సందర్భానుసారం వాడిన ఈ చిత్రం.. ‘ఈనాడు’ సౌజన్యం

ప్రధాన పత్రికల్లో కీలక మార్పులు…

రోనా వైరస్‌ని బూచిగా చూపి తెలుగు మీడియాలో జర్నలిస్టులు, ఇతర సిబ్బందిపై మొదలైన ‘వేటు’ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తూ బాధిత జర్నలిస్టులే సోషల్‌ మీడియా వేదికగా ఈ తరహా ఆవేదన వెల్లగక్కుతుండడం గమనార్హం. వ్యవహారం బయటకు పొక్కడంతో కొన్ని మీడియా సంస్థలు ‘డ్యామేజ్‌ కంట్రోల్‌’ చర్యలకు దిగాయి. మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం, తమ పని తాము చేసుకుపోతున్నాయి ‘వేటు’ విషయంలో.

క, తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనం ప్రకారం, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సహా పలు ప్రధాన మీడియా సంస్థల్లో ఇంకా ‘వేటు’ వ్యవహారం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ‘వేటు’ దిశగా ఇప్పటికే నిర్ణయాలు జరిగినా, ప్రస్తుతానికి ‘హోల్డ్‌’లో పెట్టారని తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఇంకో సోషల్‌ మీడియా పోస్ట్‌ దర్శనమిస్తోంది. మరోపక్క, ఆంధ్రజ్యోతికి సంబంధించి మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనం నిజమేనట. దాదాపు 100 మందిని ఆ మీడియా సంస్థ తొలగించిందని చెబుతున్నారు. వున్న సిబ్బంది వేతనాల్లోనూ కోత విధించారట.

కొందరికి ‘ప్యాకేజీ’ల పేరుతో కామప్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా వైరస్‌ అనేది కేవలం ఓ ‘కుంటి సాకు’ మాత్రమేననీ, సిబ్బందిని తగ్గించుకునే దిశగా దాదాపు అన్ని మీడియా సంస్థలూ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనాగానీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం, మీడియా విలువల కోసం పదే పదే మాట్లాడే మీడియా సంస్థలు, వాటి అధిపతులు కష్ట కాలంలో తమ ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం. ఎన్నో ఏళ్ళుగా ఆయా సంస్థల్ని నమ్ముకున్నవారిని యాజమాన్యాలు నట్టేట్లో ముంచడాన్ని సీనియర్‌ జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సందర్భానుసారం వినియోగించిన చిత్రం

ప్పటికే రాష్ట్రంలోని 3 ప్రధాన పత్రికలు పోటా పోటీగా తమ జిల్లా ఎడిషన్లను తొలగించాయి. అయితే, ఈ నెల ఆఖరుకు యాజమాన్యాలు క్షేత్ర స్థాయిలో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి ప్రస్తుత అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) మేరకు ఒక్కో నియోజక వర్గ పరిధిలో ఒక రిపోర్టర్‌ను మాత్రమే ఉంచేలా మార్పులను చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మండలాల్లో రిపోర్టర్లమని చెప్పుకొనే ఎందరో మిత్రులు ఇంటి దారి పట్టనున్నారు.

లాగే, జిల్లా కేంద్రాలలో రిపోర్టర్ల కేటాయింపు విషయానికి వస్తే 2 లేదా 1గా ఏర్పాటు చేసుకోనున్నట్లు సమాచారం. ఇక పై జర్నలిస్ట్ కావాలనుకునే వారు మండల స్థాయిలో ఇంటర్, జిల్లా స్థాయిలో డిగ్రీ ఉండాల్సిందే అనే విషయం జీఓ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విలేకరులకు మరో 3 నెలల అరణ్య, అజ్ఞాత వాసాలు తప్పవనే వినికిడిలు వినిపిస్తున్నాయి.

తాజా పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా జర్నలిస్టుల బతుకులు తయారయ్యాయనే చెప్పాలి. కరోనాకు ముందు అంతంత మాత్రంగానే గడిచిన జీవితాలు ఇప్పుడు మరింత చిన్నాభిన్నమయ్యాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో లైన్లలో నిలబడి నిత్యావసరాలు దాతల నుండి తీసుకోవలసిన దుస్థితి! ఉద్యోగాలు ఊడుతున్నాయి. పెద్ద పత్రికల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ మీడియా సంస్థలదే హవా, కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్య తరహా పత్రికా విలేకరుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

