పొగాకు రైతులకు న్యాయం

0
13 వీక్షకులు
వేలం కేంద్రంలో పొగాకు రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భాస్కర్

ఒంగోలు, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): ప్రతి రైతు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతుల సంక్షేమం కోసం జిల్లాలో వున్న పొగాకు వేలం కేంద్రాలన్ని నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఫ్లాట్ ఫామ్ నుంచి 700 క్వింటాళ్ల పొగాకు అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు.

ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పొగాకును కనీస మద్దతు ధరతో విక్రయించుకునే అవకాశాలు కల్పిస్తామన్నారు. పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వేలం కేంద్రాలకు వచ్చే రైతులంతా భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. పొగాకు కొనుగోలు చేయడానికి ఐ.టి.సి, జి.పి.ఐ, పి.ఎస్.ఎస్., ఎ.ఓ.ఐ., డెక్కన్, పి.టి.పి. కంపెనీలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టుబాకో బోర్డు ఆర్.ఎమ్. ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, తహసిల్దార్, వ్యవసాయ అధికారి సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here