కరోనాపై జర్నలిస్టుల నృత్య కదనం

327

ఏలూరు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ (కొవిడ్-19) నియంత్రణోద్యంలో ప్రభుత్వానికి బాసటగా నిలిచిన జర్నలిస్టులు తమ రాతలు, వీడియోల ద్వారా ప్రజలలో అవగాహన పెంచడమే కాకుండా తమలో నిగూఢంగా దాగి ఉన్న కళ ద్వారా చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాత్రికేయ మిత్రులు. కరోనా వ్యాప్తి, ఈ మహమ్మారి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను జనంలోకి తీసుకువెళ్లేలా వీరు రూపొందించిన కరోనా అవగాహనా నృత్య గీతం ప్రస్తుతం మీడియా వర్గాలలో హల్‌చల్ చేస్తోంది.

జర్నలిస్టులే నటించి, చిత్రీకరించి, ఎడిట్ చేసిన ఈ వీడియో సాంగ్‌ను కొవ్వూరు డీఎస్‌పీ రాజేశ్వరరెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో సి.ఐ.లు ఆకుల రఘు, రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, మండల అభివృద్ధి అధికారి మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) పూర్వ అధ్యక్షుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యుడు డి. సోమసుందర్ తదితరులు పాల్గొని కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా ప్రతినిధులు చేసిన కృషిని అభినందించారు.

అత్యుత్తమ నాణ్యతతో ఎడిట్ చేసిన ఈ వీడియో గీతానికి యూట్యూబ్ మంచి ర్యాంక్‌నే ఇచ్చింది. సెర్చింజన్లలో కూడా ఈ గీతం చూపరుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం విశేషం. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోనే కాకుండా మొబైల్ వీక్షకుల పరంగా ఈ వీడియో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.