రోనా కారణంగా క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్టుల జీవితాలు ఛిద్రమయ్యాయి. వైట్ కాలర్ జాబ్ అని మురిసిపోవడం తప్ప జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి మామూలు రోజుల్లోనే అంతంత మాత్రంగా ఉంటుంది. పెద్ద పేపర్లు, న్యూస్ ఛానల్స్‌లోనూ, అధికార పార్టీ మీడియా సంస్థల్లోనూ పని చేసే జర్నలిస్టులకు ఏ లోటూ ఉండదు. చిన్న, మద్యతరహా పత్రికలు, ఛానల్స్‌లో పని చేసే వారి పరిస్థితి మామూలు రోజుల్లోనే ఆర్థికపరంగా కటకటలాడుతూ ఉంటుంది. కరోనా కారణంగా కొన్ని పత్రికలూ, ఛానల్స్ మూతపడ్డాయి. మరికొన్ని ప్రతిష్ఠ కోసం, సెంటిమెంట్ కోసం నడపబడుతున్నప్పటికీ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. అయితే, వృత్తితో ఎంతో కాలంగా బంధం పెనవేసుకుని పోవడం వల్ల జర్నలిస్టులు ఉన్న ఉద్యోగాలను వదులు కోలేక జీవనం సాగిస్తున్నారు.

రోనా కాటుకు ఒక్క హైదరాబాద్‌లోనే మరణించిన జర్నలిస్టుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. రాజకీయ నాయకులు సంతాపాలు తెలపడం తప్ప వార్తా సేకరణ రంగంలో ఉన్న వారి భద్రత కోసం చేసిందేమీ లేదు. సంతాప ప్రకటనలు జారీ చేయడానికి మాత్రం పోటీ పడుతుంటారు. లాక్‌డౌన్ కాలంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నప్పటికీ, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిజం నిష్టూరమన్న సామెత జర్నలిస్టులకు అక్షరాలా వర్తిస్తుంది. వార్త నిప్పు లాంటిది. దానిని ఎంత కాలం కప్పిపుచ్చలేమన్న మౌలిక సూత్రం ఉగ్గుపాలతో ఒంట పట్టించుకున్న జర్నలిస్టులు ఎటువంటి బెదిరింపులకూ, ఒత్తిళ్లకూ లొంగకుండా తాము సేకరించిన వార్తలను తమ సంస్థలకు పంపుతూ ఉంటారు. కరోనా కేసుల విషయంలో జర్నలిస్టులు చాలా నిష్పక్షపాతంగా వార్తలు సేకరించి సమాజానికి వాస్తవాలను అందించారు. ఈ క్రమంలో వారు కొన్ని సందర్భాలలో అధికార పార్టీ నాయకుల ఆగ్రహానికి సైతం గురయ్యారు.

మాజంలో వివిధ వర్గాలకు రక్షణ ఉంది. జర్నలిస్టులకు మాత్రం లేదు. ఎవరికి కోపం వచ్చినా ఉరుముఉరిమి మంగలం మీద పడినట్టు జర్నలిస్టులపై పడుతూ ఉంటారు. అయితే, పరిస్థితులు గతంలో కన్నా మారిన మాట మాత్రం నిజం. వార్తను వార్తగా రాయాలనే నిబద్దత గల జర్నలిస్టులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అయితే, పార్టీల వారీగా పత్రికల, ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొని రావడం వల్ల వార్తా ప్రమాణాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్న మాట వాస్తవం. కానీ, పార్టీల వారీగా సమీకరణ అయిన మీడీయా సంస్థల్లో పని చేసే వారికి యాజమాన్యాల నుంచి ఆర్థికంగా మంచి సహకారం లభిస్తోంది. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. గత ఏడాది జూన్‌లో కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఒక జర్నలిస్టు దయనీయ గాధ వింటే క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్టుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. ఆ ఆసుపత్రిలో కరోనా చికిత్సకు సరైన సౌకర్యాలు లేవనీ, కిట్లు లేవనీ, కనీసం రోగిని పలుకరించేవారు కూడా లేరని అతడు అన్న చివరి మాటలను ఉటంకిస్తూ అతడి సోదరుడు చెప్పిన విషయాలను వింటే హృదయం ద్రవించిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటి ఘటనలు ఎన్నో.

