Home News జర్నలిస్టుల కష్టాలు పట్టవా?

జర్నలిస్టుల కష్టాలు పట్టవా?

0
384 Views

అమరావతి, మే 13 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టుల కష్టాలు పట్టకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు పేర్కొన్నారు. కోవిడ్ మొదటి తరంగం కంటే కూడా సెకండ్ వేవ్ పాత్రికేయుల పాలిట ఆందోళనకరంగా మారిందని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో సుమారు 60 మందికి పైగా మీడియా మిత్రులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయరని, అయినా, ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. జర్నలిస్టుల కరోనా కష్టాలపై స్పందించిన ఐవీ ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని బాధిత జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని, కరోనా సెకండ్ వేవ్‌లో పలు మీడియా సంస్థలు దెబ్బతినడంతో పాటు 60 మంది వరకూ జర్నలిస్టులు అశువులు బాశారని వాపోయారు. ఏపీలో కోవిడ్ ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్ కొరతతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతీరోజు కరోనాపై సీఎం జగన్, మంత్రులు, అధికారులు, ప్రభుత్వ సలహాదారులు సమీక్షలు జరుపుతున్నారు కానీ, జర్నలిస్టుల గురించి ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం బాధాకరమన్నారు.

‘‘కరోనా మొదటి వేవ్‌లో మృతి చెందిన జర్నలిస్టులకు సంబంధించి ఆయా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధంగా జర్నలిస్టులను ఆదుకోవాలి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో కోలుకునేంత వరకూ బాసటగా నిలవాలి.’’ అని కోరారు. పలువురు జర్నలిస్టులు మృతి చెందినప్పుడు కంటితుడుపు ప్రకటనలతోనే ప్రభుత్వం సరిపెడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనాతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతుంటే సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఇంత వరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకునైనా జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే కరోనా నిబంధనలకు అనుగుణంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఐవీ హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్ని విధాలా చేయూతనందించేందుకు ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వానికి పాత్రికేయుల సంక్షేమం గుర్తుకురాకపోవడం గమనార్హమన్నారు. మునుపెన్నడూ లేనంతగా కనీసం అక్రిడిటేషన్ సదుపాయాన్ని కూడా కొనసాగించకుండా న్యాయపరమైన సమస్యల పేరుతో పెండింగ్‌లో పెట్టడం సరైనది కాదన్నారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తించాలన్నా అక్రిడిటేషన్‌తో ముడిపెట్టిన కారణంగా చాలా మంది మీడియా ప్రతినిధులు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. గత ప్రభుత్వాలు అక్రిడిటేషన్‌తో నిమిత్తం లేకుండా ప్రమాద బీమా పథకాన్ని అమలుచేసేవని, జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడంతో జర్నలిస్టులకు కనీస రక్షణ లేకుండాపోయిందన్నారు. ఆరోగ్య బీమా అమలులో ఉన్నా, ఆ పథకం ఎంత మందికి వర్తిస్తుందో? ఏమేరకు సేవలు అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వ పెద్దలకే తెలియాలన్నారు. ఆరోగ్య బీమా ఉందన్న ధీమా ఏ జర్నలిస్టులోనూ లేకపోవడం, ఆ పథకం అమలుతీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు.