తెరుస్తారేమో చూడాలి.

‘‘కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న జర్నలిస్టులకు అండగా ఉంటాం. జర్నలిస్టులందరికీ వయసుతో సంబంధం లేకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తాం’’ అని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. ఔను.. రావత్ అన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవం. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు నిరంతరం విధులు నిర్వర్తిస్తూ చివరికి తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి, ప్రాణాలకు తెగించి కూడా ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేస్తూ, వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో కొంత మంది మిత్రులు మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇవన్నీ గుర్తించిన క్రమంలోనే జర్నలిస్టుల సేవలను గుర్తించి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మీడియా ప్రతినిధులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తుండగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. భారత్‌లో 27వ రాష్ట్రంగా 2000 నవంబర్ 9న ఏర్పాటైన ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలోని కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రఖ్యాత ఆథ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు నిలయం కూడా.

2006 వరకు ఉత్తరాంచల్‌గా ప్రాచుర్యంలో ఉన్న ఉత్తరాఖండ్ అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని వేసవి రాజధానిగా తీర్చిదిద్దారు.