హానగరంలో పని చేసే జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక, గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పని చేసే జర్నలిస్టుల పరిస్థితి ఇంకా హృదయ విదారకంగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంబంధిత మంత్రి, అధికారులు జర్నలిస్టులు తమకు అందిన సమాచారాన్ని సరిచూసుకుని తమ మీడియా సంస్థలకు పంపాలని హితబోధ చేస్తుంటారు. సరిచూసుకోవడానికి ఏ స్థాయిలోనూ జవాబుదారీ వ్యక్తులు ఉండరు. వార్త సేకరించడానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితులలో జర్నలిస్టులు సంబంధిత అధికారులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడితే తెల్లారిపోతుంది. అయినా ప్రచార, ప్రసార మాధ్యమాల పోటీ పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులలో వార్తను సరి చూసుకోవడం అనేది జర్నలిస్టులకు పెను సవాల్‌గా తయారైంది. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జబ్బుకు గురయిన వారి నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్న ఫీజుల గురించి మొదట్లో సమాచారం అందించిన పత్రికలు, మీడియా సంస్థలపై గుర్రు పెంచుకున్న ఆ సంస్థల యాజమాన్యాలు ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగేసరికి మారు మాట్లాడలేకపోతున్నాయి. నిజానికి కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్‌లో కరోనా పరీక్షలకూ, చికిత్సలకూ భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసిన సంస్థల్లోనే ఇప్పటికీ అదే ప్రకారం భారీ ఎత్తున వసూళ్ళ దందాలు సాగుతున్నాయి. వీటి గురించి మొదటగా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది అధికార పార్టీ అనుబంధ మీడియా సంస్థల విలేఖరులు కాదు, అతి సామాన్య, మధ్యతరగతి మీడియా ప్రతినిధులే. ముందుగా చొరవ తీసుకున్నది వారే. ఈ క్రమంలో కొందరికి బెదరింపులు కూడా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అయితే, వృత్తి ధర్మానికి అంకితమైన జర్నలిస్టులు ఎవరి ఒత్తిళ్ళకూ, బెదరింపులకూ లొంగకుండా తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. కరోనా కాలంలో ఈ తరహా జర్నలిస్టుల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లోటు పాట్లనూ, బలహీనతలను కరోనా బయటపెట్టింది. ఆసుపత్రుల్లో పరిస్థితుల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలను తవ్వి తీసి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది చిన్న, మధ్య తరహా మీడియా సంస్థల ప్రతినిధులే. ప్రభుత్వం నుంచి ఎటువంటి మెప్పునూ, ప్రతిఫలాన్నీ ఆశించకుండా మీడియా సంస్థలను ఒక సంప్రదాయంగా నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రజల అండదండలే దన్ను. అందుకే, ప్రభుత్వ నుంచి సరైన సహకారం అందినా, అందకపోయినా, ప్రజలతో తమకు ఉన్న చిరకాల బంధాన్ని కాపాడుకునేందుకు చిన్న, మధ్యతరగతి మీడియా సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వాటి దోవలోనే ఆయా సంస్థల సిబ్బంది వార్తా సేకరణలో నిష్పక్ష వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మీడియా సంస్థల్లో సిబ్బంది కరోనా కాలంలో పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినట్టు లేదు. కనీసం ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం నుంచి సరైన సహకారం, పరిహారం అందలేదు. ఇది అధికార పార్టీల వారూ, ప్రభుత్వాలు సిగ్గు పడాల్సిన విషయం.

ధికార పార్టీ ప్రాపకంలో నిర్వహించే మీడియా సంస్థలలో జర్నలిస్టులు, మీడియా ఫొటోగ్రాఫర్లు ప్రభుత్వ అధికారులు అందించే సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాయి. రెండో వెర్షన్ ప్రజలకు తెలియజేయడం లేదు. రెండో వెర్షన్‌ను తెలియజేస్తున్నది చిన్న, మధ్యతరగతి మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులే. ఇప్పుడే కాదు ఏ సంక్షోభం ఎదురైనా ప్రాణాలకు తెగించి వార్తా సేకరణ జరిపి సమాజానికి వాస్తవాలను తెలియజేస్తున్నది వృత్తి ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్న జర్నలిస్టులే. ఎవరి గుర్తింపు కోసమో, మెహర్బానీ కోసమో కాకుండా తమ ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్న జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. వారి వల్లనే సమాజానికి వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ, వీరిని గుర్తిస్తున్నది ఎవరు? చివరికి వీరిని ‘కార్డు’ ఇచ్చి గుర్తించేందుకు ప్రభుత్వాలు కూడా ఆసక్తిచూపించడం లేదు. ‘అక్రిడిటేషన్’ జారీ ద్వారా జర్నలిస్టులను గుర్తించాల్సింది పోయి మీడియా సంస్థలను గుర్తించే పనిలో పడుతున్నాయి ప్రభుత్వాలు. అలాంటప్పుడు పనిచేసే జర్నలిస్టుకు అర్హత, అనుభవం ఉందా? అని అడిగే అధికారం ఆయా ప్రభుత్వాలకు ఎక్కడిది? ఇలాంటివన్నీ తప్పంటే ప్రభుత్వానికి, అధికారులకూ కోపం రావచ్చు గానీ, జర్నలిస్టుల జీవితాలతో ఒకపక్క యాజమాన్యాలు ఆడుకుంటుంటే ఇంకోవైపు, నిబంధనల పేరిట ప్రభుత్వం బంతాట ఆడుకోవడం న్యాయం కాదేమో.

