కన్న లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేసి అందజేస్తున్న ఎన్.ఎ.ఆర్.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు బండి సురేంద్రబాబు

గుంటూరు, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి నిబంధనల సాకుచూపి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా రాజకీయ పార్టీల మద్దతు కోరుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కన్నా లక్ష్మీనారాయణకు అందజేసింది.

సోమవారం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్.ఎ.ఆర్.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు బండి సురేంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వం పాత్రికేయులను నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని వివరించింది. జర్నలిస్టుల హక్కులను కాపాడాలని తమ సంఘం చేస్తున్న ప్రయత్నానికి పార్టీపరంగా సంఘీభావం తెలపాలని కోరారు.

కన్న లక్ష్మీనారాయణకు జ్ఙాపికను అందజేసి అభినందిస్తున్న ఎన్.ఎ.ఆర్.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు బండి సురేంద్రబాబు

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి జర్నలిస్టుల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండు మీడియా సంస్థలను లక్ష్యం చేసుకుని పాత్రికేయులందరికీ అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని ఎన్.ఎ.ఆర్.ఎ. అధ్యక్షుడు సురేంద్రబాబు ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పాత్రికేయులే లక్ష్యంగా జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలు కొనసాగుతుండడం దారుణమన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా పాత్రికేయులకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సదుపాయాలు అందుబాటులో లేకుండా చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్రిడిటేషన్ సదుపాయం లేకుండా చేయడం ద్వారా ఎన్నికల కవరేజీకి మీడియాను దూరం చేసిన ప్రభుత్వంపై ఎస్ఈసీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయపరమైన సమస్యలు సృష్టించడం ద్వారా పాత్రికేయుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

కన్నా లక్ష్మీనారాయణను కలసిన వారిలో సురేంద్ర బాబుతో పాటు ఎన్.ఎ.ఆర్.ఎ. నాయకులు శ్రీనివాసులు, కొల్లయ్య, ప్రదీప్, లోకేష్, గోపి, రాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.