ర్నలిస్టులను ఉద్దరిస్తామంటూ పుట్టుకొచ్చిన, ఇంకా వస్తున్న సంఘాలేవీ కూడా ఇలాంటి మౌలిక విషయాలను కనీసం పట్టించుకోవు. వాళ్లకు ఎప్పుడూ సభ్యత్వాల కలెక్షన్, ఐడీ కార్డుల పేరిట వసూళ్లు, నాయకులుగా చలామణి అయ్యేందుకు అవసరమయ్యే విజిటింగ్ కార్డుల్లో, లెటర్ హెడ్‌లలో పదవులు, తమ సొంత పత్రికలకు, సంఘాలకు ప్రకటనల కోసం పైరవీలు.. ఇంతకంటే వాళ్లకు వేరే లక్ష్యాలంటూ ఏమీ లేవన్నది వాస్తవ పరిస్థితులు గమనిస్తుంటే అర్ధమవుతోంది. కోర్టు కేసు పేరిట అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను ఆపేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ చెబితే, స్పందించిన సంఘాలెన్ని? అసలు సాధించింది ఏమిటి? ఏం ఆ కేసు వేసింది జర్నలిస్టు సంఘం నాయకుడు కాదా? ఆ కేసును ఆయన ఎందుకు ఉపసంహరించుకోలేదు? కేవలం ఆయన వేసిన కేసునే సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ల జారీని అర్ధాంతరంగా నిలిపివేసిన పరిస్థితికి కారకులెవరు?

నిజంగా ఆ కేసే ప్రధాన అడ్డంకి అయినప్పుడు రాష్ట్రంలోని విజయవాడ కమిషనరేట్ సహా కొన్ని జిల్లాల్లో జారీచేసిన అక్రిడిటేషన్ కార్డుల పరిస్థితి ఏమిటి? ఆయా కార్డుల జారీకి ఈ కేసు వర్తించదా? నిబంధనల ప్రకారం దరఖాస్తులు లేవని మొదటి సమావేశంలో చెప్పిన అధికారులు రెండో సమావేశం పెట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మొదటి విడత సమావేశాలు జరిగి, కార్డులు జారీచేసినప్పటికే కోర్టు కేసులు ఉన్నాయన్న విషయం అధికారులకు తెలియందేమీ కాదు. ఎవరో ఒకరిద్దరు మీడియా యాజమానులపై ఉన్న కోపాన్ని అందరిపైనా చూపించే ప్రయత్నమో లేక, తన సొంత మీడియాలోని సిబ్బందిని సైతం వైదొలగించుకునే వ్యూహమో గానీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మందికి పైగా దరఖాస్తుదారులను సందిగ్ధంలో ఉంచారు. మొన్నటి వరకూ కోర్టు కేసు అడ్డుగా ఉందని చెప్పిన అధికారులు ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నారు.. అదే, ఎన్నికల కోడ్. నిజంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జారీకి కూడా కోడ్ అడ్డువస్తుందన్నప్పుడు ఎన్నికల సంఘాన్ని సంప్రదించి అనుమతి తీసుకోవడం ద్వారా కొత్తవి ఇవ్వడం గానీ, లేదా పాత వాటిని ఎన్నికల కోడ్ ముగిసిన వరకూ గడువు పొడిగించడం గానీ చేయవచ్చు.

దిఏమైనా నిజంగానే జర్నలిస్టుల బతుకులు బాధాకరం.. ఇక, మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను వదిలేసి మారుతున్న పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వెబ్ మీడియా వైపు అడుగులు వేయాల్సిందే. యాజమాన్యాల నియంతృత్వ పోకడలకు దూరంగా, తామే యజమానులుగా ఎదిగి స్వయం ఉపాధి రంగంగా దీన్ని ఎంచుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందన్న విషయాన్ని గుర్తించాలి. అప్పుడు మీ వార్త, మీ ఇష్టం. దానిపై ఎవరి ప్రభావం ఉండదు. మీరు అనుకున్న సమస్యను లేదా పరిశోధనను బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చు.

(ఈ వ్యాసం రూపకల్పనలో గతంలో ‘ప్రజాతంత్ర’ ప్రచురించిన ‘వృత్తి ధర్మమే వారికి ఊపిరి..’ నుంచి, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చిన కొన్ని పోస్టుల నుంచి సేకరించిన వివరాలు వినియోగించడం జరిగింది. కథనం నచ్చితే మిత్రులు తమ గ్రూపుల్లో షేర్ చేయడంతో పాటు లైక్ చేస్తారని ఆశిస్తున్నాము.)